kotapally
-
ఫోటో షూట్ కోసం వెళ్లి.. గోదావరిలో ఇద్దరు టీచర్లు గల్లంతు..
సాక్షి, మంచిర్యాల: వారు ముగ్గురూ ఉపాధ్యాయులు. వృతి నిమిత్తం కేరళ నుంచి వచ్చారు. చెన్నూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఫోటోషూట్, సరదాగా గడిపేందుకు ముగ్గురూ గోదావరి నది వద్దకు వెళ్లారు. ముగ్గురూ కలిసి నదీ తీరంలో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరు బయటకు వచ్చారు. ఈ విషాద ఘటన కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో జరిగింది. ఎస్సై చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కేరళకు చెందిన టోనీ, బిజూ, ఆంటోనీ సరదా కోసం ఆదివారం గోదావరి తీరానికి వెళ్లారు,. ఫోటో షూట్ అనంతరం నదిలో ఈతకొడుతుండగా బిజూ, టోనీ గల్లంతయ్యారు. ఆంటోనీ ఒడ్డుకు చేరారు. వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం వెతుకున్నారు. -
అయ్యో బిడ్డా! నువ్వు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి
సాక్షి, కోటపల్లి(చెన్నూర్): ‘‘అయ్యో బిడ్డా.. చేతికందివచ్చిన నువ్వు మాకు చేదోడుగా ఉంటావనుకుంటే నిన్ను ప్రాణహిత నది పొట్టనపెట్టుకుందా.. కోటి ఆశలతో పెంచుకున్న నువ్వు మాకు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి..’’ అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో గ్రామానికి చెందిన విద్యార్థులు అంబాల విజేందర్‌సాయి(16), వంశీవర్ధన్(18), గారె రాకేశ్(20) సోమవారం సరదాగా స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఇద్దరి మృతదేహాలు లభించాయి. మరొకరి ఆచూకీ లభించలేదు. పెద్ద వలతో గాలింపు.. గజ ఈతగాళ్లు, సింగరేణి రెస్క్యూ టీం స్పీడ్ బోట్‌తో మంగళవారం గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు మండలంలోని వెంచపల్లి, రాచర్ల, జనగామ గ్రామాలకు చెందిన మత్స్యకారులను పిలిపించారు. 20 మంది దండెంగ(పెద్ద వల)తో నాటుపడవల సహాయంతో నదిలో గాలింపు చేపట్టారు. మొదట అంబాల విజయేందర్‌సాయి మృతదేహాం వలకు చిక్కింది. 20 నిమిషాల తర్వాత వంశీవర్ధన్ మృతదేహం లభ్యమైంది. దీంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరి మృతదేహాలకు డాక్టర్ విజిత్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలిసి వీడియో రికార్డింగ్ సహాయక చర్యల పర్యవేక్షణ గాలింపు చర్యలను ఆర్డీవో వేణు, జైపూర్ ఏసీపీ నరేందర్ పర్యవేక్షించారు. సింగరేణి రెస్క్యూ టీం, స్థానిక జాలర్లను సమన్వయం చేస్తూ మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చారు. గాలింపు చర్యలు వేగవంతానికి అవసరమైన వాటిని సమకూర్చారు. కొనసాగుతున్న గాలింపు మరో విద్యార్థి గారె రాకేశ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు విద్యార్థులు విగతజీవులై కనిపించడంతో రాకేశ్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ కొడుకు ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలని విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కదిలించింది. మంగళవారం సాయంత్రం చీకటి పడే వరకు గాలింపు చర్యలు చేపట్టినా రాకేశ్ ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. చదవండి: వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్ మాజీ ఎమ్మెల్సీ పరామర్శ విజయేందర్‌సాయి, వంశీవర్ధన్ మృతదేహాలు లభ్యం కాగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ నివాళులు అర్పించారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేశారు. ఆయన వెంట ఎంపీపీ మంత్రిసురేఖా, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాసరావు, సర్పంచ్ కుమ్మరి సంతోశ్, గట్టు లక్ష్మణ్‌గౌడ్, జెల్ల సతీశ్, పున్నంచంద్, సత్యనారాయణరావు, ఎంపీటీసీలు తిరుపతి, శేఖర్, జెడ్పీకోఆప్షన్ అజ్గర్, పీఏసీఎస్ ఛైర్మన్ సాంబగౌడ్, నాయకులు ఉన్నారు. -
అయ్యో కొడుకా.. ఎంత పనాయె..!
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్) : అయ్యో కొడుకా ఎంత పనాయే.. సెలవులకు రాకున్నా బతికేటోడివి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటావనుకుంటే అంతలోనే కన్నుమూశావా కొడుకా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు గోదావరిలోకి వెళ్లి నాటు పడవ మునిగి చెన్నూర్ పట్టణానికి ఆర్మీ జవాన్ రాజ్‌కుమార్ మృతి చెందిన విషయం తెల్సిందే. పట్టణానికి చెందిన గుండమీది రాజన్న, సునీత దంపతులకు కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె ఉన్నారు. రాజ్‌కుమార్‌ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఉన్నత చదువులు చదివిన రాజ్‌కుమార్ 2017లో ఆర్మీలో ఉద్యోగం సాధించి.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని లేహ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజ్‌కుమార్‌కు సెలవులు మంజూరుకాగా.. మూడురోజుల క్రితం ఇంటికొచ్చాడు. సోమవారం ఉదయం స్నేహితులతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మండలంలోని ఎర్రాయిపేట గోదావరినదిలో నాటుపడవ మునిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. హోటల్లో దినసరి కూలీగా పనిచేసే రాజన్న తన కుమారుడిని కష్టపడి చదివించిన ప్రయోజకుడిగా చూద్దామన్న కల నెరవేరకుండా పోయింది. నదితీరం వద్దే ప్రశాంత్ తల్లిదండ్రులు చెన్నూర్‌కే చెందిన బండి శంకర్, రాజేశ్వరికి ఇద్దరు కుమారులు. ప్రశాంత్ డ్రైవింగ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేద్దామని స్నేహితులతో కలిసి వెళ్లాడు. నాటుపడవ మునగడంతో ప్రశాంత్ గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. కొడుకు ఇంటి నుంచి వెళ్లి రెండు రోజులు గడిచినా ఇంతవరకు జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి వద్దే నిరీక్షిస్తూ.. ‘ఎప్పుడొస్తావు కొడుకా..’ అంటూ ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మంగళవారం రాత్రి వరకూ గోదావరిలో కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి నది వద్దే వేచిచూస్తున్నారు. ఆరుగురు స్నేహితులు కలిసి సోమవారం నాటుపడవలో గోదావరిలో ఈతకొట్టేందుకు బయల్దేరి సగం దూరం వెళ్లగానే ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వీరిలో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరగా.. రాజ్‌కుమార్, ప్రశాంత్ గల్లంతయ్యారు. సంఘటన జరిగిన గంట తర్వాత బండి శ్రీనివాస్ అనే యువకుడు తన తండ్రి శంకర్‌కు ఫోన్లో విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ నాగరాజ్ సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో సోమవారం నుంచి మంగళవారం వరకూ గాలింపు చర్యలు చేపట్టగా.. రాజ్‌కుమార్ మృతదేహం లభించింది. ప్రశాంత్ జాడ మాత్రం ఇంకా తెలియడం లేదు. -
‘ప్రాదేశిక’ ఓటర్లు 57,789
సాక్షి, కరీంనగర్‌రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లతో ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తులు చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో 24,402, కరీంనగర్‌రూరల్ మండలంలో 33,387 ఓటర్లు, మొత్తం 57,789 మందితో కూడిన కొత్త ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారులు శని వారం విడుదల చేశారు. ఆయా గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలున్నట్లయితే ఈనెల 20వరకు లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 27న ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ మండల పరిషత్ సమావేశమందిరంలో కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు చెందిన రాజకీయపక్షాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయపార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో పవన్‌కుమార్ కోరారు. ఎంపీటీసీ కోసం ప్రయత్నాలు ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో స్థానిక నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తూ నే మరోవైపు ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు మద్దతు కూడగట్టుతున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతో ఉండటంతో రిజర్వేషన్ల ప్రకా రం పోటీచేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు నాయకులు మరోమారు పోటీ చేసేం దుకు సమాయత్తమవుతున్నారు. రిజర్వేషన్లు కలి సిరాని నాయకులు తమ భార్యలను బరిలో దిం చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్‌రూరల్ మండలంలో మొత్తం 12, కొత్తపల్లి మం డలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కరీంనగర్‌రూరల్ ఎంపీపీ పదవి జనరల్, కొత్తపల్లి ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో పలువురు నాయకులు ఎంపీపీ పదవికోసం పావులు కదుపుతున్నారు. కరీంనగర్ ఎంపీపీ కోసం జనరల్ ఎంపీటీసీస్థానాలైన బొమ్మకల్–2, నగునూరు–2, గోపాల్పూర్, చెర్లభూత్కూర్, చామన్‌పల్లి ఎంపీటీసీలకు అవకాశముంది. అదేవిధంగా కొత్తపల్లి ఎంపీపీ కోసం బావుపేట–1, చింతకుంట–1, నాగులమల్యాల ఎంపీటీసీ స్థానా ల నుంచి మహిళలకు అవకాశముంది. దీంతో ఈస్థానాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు నాయకులు పోటిచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. స్థానిక నాయకుల నుంచి అవసరమైన మద్దతు కూడగట్టుతున్నారు. సతీమణులకు అవకాశం కరీంనగర్‌రూరల్ జెడ్పీటీసీ స్థానం జనరల్ మ హిళ, కొత్తపల్లి జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు కేటాయించడంతో అధికారపార్టీకి చెందిన పలువు రు నాయకులు తమ భార్యలను రంగంలోకి దిం పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్‌రూరల్ జెడ్పీటీసీ కోసం టీఆర్ఎస్ నుంచి బొమ్మకల్, చేగుర్తి మాజీ సర్పంచులు పురుమల్ల లలిత, బల్మూరి భాగ్యలక్ష్మి, దుర్శేడ్ ఎంపీటీసీ కోరుకంటి శోభరాణి, బీజేపీ నుంచి మొగ్ధుంపూర్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి లక్ష్మి, కాంగ్రెస్‌పార్టీ నుంచి ఇరుకుల్ల మాజీ సర్పంచ్ మారుతీరావు సతీమణి శ్వేత పోటీచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తపల్లి జెడ్పీటీసీ కోసం బావుపేటకు చెందిన పిల్లి మహేశ్‌గౌడ్, మల్కాపూర్మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్‌గౌడ్, ఎలగందల్‌కు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిమ్మ ల అంజయ్య తదితరులు తమ సతీమణులను పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు 57,789 కొత్తపల్లి మండలం 24,402 కరీంనగర్‌రూరల్ మండలం 33,387 -
గ్రామంలో వైద్య శిబిరం
కోటపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం షట్పల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య, ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్యులు నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో జరిగిన వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వైద్య అధికారులు ముందస్తుగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. -
నాటుసారా స్థావరాలపై దాడి
కోటపల్లి : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని మూడు గ్రామపంచాయితీల పరిధిలోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ లక్ష్మణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆల్గాం, పుల్లగాం, వెంచపల్లి గ్రామపంచాయితీల పరిధిలోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో నాలుగు వేల లీటర్ల నల్ల బెల్లం పానకం, 60 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మూడు పంచాయతీల్లో కలిపి ఏడు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే దాడులు జరిపే సమయానికి కొద్ది నిముషాల ముందే నిందితులు పరారైనట్లు గుర్తించామన్నారు. కేసు విచారణ పురోగతిని దృష్టిలో ఉంచుకుని నిందితుల పేర్లు వెల్లడించడం లేదని, త్వరలో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని వివరించారు. -
పండుగ పప్పలు తిని విద్యార్థులకు అస్వస్థత
కోటపల్లి : పాడైపోయిన తినుబండారాలు తినడంతో 13 మంది చిన్నపిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కోటపల్లిలోని ఉషోదయ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఓ బాలిక తన స్నేహితుల కోసం ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో చేసిన తినుబండారాలను మంగళవారం పాఠశాలకు తీసుకుని వచ్చింది. భోజన విరామంలో వాటిని తిన్న13 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే వారిని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా అనారోగ్యానికి గురైన పిల్లలందరూ ఐదేళ్లలోపు చిన్నారులే కావడంతో వారి తల్లిదండ్రులు.. పిల్లలకు ఏమవుతుందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి చక్కబడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.