Koti (music director)
-
సరికొత్త బాణీలే.. భవిష్యత్తుకు బాటలు!
సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరిశ్రమలో సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ షో సరిగమప 16వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు.ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్ఛమైన, సహజమైన సంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందని అన్నారు. ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఎంపిక చేసిన మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా తీర్చిదిద్దేలా సానబెడతామని తెలిపారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
విడిపోవద్దురా అన్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న కోటి
రాజ్- కోటి ద్వయం టాలీవుడ్లో తెలియని వారు ఉండరు. వారిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతమందించారు. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామన్నారు. ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన సహచరుడు కోటి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారని ఆయన అన్నారు. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడినని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయన్నారు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. 'నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నా. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా. మొన్న ఈ మధ్యే ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నేను పుట్టాక మా అమ్మానాన్న నా ముఖం కూడా చూడలేదు: హీరోయిన్) వారి మధ్య బంధం గురించి మాట్లాడుతూ.. 'చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాను. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు' అని అన్నారు. -
ఆస్ట్రేలియాలో సంగీత దర్శకుడు కోటికి గౌరవ పురస్కారం
-
కోటీకి జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారం
ప్రముఖ సినీ, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు సాలూరు కోటేశ్వరరావుకు జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారాన్ని ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ప్రదానం చేశారు. కోలగట్ల మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శారదా సేవా సంఘం ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు కోటిని గౌరవించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పురస్కార గ్రహీత కోటి మాట్లాడుతూ.. విజయనగరంలో జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గాయకుడు మధుబాబు, శారదా సేవా సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్, చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
విలన్‌గా మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఫస్ట్‌లుక్ రిలీజ్.. పెజ్జొని పేటోడికి పని ఇస్తే
ప్రముఖ సంగీతదర్శకుడు కోటి ప్రతినాయకుడిగా మారారు. పగ పగ పగ అనే చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ చిత్రంలోని కోటి ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను శుక్రవారం ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. హలో పెజ్జొని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసే చస్తాడు అనే డైలాగ్ గ్లింప్స్‌లో వినిపిస్తుంది. చదవండి: ఆనంద్ దేవరకొండ 'బేబీ' డబ్బింగ్ షురూ సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ పగ పగ పగ చిత్రం రూపొందింది. రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో సత్యనారాయణ సుంకర నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం కోటి, కెమెరా నవీన్ కుమార్ చల్లా, సహ్మ నిర్మాత సత్యవతి. చదవండి: పంజాబీ స్టైల్లో.. కోకా సాంగ్‌తో పిచ్చెక్కిస్తున్న రౌడీ హీరో -
ఆ సినిమా తర్వాత అందుకే చిరంజీవితో పని చేయలేదు: కోటి
Music Director Koti Comments On Clash With Chiranjeevi Goes Viral: మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్‌ను అందించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి-కోటి కాంబినేషన్లో పదహారేళ్ల వయసు, అందమా అందుమా, ప్రియ రాగాలే.. వంటి ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరికి మంచి అనుబంధం ఉండేదని, అయితే ఓ సంఘటన కారణంగా కొంత గ్యాప్ వచ్చిందని కోటి అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూలో ఇందుకు ఇద్దరి మధ్య ఎందుకు బ్రేక్ వచ్చిందో తెలిపారు. చదవండి: వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వేసుకున్న షర్ట్ అంత ఖరీదా? 'ఓ సినిమా 100డేస్ ఫంక్షన్ ఓంగోలులో జరిగింది. అది మా అత్తగారి ఊరు కావడంతో ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్లా. అయితే హఠాత్తుగా నాకు హైఫీవర్ రావడంతో ఫంక్షన్‌కు రాలేకపోయాను. కానీ నేను కావాలనే ఫంక్షన్‌కు రాలేదని కొందరు చిరంజీవికి ఉన్నవి, లేనివి చెప్పారు. ఆ తర్వాత నేను అసలు విషయం చెప్పడానికి ఆఫీసుకు వెళ్లితే, అప్పుడు ఆయన మాట్లాడే మూడ్‌లో లేనని అన్నారు. చిరంజీవి అలా రియాక్ట్ కావడంలో తప్పులేదనిపించింది. దీంతో వెనక్కు వచ్చేశాను.హిట్లర్ తర్వాత మళ్లీ చిరంజీవితో పని చేయలేదు. అలా ఆ ఫంక్షన్ నన్ను ఆయనకి దూరం చేసింది' అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్ దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ -
సంగీత దర్శకుడు కోటి కొడుకు హీరో.. వాణి విశ్వనాథ్ కూతురు హీరోయిన్
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూర్, సీనియర్ నటి వాణి విశ్వనాథ్ కుమార్తె వర్ష విశ్వనాథ్ జంటగా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రొడక్షన్ నెంబర్ 1' చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభం అయ్యింది. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడిగా పనిచేస్తున ఈ సినిమాకి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాలో మ్యూజిక్ డెరెక్టర్ కోటి ఓ ముఖ్య పాత్ర లో నటిస్తుండగా.. సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వీరేష్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు మా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్స్ రాజీవ్, వర్ష మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని’ తెలిపాడు. దర్శకుడు కిట్టు మాట్లాడుతూ.. ‘సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఎంతో ఎంటర్టైనింగ్గా తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చే ప్రతి అంశం ఈ చిత్రంలో ఉంటుంది. నన్ను నమ్మి దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గాజుల వీరేష్ గారికి ధన్యవాదాలు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని’ అన్నారు. -
‘ఇది చాలా బాగుందిలే..’ పాట విన్నారా?
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా సంగీత దర్శకుడు కోటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘ఇది చాలా బాగుందిలే..’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘ఇది చాలా బాగుందిలే..’ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ పాడారు. ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సెహరి’. సిమ్రాన్‌పై హర్ష్ తన లవబుల్ ఫీలింగ్‌ను చెప్పే క్రమంలో ‘ఇది చాలా బాగుందిలే’ పాట వస్తుంది’’ అన్నారు. -
మైండ్‌లోనే అంతా ఉంది: కోటి
టాలీవుడ్ అగ్రగామి సంగీత దర్శకుడు కోటి.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కమనీయ సంగీతాన్ని కనువిప్పు కలిగించే సందేశాత్మకంగా మలిచారు. మహమ్మారిపై అవగాహన పెంచారు. చిరంజీవి సహా పెద్ద స్టార్స్‌తో ఆయన స్వరపరచిన ‘నీ చేతల్లోనే కదా భవిత..’ పాట లక్షలాది మందిని ఆకట్టుకుంది. ఆ విజయం స్ఫూర్తితో మరో మూడు పాటలు రూపొందించారాయన. తాజాగా సేవ్ ద వరల్డ్ పేరుతోనూ పర్యావరణంపై అవగాహన పెంచుతూ ఓ ఆల్బమ్ విడుదల చేశారు. సందేశాత్మక ఆల్బమ్స్ విడుదల చేయడంతో పాటు ఔత్సాహిక గొంతులకు సానపెట్టే పనిలో ఉన్న ఈ సక్సెస్ఫుల్ సంగీత దర్శకుడు ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, హైదరాబాద్: సంగీతం అంటే సంతోషాన్ని పంచేది మాత్రమే కాదు సందేశాన్ని అందించేది కూడా.. అయితే మా లాంటి సినీ సంగీత దర్శకులకు అలాంటి అవకాశం ఎప్పుడో గానీ రాదు. అయితే కరోనా వ్యాప్తి, అది సృష్టించిన భయం.. లాక్డౌన్ పరిస్థితులు నాకు ఆ అవకాశం ఇచ్చాయి. కోవిడ్ గురించి ప్రజల్లో భయాందోళన పెరుగుతున్న తొలినాళ్లలో నాకు తెలిసున్న శ్రీనివాస్‌మౌళి అనే యంగ్ రైటర్ రాసిన పాట ఒకటి చాలా బాగా నచ్చింది. దాన్ని రికార్డ్ చేసి ఆడియో అందరికీ షేర్ చేశాను. అది విని చిరంజీవి ముందుకు వచ్చి ఆల్బమ్ చేద్దాం అన్నారు. దాంతో అది మెగా ఆల్బమ్ అయిపోయింది. జాతీయ స్థాయిలో రీచ్ అయింది. ప్రధాని మోడీ సైతం ట్వీట్ చేయడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత కరోనా వారియర్స్ అయిన పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ మరొకటి, డాక్టర్స్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఇంకొకటి మూడు పాటలు చేశాను. వీటికీ బాగా రెస్పాన్స్ వచ్చింది. పర్యావరణాన్ని మనం ఎంత డిస్ట్రబ్ చేస్తున్నాం? దీని వల్ల మనకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి అనే ఆలోచన రేకెత్తించేలా ‘సేవ్ ద వరల్డ్’ అనే ఆల్బమ్ చేశాను. కొంత కాలంగా జీ తెలుగు చానెల్లో నిర్వహిస్తున్న సరిగమప పోటీలతో సహా పలు రియాల్టీ షోస్‌కి జడ్జిగా వ్యవహరిస్తున్నాను. నేను గమనించింది ఏమిటంటే.. ఈ షోస్ ద్వారా మంచి టాలెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆ ఫేమ్‌తో కొద్ది రోజులు డబ్బులు సంపాదించుకుని సెటిలైపోతున్నారు గానీ బాలు చిత్ర మాదిరి దీర్ఘకాలం రాణించలేకపోతున్నారు. పాడేటప్పుడు సీనియర్ గాయకుల ప్రభావం తమ మీద పడకుండా జాగ్రత్త పడాలి. వాయిస్‌లో కొత్తదనం ప్రయత్నించాలి. అప్పుడే మంచి కెరీర్ అందుకుంటారు. సిధ్ శ్రీరామ్ లాగా... మైండ్‌లోనే అంతా ఉంది.. ఆరుపదుల వయస్సులోనూ ఇంత హుషారుగా, అంత యంగ్‌గా హుషారుగా ఎలా కనపడుతున్నావని జీ ప్రోగ్రామ్ చూస్తున్నవాళ్లు అడుగుతున్నారు. సంగీతం అనే మంచి వ్యాపకంతో పాటు.. మైండ్ మీద కంట్రోల్ నా ఆరోగ్యానికి ప్రధాన కారణం. ఒకప్పుడు విపరీతంగా సిగిరెట్లు కాల్చేవాడ్ని. మానేయాలనుకుని మానేశాను. అప్పటి నుంచి మైండ్ మీద కంట్రోల్ ఏర్పడింది. ఏ సమస్య అయినా మన మైండ్‌తోనే ముడిపడి ఉంటుంది. ఎప్పుడూ మనసు నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలి. బ్రీతింగ్ వ్యాయామాలు మంచివి. డబ్బు సంపాదించాలి కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం ఇంకా అవసరం. ఏ విషయంలోనూ ఒత్తిడి, భయం వద్దు. నిద్రలేమి, టెన్షన్స్, వ్యసనాలే ప్రధాన అనారోగ్య కారణాలు. ఈ నగరంలో అణువణువూ నాకు ఇష్టమైందే.. దాదాపు 22 ఏళ్ల క్రితం అంటే 1998లోనే నేను హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. రెండేళ్ల తర్వాత నా ఫ్యామిలీ కూడా వచ్చేసింది. ప్రస్తుతం నా నివాసం నగరంలోని గండిపేట్‌లో.. బంజారాహిల్స్ కాకుండా నా మనస్తత్వానికి తగ్గట్టుగా ప్రశాంతమైన వాతావరణంలో నా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా.. మంచి మనిషికో పాట.. పంచుకుంటా.. మాటల ద్వారా చెప్పడం, కవితల ద్వారా చెప్పడం కన్నా సంగీతం ద్వారా అందరికీ ఇంకా బాగా చేరువవుతుంది. ఏ పదానికి ఏ స్వరం జతపరిస్తే హృదయానికి హత్తుకుంటుందో గుర్తించే జ్ఞానం భగవంతుడు మాకు ఇస్తాడు కాబట్టి మా లాంటి సంగీత దర్శకులు ఇలాంటి సందేశాత్మక గీతాలు చేయాలి. చేస్తాం కూడా. అది మా బాధ్యత. సోషల్ కాజ్ మీద ఇంకా కొన్ని చేయాలనుంది. స్టార్స్ మద్దతు ఇస్తారని నమ్మకం ఉంది. -
పాటే నా ప్రాణం.. నా ప్రపంచం
సాక్షి, తూర్పుగోదావరి: ఆయనో ప్రముఖ సంగీత దర్శకుడి కుమారుడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. కళ్లల్లోకి కళ్లుపెట్టి చూడవెందుకు.. ఇటువంటి ఎమోషనల్ పాటలు, గువ్వ గోరింకతో.. జివ్వుమని కొండగాలి.. అందమా అందుమా ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్, కోకిల కోకిల కో అన్నది.. ప్రియరాగాలే గుండెలోన వంటి మెలోడీలు చేయడం స్వర కిరీటి సాలూరి కోటేశ్వరరావు(కోటి)కే చెల్లింది. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడంలో 500కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన కోటి సాలూరి రాజేశ్వరరావు కుమారుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాటే నా ప్రాణం.. నా ప్రపంచం అని, ప్రతి సినిమాను తొలి సినిమాగా, ప్రతి పాటను తొలి పాటగానే భావిస్తానని, అందుకే సక్సెస్‌ను అందుకోగలిగానంటున్నారు సంగీత దర్శకుడు కోటి. రాయవరం మండలం పసలపూడి వచ్చిన సందర్భంగా సంగీత దర్శకుడు కోటి పంచుకున్న సంగీత దర్శకత్వ స్వానుభవాలు.. ఆయన మాటల్లోనే.. నేను మెచ్చిన బాణీలు నేను చేసిన సినిమాలన్నీ సంగీతపరంగా హిట్ అయ్యాయి. అన్ని పాటలను మనస్సు పెట్టి చేశా. ప్రియరాగాలే.. ముఠామేస్త్రి.. బావలు సయ్యా.. కోకిల కోకిల.. కదిలే కాలమా.. ఇదేలే తరతరాల చరితం ఇలా అనేక పాటలు నాకు నచ్చినవే. తొలిసారి నటుడిగా... ఇప్పటి వరకు సంగీత దర్శకత్వం వహిస్తున్న నేను తొలిసారిగా సినిమాలో నటిస్తున్నా. నాన్న కోరిక నన్ను ఐపీఎస్‌గా చూడాలని ఉండేది. అనుకోకుండానే సంగీతం ఆవహించింది. ఇప్పుడు సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ‘దేవినేని’ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ వేదవ్యాస్ క్యారెక్టర్ చేశాను. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ పాత్రతో సుగ్రీవ అనే సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లావాసులు ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరు. ఇక్కడి పచ్చటి వాతావరణం, గోదావరి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు మనసును పరవశింపజేస్తాయి. గోదావరి జిల్లావాసులతో ఉన్న అనుబంధం మరువలేనిది, మరపురానిది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత జిల్లాలో పర్యటిస్తా. మనసుకు హత్తుకుంటేనే.. ప్రజల మనస్సుకు హత్తుకుంటేనే జీవం ఉన్న పాటగా మిగిలి పోతుంది. ఇప్పుడు వస్తున్న సంగీత దర్శకులు కూడా బాగానే చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యే పాటలకు బాణీలు కట్టాలని కొత్తగా వచ్చే సంగీత దర్శకులకు సూచిస్తున్నా. తండ్రి నుంచి వారసత్వంగా... నా తండ్రి సాలూరు రాజేశ్వరరావు నుంచి సంగీతాన్ని వారసత్వంగా తీసుకున్నా. ఆయన తనయుడిగా పుట్టడమే నా అదృష్టం. సంగీత వారసత్వాన్ని నా రెండో కుమారుడు రోషన్ తీసుకున్నాడు. ప్రజలు మెచ్చిన బాణీలను చేయడం వల్లే సక్సెస్ పొందగలిగా. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడంలో 500కు పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశా. ప్రతి ఒక్కరిదీ బాధ్యత కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. స్వీయ జాగ్రత్తలతోనే కరోనాను దూరం చేయగలం. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే అనవసరంగా బయట తిరగడం మానుకోవాలి. దీన్ని ఒక హెచ్చరికగా అందరూ భావించాలి. పాట రూపంలో చెబితే మనస్సును హత్తుకుంటుందనే కరోనాను తరిమికొట్టాలని పాట రూపొందించా. యావత్ ప్రపంచం కనిపించని శత్రువుతో పోరాడుతున్న విషయాన్ని అందరూ గమనించాలి. -
నాట్స్ ఆధ్వర్యంలో కోటి రాగాలు
క్యాన్సస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. క్యాన్సస్ లో కోటి రాగాలు పేరుతో మ్యూజికల్ నైట్ నిర్వహించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగువారి కోసం నాట్స్ ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసింది. తెలుగు ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ మ్యూజికల్ నైట్‌లో తన పాటలతో హోరెత్తించారు. తెలుగువారి చేత చిందేయించారు. మాస్, క్లాస్ బీట్ సాంగ్స్ తో కోటి టీం పాటల ప్రవాహాన్ని కొనసాగించడంతో తెలుగువారికి మధురానుభూతులు పంచింది. చాలా కాలం తర్వాత తెలుగు పాటల ప్రవాహంలో మునిగితేలామని.. అలనాటి రోజులను గుర్తు చేసుకున్నామని క్యాన్సస్ లో ఉండే తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సస్ నాట్స్ ఛాప్టర్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, సెక్రటరీ వెంకట్ మంత్రి నేతృత్వంలో చేపట్టిన ఈ మ్యూజికల్ నైట్ ఎంతో ఆహ్లాదంగా సాగింది. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. నాట్స్ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగువారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని, ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నాట్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల గురించి మంచికలపూడి వివరించారు. అమెరికాలో ఉండే తెలుగువారంతా ఇప్పుడు నాట్స్ కుటుంబంలో చేరుతున్నారని... నాట్స్ కుటుంబం అంటే ఒకరికి ఒకరు అండగా ఉండే కుటుంబం..అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా తక్షణం స్పందించే కుటుంబం అనేది నాట్స్ హెల్ప్ లైన్ రుజువు చేసిందన్నారు. కోటి రాగాల కార్యక్రమం అనంతరం సంగీత దర్శకుడు కోటితో పాటు మిగిలిన గాయనీ, గాయకులు సుమంగళి, శ్రీకాంత్ సండుగు, ప్రసాద్ సింహాద్రి తదితరులను నాట్స్ ఘనంగా సత్కరించింది. దాదాపు 500 మందికిపై తెలుగువారు కోటి రాగాలు కార్యక్రమానికి విచ్చేశారు. తెలుగు పాటల మాధుర్యంలో తేలియాడారు. క్యాన్సస్ తెలంగాణ కల్చరల్ అసోషియేషన్ ఈ మ్యూజికల్ నైట్ కు కో స్పాన్సర్ గా వ్యవహారించింది. -
నీలమణిదుర్గ సన్నిధిలో సంగీత దర్శకుడు కోటి
పాతపట్నం : పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారిని సినీ సంగీత దర్శకుడు కోటి దంపతులు, సినీ నటుడు భానుచందర్ ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సిబ్బంది గౌరవ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అర్చకుడు రాజేష్ ఆచార్యులు అష్టోత్తర గోత్రాలతోపాటు, కుంకుమపూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అక్కందర సన్యాసిరావు, ఈవో డకర రమణయ్య, మోహనరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మే 28న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కోటి (సంగీత దర్శకుడు), కైలీ మినోగ్ (ప్రముఖ గాయని, నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. వీరు ఈ సంవత్సరమంతా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఊహించని ఆహ్వానాలు, సన్మానాలు, గుర్తింపు లభిస్తాయి. సంఘంలో వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు మంచి కాలం. గతంలో చేసిన రచనలు ఇప్పుడు వెలుగు చూస్తాయి. వాటికి పేరు వస్తుంది. ఉద్యోగులకు ప్రాధాన్యత గల స్థానాలకు బదిలీ అవుతంంది. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. న్యాయవాదులకు చేతినిండా పని దొరుకుతుంది. మంచి ఆదాయం కళ్లజూస్తారు. అయితే అనుకున్న పనులన్నీ అవుతున్నందువల్ల గర్వంతో కూడిన మిడిసిపాటు పడతారు. ఫలితంగా అపనిందలు, అవహేళనలు ఎదుర్కొనవలసి రావచ్చు. అందువల్ల మాటలలో, చేతలలో సంయమనం పాటించాలి. ఆచితూచి వ్యవహరించాలి. లక్కీ నంబర్లు: 1, 5, 9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, గురు, ఆదివారాలు. సూచనలు: పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం, తోబుట్టువులను... ముఖ్యంగా పెళ్లికాని సోదరీమణులను ఆదరించడం, సరస్వతిని, సాయినాథుని, దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు