k ramakrishnarao
-
జనవరి 18లోగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2022–23కి బడ్జెట్ ప్రతిపాదనల అంచనాలను ఈ నెల 18లోగా సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ విభాగాలు అంచనాలను ఈ నెల 17లోగా సంబంధిత శాఖ కార్యదర్శికి సమర్పించాలని కోరింది. 2021–22కి సవరించిన బడ్జెట్ అంచనాలనూ సమర్పించాలంది. ఈ అంచనాల్లో కేటాయింపుల పెంపును అంగీకరించమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులిచ్చారు. బడ్జెట్ అంచనాల సమర్పణలో జాప్యం ఉండొద్దని, జాప్యమైతే మార్పులకు సమయం లభించడం లేదన్నారు. గడువులోగా ప్రతిపాదనలు సమర్పించకుంటే సంబంధిత శాఖకు పథకాల అమలుకు ఆర్థిక శాఖ నిధులు కేటాయించదన్నారు. తదనంతర పరిణామాలకు సదరు శాఖదే బాధ్యతని చెప్పారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనల స్వీకరణ ప్రారంభమయింది. -
సీడీపీ నిధులు రూ.382 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద రూ.382.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రూ. 2.50 కోట్లను కేటాయిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.800 కోట్లను సీడీపీ కింద కేటాయించగా, అందులో రూ.400 కోట్లను మొదటి రెండు త్రైమాసికాలకు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా 119 మంది ఎమ్మెల్యేలు, 34 మంది ఎమ్మెల్సీలకు మొత్తం రూ. 382.50 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
10 జీవోలు.. రూ.103 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధుల విడుదల ప్రక్రియను కొనసాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం రూ.103.06 కోట్ల నిధులను మంజూరు చేయడం, విడుదల చేయడం ఒకేరోజు పూర్తయ్యాయి. మంగళ వారం ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు పది వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. నిధుల మంజూరు ఇలా.. - భూపాలపల్లి అసెంబ్లీ నియోజవకర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.34.69 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. - గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్‌లలో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కోసం రూ.ఐదు కోట్లను విడుదల చేసింది. ఒక్కో ఫంక్షన్ హాల్‌కు రూ.కోటి చొప్పన కేటాయించింది. తూప్రాన్‌లో వైకుంఠ ధామం (శ్మశాన వాటిక) నిర్మాణానికి రూ.కోటి విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఈ మేరకు నిధులు విడుదల చేసింది. - డోర్నకల్ నియోజకవర్గంలోని ఉగ్గంపల్లి, నర్సింహులపేట, కందికొండ ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2.40 కోట్లను విడుదల చేసింది. ఇందులో నర్సింహులపేట, కొందికొండ ఆలయాలకు రూ.కోటి చొప్పున, ఉగ్గంపల్లి ఆలయానికి రూ.40 లక్షలు కేటాయించింది. - ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు వేయాల్సిన 299 బోర్ల కోసం రూ.2.11 కోట్లను, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 52 బోర్లను వేసేందుకు రూ.75 లక్షలను విడుదల చేసింది. -నల్లగొండ జిల్లాలో చేపట్టిన రజక భవన్ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన రూ.50 లక్షలను మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల కోటాలో వీటిని కేటాయించింది. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 44 బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.55.61 కోట్లను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఈ నిధులు మంజూరయ్యాయి. - కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కందికొట్కూర్‌లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.కోటి విడుదల చేసింది. -
సీజీజీ డీజీగా రాజేంద్ర నిమ్జే
సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డెరైక్టర్ జనరల్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజేంద్ర నరేంద్ర నిమ్జేను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకం చేపట్టారు. ఆయనకు నెలకు రూ.రెండున్నర లక్షల జీతాన్ని అందజేయనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ నియామకం అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకు సీజీజీ డీజీగా పూర్తి అదనపు బాధ్యత లను నిర్వహించిన కె.రామకృష్ణారావును రిలీవ్ చేశారు. బుధవారం ఈ మేరకు జీఏడీ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా ఉత్తర్వులిచ్చారు.