కోటపల్లి : పాడైపోయిన తినుబండారాలు తినడంతో 13 మంది చిన్నపిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కోటపల్లిలోని ఉషోదయ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఓ బాలిక తన స్నేహితుల కోసం ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో చేసిన తినుబండారాలను మంగళవారం పాఠశాలకు తీసుకుని వచ్చింది.
భోజన విరామంలో వాటిని తిన్న13 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే వారిని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా అనారోగ్యానికి గురైన పిల్లలందరూ ఐదేళ్లలోపు చిన్నారులే కావడంతో వారి తల్లిదండ్రులు.. పిల్లలకు ఏమవుతుందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి చక్కబడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.