జేపీ.. టీడీపీ భజనపరుడు
గట్టు రామచంద్రరావు ధ్వజం
హైదరాబాద్ : ఏసీ రూముల్లో పడుకునే లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు పేదల కష్టాలు ఏం తెలుస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. కడుపు నిండిన జేపీకి కడుపు ఎండినవారి గురించి ఆలోచించే సమయం ఉండదని, అందుకే వైఎస్సార్‌సీపీ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ అర్థం కాలేనట్లుందని విమర్శించారు. ఆయన మంగళవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ తల్లికి అయినా తన బిడ్డను చదివించుకోవాలనే తపన కచ్చితంగా ఉంటుంది. కానీ బిడ్డ తనతోపాటు పనిచేస్తే ఒక పూట గడుస్తుందనే ఆశతో పిల్లల్ని పనిలో పెడుతున్నారే తప్ప బడికి పంపకూడదని కాదు.
అందుకే అలాంటి తల్లులకు భరోసానిస్తూ పిల్లల్ని పెద్ద చదువులు చదించేందుకు అమ్మ ఒడి పథకానికి జగన్ రూపకల్పన చేశారు’’ అని వివరించారు. పేదవారి గుండె చప్పుడు నుంచి రూపొందించిన మేనిఫెస్టో కూడా జేపీకి అర్థం కాలేదంటే పేదవాళ్లకు ఆయన ఎంత దూరంగా ఉంటున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. తనకు తాను గొప్ప మేధావినంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తెలుగుదేశం పార్టీకి భజనపరుడిగా మారారని ధ్వజమెత్తారు.