Lands Value Hike
-
భూముల ధరలకు రెక్కలు
శ్రీ అవధూత కాశినాయన మండలం కొండరాజుపల్లెకు చెందిన ఎర్రబట్టి శేఖర్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో వర్షాధార భూములు కావడంతో కంది, ఆముదం పంటలు సాగు చేసేవాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ఎడమ కాలువ పరిధిలో క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయడంతో తన పొలంలో పత్తి, అరటి, వరి పంటలు సాగు చేస్తున్నాడు. కాలువ నీళ్లు వస్తుండడంతో గతంలో ఎకరం రూ. లక్షలోపు ఉన్న పొలం ప్రస్తుతం రూ. 8 లక్షలు విలువ చేస్తోందని శేఖర్ తెలిపాడు. ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన రైతు కేవీ సుబ్బారెడ్డికి ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో పది ఎకరాల పొలం ఉంది. రోడ్డు వారగా ఎకరం రూ. 40 లక్షలు విలువజేసేది. ప్రొద్దుటూరు–ఎర్రగుంట్ల మధ్య రోడ్డు విస్తరణ చేయడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రోడ్డు వెంబడి ఎకరం ధర రూ. 1.50 కోట్లు పలుకుతోంది. అభివృద్ధి, రోడ్డు విస్తరణతోనే భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని తెలిపారు. పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకు చెందిన కలువకూరి వెంకట సుబ్బయ్యకు పోరుమామిళ్ల పట్టణ శివార్లలో 90 సెంట్ల స్థలముంది. అన్ని రంగాలలో అభివృద్ధితోపాటు కోరుకొండ–అద్దంకి జాతీయ రహదారి విస్తరణతో గతంలో సెంటు రూ. 3 లక్షల ధర పలికిన భూమి ఇప్పుడు రూ. 10 లక్షల వరకు పలుకుతోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక అన్ని రంగాలలో అభివృద్ధి వల్లనే భూముల ధరలు పెరిగినట్లు వెంకట సుబ్బయ్య తెలిపారు. సాక్షి ప్రతినిధి, కడప : ఒకప్పుడు కరువు ప్రాంతం. సాగునీటి సంగతి దేవుడెరుగు...గుక్కెడు మంచినీళ్లు దొరక్క గొంతులు ఎండేవి. వరుణుడి కరుణ లేక వర్షపాతం అంతంత మాత్రమే. నీళ్లు లేక పంటలు బీళ్లుగా ఉండేవి. భూములు అమ్ముదామన్నా కొనేనాథుడు లేని పరిస్థితి. ఇతర అభివృద్ధి పథకాలేవీ అమలు కాకపోవడంతో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడింది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయి. కరువును పారదోలే ప్రయత్నం సాగింది. సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. పెండింగ్ పనులు కొంతవరకు పూర్తి చేయడంతోపాటు కొత్త పథకాలను ప్రారంభించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక కరువు జిల్లా వైఎస్సార్ జిల్లాలో సంక్షేమంతోపాటు అభివృద్ధి పరుగులు పెట్టింది. బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, పులివెందుల ప్రాంతాల్లో జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ, కేసీ కెనాల్ పరిధిలో పలు సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. వీటి పరిధిలో ఆయకట్టుకు అటు ఖరీఫ్, ఇటు రబీలోనూ సాగునీటిని అందిస్తున్నారు. పులివెందుల, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లోని రాష్ట్ర రహదారులను రూ. 30 వేల కోట్లతో జాతీయ రహదారులుగా మారుస్తున్నారు. ఇందుకోసం వేలాది ఎకరాల భూ సేకరణ జరుగుతోంది. మరోవైపు పులివెందుల, కొప్పర్తి, గోపవరం ప్రాంతాల్లో రూ. 30 వేల పైచిలుకు కోట్లతో పరిశ్రమల స్థాపన జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా అన్ని రంగాలలోనూ అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఎకరం రూ. 3 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. జిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు జిల్లాలో సంక్షేమంతోపాటు పెద్ద ఎత్తున అభివృద్ధి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంది. వైఎస్సార్ జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. కడప ప్రాంతంలోని వెంచర్లలో సెంటు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంది. ప్రొద్దుటూరు ప్రాంతంలో రూ. 4 లక్షల నుంచి రూ.10 లక్షలు, బద్వేలు ప్రాంతంలో రూ. 5 లక్షల నుంచి రూ.15 లక్షలు, కమలాపురం ప్రాంతంలో రూ. 5 లక్షల నుంచి రూ.15 లక్షలు, జమ్మలమడుగు ప్రాంతంలో రూ. 6 లక్షల నుంచి రూ.10 లక్షలు, పులివెందుల ప్రాంతంలో రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలు చొప్పున ధరలు ఉన్నాయి. ప్లాట్ల విక్రయాలు స్పీడుగా సాగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెరిగిన భూముల ధరలు గత మూడేళ్లుగా జిల్లాలోని జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నీటితో నింపింది. దీంతో వాటి పరిధిలోని ఆయకట్టుకు అటు ఖరీఫ్, ఇటు రబీలోనూ సాగునీరు అందుతోంది. రైతులు పత్తి, అరటి, మిర్చి, చీనీ, బత్తాయి, జామ, వరి, ఉల్లి, కూరగాయల పంటలను పండిస్తున్నారు. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాదు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు జిల్లాకు తరలివచ్చి అధిక రేట్లకు భూములు కొంటున్నారు. గతంలో ఎకరం రూ. 2 లక్షలు ధర పలికిన భూములు ఇప్పుడు రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు «పలుకుతుండడం గమనార్హం. బద్వేలు ప్రాంతంలో రూ. 3 లక్షలు ఉన్న ఎకరా రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పోతోంది. జీఎన్ఎస్ఎస్ పరిధిలోని పైడిపాలెం కింద తొండూరు మండలంలో ఎకరా రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపు ఉండగా ప్రస్తుతం రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంది. చిత్రావతి పరిధిలోని సింహాద్రిపురం, లింగాలలో గతంలో రూ.5లక్షల నుంచి రూ.8 లక్షలు పలికిన ఎకరం ధర ప్రస్తుతం రూ. 15 లక్షల నుంచి రూ.18 లక్షలు పలుకుతోంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున ఎకరం రూ. 15 లక్షలకు పైగానే ఉంది. మైలవరం పరిధిలో గతంలో రూ. 2 లక్షలు ఉన్న ఎకరా భూమి ధర ప్రస్తుతం రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. సర్వరాయసాగర్ పరిధిలోని వీరపునాయునిపల్లె ప్రాంతంలో ఎకరం రూ. లక్ష ఉన్న భూమి ఇప్పుడు రూ. 10 లక్షలు పలుకుతోంది. వామికొండ పరిధిలో ముద్దనూరు ప్రాంతాల్లో ప్రస్తుతం ఎకరా రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోని మెట్ట భూములు సైతం ఎకరం రూ. 12 లక్షలు ధర పలుకుతుండడం గమనార్హం. ప్రధాన రహదారుల వెంబడి భూముల ధరలకు రెక్కలు జిల్లాలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి. పులివెందుల, కమలాపురం, మైదుకూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తుండడంతో రహదారుల వెంబడి ఎకరం రూ. 30 లక్షలు ఉన్న భూములు నేడు రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. -
భూముల ధరలకు రెక్కలు.. ఎకరా కనిష్ట ధర రూ.75 వేలు
మూడు రకాల భూములు, ఆస్తులకు ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ధరలు పెంచాలన్న దానిపై సుదీర్ఘ కసరత్తు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ కేటగిరీల వారీగా ధరలను నిర్ధారించింది. రియల్ ఎస్టేట్ బూమ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇటు మధ్య తరగతి ప్రజానీకానికి భారం పడకుండా ప్రభుత్వ విలువలను సవరించామని అధికారులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ అప్లోడ్ చేస్తుండగా, వ్యవసాయ భూముల వివరాలను ధరణి పోర్టల్ సాంకేతిక బృందం అప్లోడ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న6 శాతం నుంచి 7.5 శాతానికి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఫీజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/అపార్ట్మెంట్లకు ప్రభుత్వ ధరల సవరణ ప్రక్రియ పూర్తయింది. వ్యవసాయ భూమి కనిష్ట ధర ఎకరం రూ.75 వేలుగా నిర్ధారించారు. సవరించిన ధరలు ఈనెల 20వ తేదీ నుంచి లేదా ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు (జనాభా ప్రాతిపదికన), కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ -1, హెచ్ఎండీఏ-2, జీహెచ్ఎంసీలను యూనిట్‌గా తీసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ధరలను ఖరారు చేసింది. వ్యవసాయ భూములను ఐదు కేటగిరీలుగా విభజించింది. వ్యవసాయ భూముల విషయంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)ని గ్రామీణ ప్రాంతాల్లో కలపగా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)ల పరిధిలో ప్రత్యేక ధరలను నిర్ణయించింది. మూడు రకాలు.. పలు శ్లాబులు వ్యవసాయ భూముల విషయానికి వస్తే ప్రస్తుతం ఎకరాకు కనిష్టంగా రూ.10 వేలు ఉన్న బుక్ వాల్యూను రూ.75 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇదే కనిష్ట ధరగా నిర్ధారణ కానుంది. ఆ తర్వాత శ్లాబులను 30, 40, 50 శాతంగా పెంచారు. ఫ్లాట్లు/అపార్ట్మెంట్ల విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకున్నారు. లక్షలోపు, లక్షకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలు, హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీలతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆధారంగా ధరలు నిర్ణయించారు. లక్షలోపు జనాభా ఉన్న పంచాయతీలకు కనిష్ట ధర చదరపు అడుగుకు రూ.1,000గా ప్రతిపాదించారు. ఖాళీ స్థలాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనిష్ట ధర చదరపు గజానికి రూ.200, మండల కేంద్రాలు, 50 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.300, 50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.400, వీటీడీఏ మినహా ఇతర పురపాలికలు, కార్పొరేషన్లలో రూ.500, హెచ్ఎండీఏ -1లో రూ.1,500 హెచ్ఎండీఏ-2లో రూ.800, జీహెచ్ఎంసీలో రూ.3 వేలుగా కనిష్ట ధరను నిర్ధారించారు. అన్ని రకాల ప్రాంతాల్లోనూ గరిష్ట ధరను 3- 4 శ్లాబులుగా విభజించారు. ఈ విభజన మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (కమర్షియల్)లో అత్యధికంగా ప్రస్తుతం గజం రూ.65 వేలుగా ఉన్న గరిష్ట ధర పెరిగిన ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత రూ.74,500 (30 శాతం) కానుంది. రాష్ట్రంలో చదరపు గజానికి ఇదే అత్యధిక ప్రభుత్వ ధర కానుండడం గమనార్హం. సవరణ కమిటీల ఆమోదం భూముల విలువల సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విలువల సవరణ కమిటీలు శనివారం సమావేశమయ్యాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ సమావేశాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో తహసీల్దార్లు హాజరయ్యారు. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని భూముల సవరణ ప్రతిపాదనలు కమిటీలు పరిశీలించి వాటికి ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఎప్పుడైనా సవరించిన విలువలను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రిజిస్ట్రేషన్ల శాఖ చెపుతుండగా, ఈనెల 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఒకవేళ వాయిదా పడితే ఆగస్టు 1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి రావడం ఖాయమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఖాయం! భూముల విలువల సవరణతో పాటు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు కూడా ఖాయమేనని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇందుకు అంగీకరించారని, ప్రస్తుతమున్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి పెంచుతూ నేడో, రేపో ఉత్తర్వులు వస్తాయని సమాచారం. -
భూమి బంగారమే..!
గ్రేటర్లో భూముల విలువ పెంపునకు రంగం సిద్ధం ♦ బహిరంగ మార్కెట్ ధరలే ప్రామాణికం ♦ 10 నుంచి 30 శాతం పెంపునకు కసరత్తు పూర్తి ♦ ఆన్లైన్లో సవరించిన ప్రతిపాదనలు ♦ ఆగస్టు ఒకటి నుంచి పెంచిన విలువల అమలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములు బంగారం కానున్నాయి. సరిగ్గా రెండేళ్ల తర్వాత భూముల విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్త్తంగా భూముల విలువల సవరణలను చేపట్టాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని భూముల విలువలను సరిపోల్చుతూ అవసరమైన చోట పెంచుతూ ప్రాథమిక కసరత్తులు పూర్తి చేశాయి. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం స్టాంపుల రుసుం రేటు తగ్గించడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగవచ్చని భావించారు. అయితే రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల ప్రభుత్వ రాబడి లక్ష్యం నెరవేరలేదు. దీంతో తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువల పెంపునకు సిద్ధమైంది. పెంపు ప్రతిపాదనలు ఇలా.. ♦ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45లో ప్రస్తుతం గృహ ఉపయోగ భూమి చదరపు గజం విలువ రూ.42 వేలు ఉండగా, తాజాగా రూ. 45 వేల నుంచి 47 వేలకు పెంచింది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన భూమి విలువను రూ.60 వేల నుంచి రూ.65 వేల వరకు పెంచుతూ ప్రతిపాదించారు. బంజారాహిల్స్ పరిధిలోని మొత్తం 15 ఏరియాలకు 10 ఏరియాల్లో మాత్రమే భూముల విలువలను పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. ♦ చిక్కడపల్లి, సికింద్రాబాద్‌ల్లో ప్రస్తుతం చదరపు గజం విలువ రూ.38 వేలు ఉండగా రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు పెంచారు. వాణిజ్య కేంద్రమైన అబీడ్స్‌లో రూ. 42 వేల నుంచి రూ. 44 వేలకు పెంచారు. ♦ ఉప్పల్ రింగ్‌రోడ్ సమీపంలో ప్రస్తుత విలువ రూ.25 వేలు ఉండగా దానిని రూ. 30 వేలు, నాగోలులో రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు పెంచుతూ ప్రతిపాదించారు. ఉప్పల్‌లోని 25 ఏరియాలకుగానూ 22 ప్రాంతాల్లో 10 నుంచి 20 శాతం, రెండింటిలో 30 నుంచి 50 శాతం పెంచుతూ ప్రతిపాదించారు. ♦ ఎల్బీనగర్ పరిధిలోని సరూర్‌నగర్, వనస్థలిపురంలో చదరపు గజం రూ.20 వేలు ఉండగా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ప్రతిపాదించారు. ♦ పాతబస్తీలోని చార్మినార్, దూద్‌బౌలీలో 10 నుంచి 30%, మారేడుపల్లిలో 5% వరకు పెంచుతూ ప్రతిపాదించారు. మల్కాజిగిరిలో 20 నుంచి 50% వరకు భూముల విలువలను పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. 10-30 శాతం పెంపు గ్రేటర్ పరిధిలో భూముల విలువలను కనీసం 10 శాతం నుంచి 30 శాతం వరకు పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం 30 శాతం నుంచి 50 శాతం వరకు కూడా ప్రతిపాదించింది. ఉదాహరణకు గోల్కొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో 30 శాతం నుంచి 50 శాతం పాతబస్తీలోని దూద్‌బౌలీ, నగర శివారులోని పెద్ద అంబర్‌పేట, ఎల్బీనగర్, కీసర తదితర ప్రాంతాల్లో 50 శాతం నుంచి 70 శాతం వరకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్సైట్లో బ్లాక్, వార్డులవారీగా అందుబాటులో ఉంచింది. వీటిపై అభ్యంతరాలు, సూచనలను జూలై 15 వరకు స్వీకరిస్తుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సూచనలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత సవరించిన ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదానికి పంపుతుంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆగస్టు ఒకటి నుంచి పెంచిన విలువలను అమలు చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.