పార్టీ ఫిరాయింపుల్లో మంత్రి కామినేని పాత్ర?
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల వెనుక బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హస్తం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా పార్టీ మారటం వెనుక ఆయన పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. చాంద్ బాషా టీడీపీలో చేరేంతవరకూ మంత్రి కామినేని...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్దే ఉన్నారు. చాంద్ బాషా పార్టీ మారే విషయంలో కామినేనే స్వయంగా పావులు కదిపినట్లు సమాచారం. కాగా కామినేని శ్రీనివాస్ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
మరోవైపు పార్టీ ఫిరాయింపుల్లో కామినేని పాత్ర ఉండటంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఆయన వ్యవహార శైలి వల్ల పార్టీకి మచ్చ వస్తోందని వారు మండిపడుతున్నారు. విపక్ష ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభపెడుతుంటే బీజేపీ చెందిన మంత్రికి ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఆయన బీజేపీ నేతగా కాకుండా టీడీపీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి.