
ఎదురుదాడి చేద్దాం!: బొత్స
* సీఎం వెంట ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్టకు వ్యూహాలు
* బొత్స నివాసంలో సీనియర్ మంత్రుల భేటీ
* సీఎం రాజీనామా ప్రకటన వచ్చిన వెంటనే ఎదురుదాడికి సిద్ధం
* రాష్ట్ర సమైక్యతకు కిరణ్ చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు రాగానే రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్న సీఎం కిరణ్‌పై ఆయన వ్యతిరేక వర్గం ఎదురుదాడికి వ్యూహ రచన చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. కిరణ్ రాజీనామా చేసిన మరుక్షణం నుంచే ఎదురుదాడి మొదలెట్టాలని నిర్ణయించారు. విభజన బిల్లు ఆమోదం పొందే వరకు అధికారాన్ని అనుభవించి, తర్వాత రాజీనామా చేస్తే ప్రజలు నమ్మరని, రాష్ట్ర సమైక్యతకు కిరణ్ చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బొత్సతో పాటు మంత్రులు సి.రామచంద్రయ్య, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కొండ్రు మురళి, బాలరాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కాండ్రు కమల, కె.సుధాకర్, బి.సత్యవతి సమావేశానికి వచ్చినా, చర్చలో పాల్గొనే అవకాశం లేక వెంటనే వెళ్లిపోయారు. సీఎం రాజీనామా చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయంపై మంత్రులు చర్చించారు. ఆయన వెంట ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేశారు. సీఎం రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే పార్టీ విస్తృత స్థాయి భేటీ, లేదా పార్టీలో ఉండాలనుకునే వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమైక్యం కోసం చివరివరకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొనేందుకు మంగళవారం ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర సమైక్యతో కోసం తమతో కలిసి రావాలని కోరుతూ సీఎం కిరణ్‌కు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఎం నేత బీవీ రాఘవులుకు సోమవారం సాయంత్రం బొత్స పేరుతో లేఖలు రాశారు.
రాజీనామాలు, కొత్తపార్టీకి ప్రాధాన్యతనివ్వం: సమావేశం అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం ప్రజలను తీవ్రంగా కలచివేస్తున్న సమయంలో సీఎం కిరణ్ రాజీనామా, కొత్త పార్టీ అంశాలకు అంత ప్రాధాన్యత ఉండదని తేలిగ్గా కొట్టిపారేశారు. రాజీనామాలు, పార్టీలపై ఆలోచించడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమప్పుడే రాజీనామా చేస్తే బాగుండేదని, అప్పుడు తామిచ్చిన సలహాలను సీఎం పెడచెవిన పెట్టారని విమర్శించారు. విభజన బిల్లును అడ్డుకొంటున్న కేంద్ర మంత్రులు, ఎంపీలకు నైతిక మద్దతు కోసం ఢిల్లీ వెళ్తున్నామని, ఆదివారంనాటి సమావేశానికి సీఎం తనను పిలవలేదని చెప్పారు.
కిరణ్ అసలు రంగు బయటపడింది : సీఆర్
కొత్త పార్టీ పెట్టాలన్న కిరణ్ ఆలోచన దుర్మార్గమని మంత్రి సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. సీఎంది సమైక్యవాదం కాదని, రాజకీయ లబ్ధి కోసమే ఇన్నాళ్లూ ప్రజలను, పార్టీ నేతలను మోసపుచ్చారని విమర్శించారు. అసలు రాష్ట్ర విభజనకు కారణం కిరణ్‌కు గురువైన చిదంబరమేనని, ఆయనకు సీఎం ఏ మేరకు సహకరించారో ఇప్పుడు స్పష్టమవుతోందని ఆరోపించారు. పార్టీ ద్వారా కీలక పదవులను అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయాలన్న సీఎం కిరణ్ ఆలోచన దుర్మార్గమని మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు విమర్శించారు. సీఎంగా ఎస్సీ, ఎస్టీలకు కిరణ్ ఎంతో అన్యాయం చేశారని, ఆ వర్గాలేవీ ఆయన వెంట వెళ్లబోవని అన్నారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన ఎస్సీ, ఎస్టీ నేతలకు అధిష్టానం మరో అవకాశమిచ్చినా కిరణ్ అడ్డుకున్నారని చెప్పారు.
విప్‌ల నియామకంపై బొత్స భగ్గు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో విప్‌ల నియామక వ్యవహారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌ల మధ్య విభేదాలకు దారి తీసింది. విప్‌లను నియమిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైలును మాత్రం పెండింగ్‌లో ఉంచటంపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖను సోమవారం ఆయన మీడియాకు విడుదల చేశారు. సామాజిక న్యాయం పాటించకుండా చేస్తున్న ఈ వ్యవహారాల వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతోందన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా సున్నితమైన పరిస్థితులున్న సమయంలో రెండు రోజుల క్రితం మండలిలో విప్‌లను నియమిస్తూ జారీచేసిన ఉత్తర్వులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
సామాజిక కోణాలు, పార్టీ కోణాల్లో ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరం. శాసనమండలి ఏర్పాటుకు విశేషంగా పాటుపడ్డ కంతేటి సత్యనారాయణరాజు, దళిత నేతలు నందిఎల్లయ్య, రత్నాబాయిలను మండలికి నామినేట్ చేయాలని అధిష్టానం ఆదేశించినా పెండింగ్‌లో ఉంచారు. విప్‌ల నియామకంలో సామాజిక సమతుల్యత పాటించలేదు. ఎం.రంగారెడ్డి, రెడ్డపరెడ్డిలకు విప్ పదవులు ఎంతవరకు సమంజసం? పార్టీకి ప్రయోజనం లేని ఈ నియామకాలపై అభ్యంతరం తెలియచేస్తున్నా’ అని లేఖలో బొత్స పేర్కొన్నారు.