Karnataka RTC Bus
-
చేదు అనుభవం.. బస్సులో ప్రయాణికురాలిపై యువకుడి మూత్ర విసర్జన
సాక్షి బెంగళూరు: విమానంలో ఓ వృద్ధురాలిపై బెంగళూరుకు చెందిన బడా కంపెనీ ఉన్నతాధికారి మద్యం మత్తులో మూత్రం పోయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సులో అటువంటి పాడు పని చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఈ దారుణం జరిగింది. మార్గమధ్యంలో కిరేసూరు వద్ద భోజనం కోసం డ్రైవర్ బస్సును ఆపితే కొందరు దిగిపోయారు. 28వ సీటులో ఉన్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి వచ్చి 3వ నంబరు సీటులో కూర్చున్న ఒక యువతిపై మూత్ర విసర్జన చేశాడు. భయపడిన ఆ యువతి కిందకు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలిపింది. డ్రైవర్, కండక్టర్ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తానని అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించారు. అతన్ని అక్కడే వదిలేసి బస్సు బయల్దేరింది. -
బెంగళూరు పాత బస్సు రూ. లక్ష మాత్రమే.. ఆ డొక్కు బస్సులు మాకొద్దు!
బెంగళూరు: బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) పాత బస్సులను అమ్ముతోంది. 7 లక్షల కిలోమీటర్లకు పైబడి సంచరించిన బస్సులను ఈ రకంగా వదిలించుకోనుంది. ఒక్కో బస్సు ధర కేవలం లక్ష రూపాయలే. అయితే మేం కొనేస్తాం అనుకుంటే తొందరపాటే. ఈ ధర వాయువ్య, ఈశాన్య ఆర్టీసీ విభాగాలకు మాత్రమే అన్వయిస్తుంది. ఈ మేరకు ఆర్టీసీకి బీఎంటీసీ ప్రతిపాదనలు పంపింది. తమ సోదర సంస్థలకు ఇవ్వడం కోసం బస్సుల ధరను తగ్గించారు. మిగిలిన రవాణా సంస్థలతో దీనిపై మాట్లాడలేదని ఓ బీఎంటీసీ అధికారి తెలిపారు. ఆ డొక్కు బస్సులు మాకు వద్దండి ఉత్తర కర్ణాటకలో దుస్థితికి చేరిన రోడ్లపై తిప్పడానికి బెంగళూరులో వాడి వదిలేసిన పాత బస్సుల కొనుగోలుకు వాయువ్య ఆర్టీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదెక్కడి సవతి తల్లి ధోరణి అని వాయువ్య పరిధిలోకి వచ్చే హుబ్లీ– ధార్వాడ, రూరల్, చిక్కోడి, బెళగావి, హావేరి, బాగలకోట, గదగ్, ఉత్తర కన్నడ ఇలా ఆరు జిల్లాల ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. వాయువ్యలో ప్రస్తుతం 4 వేల పైగా బస్సులు సంచరిస్తున్నాయి. అయినా ప్రజలకు తగిన రవాణా సేవలు లభించడం లేదు. దీంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్న డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ సమయంలో బీఎంటీసీకి చెందిన సుమారు 100 పాత బస్సులను కొనాలని వాయువ్య ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున సెకెండ్ హ్యాండ్ బస్సులు చాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. ఉత్తమ రవాణా సేవలకు కొత్త బస్సులను కొనలేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన సీఎం బసవరాజ్ బొమ్మై తక్షణమే న్యాయం చేయాలని కోరారు. -
చుక్కల దుప్పిని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
పెద్దదోర్నాల: రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని అతివేగంతో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దుప్పి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎకో టూరిజం సమీపంలో తెట్టగుండం వద్ద ఆదివారం జరిగింది. పెద్దదోర్నాల రేంజి అధికారి విశ్వేశ్వరరావు కథనం మేరకు శ్రీశైలం నుంచి సింథనూర్ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు తెట్టగుండం వద్దకు చేరుకునేసరికి ఆ ప్రాంతంలో ఉన్న చుక్కల దుప్పి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. వేగంగా వస్తున్న బస్సు దుప్పిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న స్వచ్ఛ సేవక్‌లు వెంటనే మండల కేంద్రంలో ఉన్న గణపతి చెక్‌పోస్టుకు సమాచారమందించడంతో అధికారులు చెక్‌పోస్టు వద్ద బస్సును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతిచెందిన చుక్కల దుప్పికి అటవీశాఖకు చెందిన పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. -
బస్సు దగ్ధం, మహిళ సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక ఆర్టీసీబస్సు ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. చిక్ మంగుళూరు నుంచి బెంగళూరుకు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగంతో ఈ ఘటన చోటుచేసుకుంది. భాగ్యమ్మ అనే మహిళ సజీవ దహనమైంది. బస్సులోని ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తగ్గింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ఉన్నారు. బస్సు ఇంజిన్ లో తలెత్తిన లోపం కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
బస్సు, కారు ఢీ: ఇద్దరి దుర్మరణం
బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. బెంగళూరుకు చెందిన కొందరు భక్తులు కారులో తిరుపతికి వెళ్తుండగా గంగవరం సమీపంలో ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సులోని 12 మంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. -
అనంతలో రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా హిందుపురం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి హిందుపురం వస్తుండగా రాజన్నకుంట సమీపంలో లారీని ఢీకొంది. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.