krishnariver
-
పడవ ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు
విజయవాడ: కృష్ణా నదిలో ఫెర్రీ పాయింట్ వద్ద మూడు రోజుల క్రితం జరిగిన పడవ ప్రమాదంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఐడి ఆర్థిక నేరాల విభాగం ఐజి అమిత్‌గార్గ్, జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ల ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో 21మంది మృతిచెందిన విషయం విధితమే. -
సంగమేశ్వరం వద్ద పోటెత్తిన కృష్ణాజలాలు
కొత్తపల్లి: నెలన్నర క్రితం కృష్ణాపుష్కరాలను పురష్కరించుకుని నిర్మించిన ఘాట్లు (ఐదుమెట్లుమినహా)మునకకు గురయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయం 882.7 అడుగులకు చేరింది. ఇదే ప్రవాహం కొనసాగితే నేడు రేపటిలోపు సంఘమేశ్వరం ఎగువఘాటులోని ఉమామహేశ్వరుని పాదాల చెంతకు కృష్ణాజలాలు చేరే అవకాశం ఉంది. ఏపీటూరిజం టెంట్‌హౌస్‌లు కూడా మునిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పిండప్రదాన పుష్కరఘాటు కృష్ణమ్మ అలల తాకిడికి ఛిద్రమైంది. సంగమేశ్వర క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామీచ్చిన జిల్లా కలెక్టర్ పుష్కరాల తరా్వత ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఈ క్షేత్రం పరిసరప్రాంతాలు బోసిపోతున్నాయి. -
హంద్రీనీవాకు మరో 5 టీఎంసీలు
కర్నూలు సిటీ: హంద్రీనీవా కాలువ ద్వారా మరో 5 టీఎంసీల నీరు వాడుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఈ కాలువ కింద కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన ఆయకట్టుకు సాగు నీరు ఇస్తున్నారు. ఈ ఖరీఫ్ మొదట్లో తొమ్మిది టీఎంసీల నీటిని వాడుకునేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ నీటిని ఆరు పంపుల ద్వారా కాలువకు ఎత్తిపోశారు. కేటాయించిన నీరు సోమవారంతో పూర్తయింది. అనంతపురం జిల్లాలోని చెరువులన్నీ హంద్రీనీవా నీటితో నింపుతున్నారు. ఇలాంటి సమయంలో కాల్వకు నీరు బంద్ అయితే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలను కొనసాగించాలని బోర్డును కోరారు. ఈ మేరకు మరో ఐదు టీఎంసీల నీటిని వాడుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అధికారికంగా నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. -
మట్టపల్లి వద్ద గణనీయంగా పెరిగిన కృష్ణానది నీటిమట్టం ...
– మట్టపల్లి ప్రమాదకరంగా కృష్ణానది నీటిమట్టం మట్టపల్లి (మఠంపల్లి) : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ భారీగా పెరగడంతో కృష్ణానది నీటి మట్టం గురువారం గణనీయంగా పెరిగి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో దేవస్థానం వద్ద గల ప్రహ్లాద ఘాట్ నీట మునిగిపోవడంతో భక్తుల పుణ్య స్నానాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలు, కృష్ణానది వరద నీటి ప్రవాహంతో దేవాలయానికివచ్చే భక్తుల తాకిడి కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని మూసీనది, గుంటూరు జిల్లాలోని నాగులేరు భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది దీంతో పులిచింతల ప్రాజెక్ట్ వద్ద రిజర్వాయర్ నీటి సామర్ధ్యాన్ని భారీగావస్తున్న వరద నీటితో 28 టీఎంసీలకుపైగా నీటి నిల్వచేశారు. దీంతో దేవస్థానంవద్ద భారీగా వరద నీరు పెరిగింది. అయితే గడిచిన 5 రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ మట్టపల్లిని సందర్శించి పులిచింతల ప్రాజెక్ట్ వద్ద 30 టీఎంసీల నీటిని నిల్వచేసే అవకాశం ఉన్నందున బ్యాక్ వాటర్ పెరుగుతుందని మట్టపల్లి దేవస్థానంవద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేగాక మట్టపల్లి రేవు వద్ద ఉన్న బాలాజీ ఘాట్, హై లెవల్‌వంతెన ఘాట్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామస్థులెవరు నదిలోకి వెళ్లరాదని తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ ఆకుల రమేష్‌లు ఇప్పటికే గ్రామస్థులను అప్రమత్తం చేయగా ఆలయ ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్, ఈవో ఎంపి.లక్ష్మణరావులు దేవస్థానం వద్ద యాత్రీకులను నదిలోకివెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
ఎత్తు ఎలా పెంచుతారు?: గ్రీన్ ట్రిబ్యునల్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ వరద ప్రవాహ మట్టం, కొండవీటి వాగు వరద ప్రవాహ మట్టం కంటే లోతట్టులో ఉన్న రాజధాని ప్రాంతం ఎత్తు ఎలా పెంచుతారని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ, పండలనేని శ్రీమన్నారాయణ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ఎన్జీటీ గురువారం విచారించింది. ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా జస్టిస్ స్వతంత్రకుమార్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ తడబడ్డారు.అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదావేశారు. -
రేపు ఢిల్లీకి హరీశ్ రావు
హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి మంత్రి హరీశ్ రావు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయాలున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. ఈ కార్యక్రమానకి తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీశ్ రావు హాజరుకానున్నారు.