kiran resignation
-
సీఎం రాజీనామాపై కోర్‌కమిటీ చర్చ!
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా సంకేతాలపై కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ రాజీనామా చేస్తే ఏం చేయాలనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లోక్‌సభలో మంగళవారం రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం అనంతరం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్సింగ్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఏకే ఆంటోనీ తదితరులు సమావేశమయ్యారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపైనా వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేస్తారని సంకేతాలు అందడంతో ఈ అంశంపైనా వారు చర్చించినట్లు తెలిసింది. కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? లేక రాష్ట్రపతి పాలన విధించాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం అనంతరం రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళుతున్నందున ఈ నెలాఖరులోగా గెజిట్ వెలువడే అవకాశ ం ఉందని, అదే సమయంలో వచ్చే నెల తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కోర్‌కమిటీ చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించాలా? లేక ప్రభుత్వాన్ని కొనసాగించి కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? అనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తరువాతే తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమై సీఎం రాజీనామా, పార్టీలో పరిణామాలు, వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు తెలిసింది. -
సీఎం కిరణ్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్!
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలు జోరందుకున్న నేపథ్యంలో ఆయన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కేవలం క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయ్యారు. సందర్శకులను కూడా కిరణ్ అనుమతించటం లేదని సమచారం. మరో వారం, పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉండటం, కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా పనులు చక్కబెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. సీఎంకు సన్నిహితంగా ఉండే కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో కిరణ్ రాజీనామాపై ప్రచారం బలంగా సాగింది. అయితే, లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ వాదనను సాకుగా చూపించి, ఆయన రాజీనామాను చివరి వరకు సాగదీస్తూ వచ్చారు. కిరణ్ తన రాజీనామాపై ఇప్పటికే విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించుకున్న నేపథ్యంలో ఇక తప్పుకోకపోతే పరువు పోతుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సహచర మంత్రులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసి ఓటింగ్ జరగడానికి ముందు రాజీనామా చేసే అవకాశముందని, గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారని సీఎం సన్నిహిత నేతలు చెబుతున్నారు. -
ఎదురుదాడి చేద్దాం!: బొత్స
* సీఎం వెంట ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్టకు వ్యూహాలు * బొత్స నివాసంలో సీనియర్ మంత్రుల భేటీ * సీఎం రాజీనామా ప్రకటన వచ్చిన వెంటనే ఎదురుదాడికి సిద్ధం * రాష్ట్ర సమైక్యతకు కిరణ్ చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం సాక్షి,హైదరాబాద్: విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు రాగానే రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్న సీఎం కిరణ్‌పై ఆయన వ్యతిరేక వర్గం ఎదురుదాడికి వ్యూహ రచన చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. కిరణ్ రాజీనామా చేసిన మరుక్షణం నుంచే ఎదురుదాడి మొదలెట్టాలని నిర్ణయించారు. విభజన బిల్లు ఆమోదం పొందే వరకు అధికారాన్ని అనుభవించి, తర్వాత రాజీనామా చేస్తే ప్రజలు నమ్మరని, రాష్ట్ర సమైక్యతకు కిరణ్ చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బొత్సతో పాటు మంత్రులు సి.రామచంద్రయ్య, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కొండ్రు మురళి, బాలరాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కాండ్రు కమల, కె.సుధాకర్, బి.సత్యవతి సమావేశానికి వచ్చినా, చర్చలో పాల్గొనే అవకాశం లేక వెంటనే వెళ్లిపోయారు. సీఎం రాజీనామా చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయంపై మంత్రులు చర్చించారు. ఆయన వెంట ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేశారు. సీఎం రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే పార్టీ విస్తృత స్థాయి భేటీ, లేదా పార్టీలో ఉండాలనుకునే వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమైక్యం కోసం చివరివరకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొనేందుకు మంగళవారం ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర సమైక్యతో కోసం తమతో కలిసి రావాలని కోరుతూ సీఎం కిరణ్‌కు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఎం నేత బీవీ రాఘవులుకు సోమవారం సాయంత్రం బొత్స పేరుతో లేఖలు రాశారు. రాజీనామాలు, కొత్తపార్టీకి ప్రాధాన్యతనివ్వం: సమావేశం అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం ప్రజలను తీవ్రంగా కలచివేస్తున్న సమయంలో సీఎం కిరణ్ రాజీనామా, కొత్త పార్టీ అంశాలకు అంత ప్రాధాన్యత ఉండదని తేలిగ్గా కొట్టిపారేశారు. రాజీనామాలు, పార్టీలపై ఆలోచించడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమప్పుడే రాజీనామా చేస్తే బాగుండేదని, అప్పుడు తామిచ్చిన సలహాలను సీఎం పెడచెవిన పెట్టారని విమర్శించారు. విభజన బిల్లును అడ్డుకొంటున్న కేంద్ర మంత్రులు, ఎంపీలకు నైతిక మద్దతు కోసం ఢిల్లీ వెళ్తున్నామని, ఆదివారంనాటి సమావేశానికి సీఎం తనను పిలవలేదని చెప్పారు. కిరణ్ అసలు రంగు బయటపడింది : సీఆర్ కొత్త పార్టీ పెట్టాలన్న కిరణ్ ఆలోచన దుర్మార్గమని మంత్రి సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. సీఎంది సమైక్యవాదం కాదని, రాజకీయ లబ్ధి కోసమే ఇన్నాళ్లూ ప్రజలను, పార్టీ నేతలను మోసపుచ్చారని విమర్శించారు. అసలు రాష్ట్ర విభజనకు కారణం కిరణ్‌కు గురువైన చిదంబరమేనని, ఆయనకు సీఎం ఏ మేరకు సహకరించారో ఇప్పుడు స్పష్టమవుతోందని ఆరోపించారు. పార్టీ ద్వారా కీలక పదవులను అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయాలన్న సీఎం కిరణ్ ఆలోచన దుర్మార్గమని మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు విమర్శించారు. సీఎంగా ఎస్సీ, ఎస్టీలకు కిరణ్ ఎంతో అన్యాయం చేశారని, ఆ వర్గాలేవీ ఆయన వెంట వెళ్లబోవని అన్నారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన ఎస్సీ, ఎస్టీ నేతలకు అధిష్టానం మరో అవకాశమిచ్చినా కిరణ్ అడ్డుకున్నారని చెప్పారు. విప్ల నియామకంపై బొత్స భగ్గు సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో విప్ల నియామక వ్యవహారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌ల మధ్య విభేదాలకు దారి తీసింది. విప్‌లను నియమిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైలును మాత్రం పెండింగ్‌లో ఉంచటంపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖను సోమవారం ఆయన మీడియాకు విడుదల చేశారు. సామాజిక న్యాయం పాటించకుండా చేస్తున్న ఈ వ్యవహారాల వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతోందన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా సున్నితమైన పరిస్థితులున్న సమయంలో రెండు రోజుల క్రితం మండలిలో విప్‌లను నియమిస్తూ జారీచేసిన ఉత్తర్వులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సామాజిక కోణాలు, పార్టీ కోణాల్లో ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరం. శాసనమండలి ఏర్పాటుకు విశేషంగా పాటుపడ్డ కంతేటి సత్యనారాయణరాజు, దళిత నేతలు నందిఎల్లయ్య, రత్నాబాయిలను మండలికి నామినేట్ చేయాలని అధిష్టానం ఆదేశించినా పెండింగ్‌లో ఉంచారు. విప్ల నియామకంలో సామాజిక సమతుల్యత పాటించలేదు. ఎం.రంగారెడ్డి, రెడ్డపరెడ్డిలకు విప్ పదవులు ఎంతవరకు సమంజసం? పార్టీకి ప్రయోజనం లేని ఈ నియామకాలపై అభ్యంతరం తెలియచేస్తున్నా’ అని లేఖలో బొత్స పేర్కొన్నారు. -
సీఎం రాజీనామా చేస్తే నేనూ చేస్తా
గుంటూరు : రాష్ట్ర విభజన అనివార్యమైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని త్యాగం చేస్తారని గతంలో ప్రకటించారనీ, ఒకవేళ అదే జరిగితే తానూ రాజీనామా చేసి ముఖ్యమంత్రిని అనుసరిస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన విషయంలో శాస్త్రీయ పద్ధతులు పాటించలేదని చెప్పారు. ఇప్పటివరకు పార్లమెంట్ జరగకుండా ఎంపీలు చాలా చక్కగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని, ఇకమందు కూడా అదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
'సీఎం రాజీనామా వార్తలు ఊహాగానాలే'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వార్తలు ఊహాగానాలే అని మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం వీరు ఇరువురు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం టీజీ, ఏరాసు మీడియాతో మాట్లాడుతూ విభజన బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం తర్వాతే ముఖ్యమంత్రి భవిష్యత్ కార్యచరణ ఉంటుందని అన్నారు. కాగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కార్యాలయానికి చేరటం, ఆ వెంటనే ఆయన దానిపై సంతకం కూడా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు నిన్న రాత్రే సమాచారం అందింది. బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉందన్న సంకేతాలూ సీఎం వర్గీయులకు అందాయి. కాగా రాష్ట్రపతి నిర్ణయం తర్వాతే సీఎం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.