శ్రీ అవధూత కాశినాయన మండలం కొండరాజుపల్లెకు చెందిన ఎర్రబట్టి శేఖర్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో వర్షాధార భూములు కావడంతో కంది, ఆముదం పంటలు సాగు చేసేవాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ఎడమ కాలువ పరిధిలో క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయడంతో తన పొలంలో పత్తి, అరటి, వరి పంటలు సాగు చేస్తున్నాడు. కాలువ నీళ్లు వస్తుండడంతో గతంలో ఎకరం రూ. లక్షలోపు ఉన్న పొలం ప్రస్తుతం రూ. 8 లక్షలు విలువ చేస్తోందని శేఖర్ తెలిపాడు.
ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన రైతు కేవీ సుబ్బారెడ్డికి ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో పది ఎకరాల పొలం ఉంది. రోడ్డు వారగా ఎకరం రూ. 40 లక్షలు విలువజేసేది. ప్రొద్దుటూరు–ఎర్రగుంట్ల మధ్య రోడ్డు విస్తరణ చేయడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రోడ్డు వెంబడి ఎకరం ధర రూ. 1.50 కోట్లు పలుకుతోంది. అభివృద్ధి, రోడ్డు విస్తరణతోనే భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని తెలిపారు.
పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకు చెందిన కలువకూరి వెంకట సుబ్బయ్యకు పోరుమామిళ్ల పట్టణ శివార్లలో 90 సెంట్ల స్థలముంది. అన్ని రంగాలలో అభివృద్ధితోపాటు కోరుకొండ–అద్దంకి జాతీయ రహదారి విస్తరణతో గతంలో సెంటు రూ. 3 లక్షల ధర పలికిన భూమి ఇప్పుడు రూ. 10 లక్షల వరకు పలుకుతోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక అన్ని రంగాలలో అభివృద్ధి వల్లనే భూముల ధరలు పెరిగినట్లు వెంకట సుబ్బయ్య తెలిపారు.
సాక్షి ప్రతినిధి, కడప : ఒకప్పుడు కరువు ప్రాంతం. సాగునీటి సంగతి దేవుడెరుగు...గుక్కెడు మంచినీళ్లు దొరక్క గొంతులు ఎండేవి. వరుణుడి కరుణ లేక వర్షపాతం అంతంత మాత్రమే. నీళ్లు లేక పంటలు బీళ్లుగా ఉండేవి. భూములు అమ్ముదామన్నా కొనేనాథుడు లేని పరిస్థితి. ఇతర అభివృద్ధి పథకాలేవీ అమలు కాకపోవడంతో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడింది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయి. కరువును పారదోలే ప్రయత్నం సాగింది. సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. పెండింగ్ పనులు కొంతవరకు పూర్తి చేయడంతోపాటు కొత్త పథకాలను ప్రారంభించారు.
ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక కరువు జిల్లా వైఎస్సార్ జిల్లాలో సంక్షేమంతోపాటు అభివృద్ధి పరుగులు పెట్టింది. బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, పులివెందుల ప్రాంతాల్లో జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ, కేసీ కెనాల్ పరిధిలో పలు సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. వీటి పరిధిలో ఆయకట్టుకు అటు ఖరీఫ్, ఇటు రబీలోనూ సాగునీటిని అందిస్తున్నారు. పులివెందుల, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లోని రాష్ట్ర రహదారులను రూ. 30 వేల కోట్లతో జాతీయ రహదారులుగా మారుస్తున్నారు. ఇందుకోసం వేలాది ఎకరాల భూ సేకరణ జరుగుతోంది. మరోవైపు పులివెందుల, కొప్పర్తి, గోపవరం ప్రాంతాల్లో రూ. 30 వేల పైచిలుకు కోట్లతో పరిశ్రమల స్థాపన జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా అన్ని రంగాలలోనూ అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఎకరం రూ. 3 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది.
జిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు జిల్లాలో సంక్షేమంతోపాటు పెద్ద ఎత్తున అభివృద్ధి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంది. వైఎస్సార్ జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. కడప ప్రాంతంలోని వెంచర్లలో సెంటు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంది. ప్రొద్దుటూరు ప్రాంతంలో రూ. 4 లక్షల నుంచి రూ.10 లక్షలు, బద్వేలు ప్రాంతంలో రూ. 5 లక్షల నుంచి రూ.15 లక్షలు, కమలాపురం ప్రాంతంలో రూ. 5 లక్షల నుంచి రూ.15 లక్షలు, జమ్మలమడుగు ప్రాంతంలో రూ. 6 లక్షల నుంచి రూ.10 లక్షలు, పులివెందుల ప్రాంతంలో రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలు చొప్పున ధరలు ఉన్నాయి. ప్లాట్ల విక్రయాలు స్పీడుగా సాగుతున్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెరిగిన భూముల ధరలు
గత మూడేళ్లుగా జిల్లాలోని జీఎన్‌ఎస్‌ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నీటితో నింపింది. దీంతో వాటి పరిధిలోని ఆయకట్టుకు అటు ఖరీఫ్, ఇటు రబీలోనూ సాగునీరు అందుతోంది. రైతులు పత్తి, అరటి, మిర్చి, చీనీ, బత్తాయి, జామ, వరి, ఉల్లి, కూరగాయల పంటలను పండిస్తున్నారు. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాదు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు జిల్లాకు తరలివచ్చి అధిక రేట్లకు భూములు కొంటున్నారు. గతంలో ఎకరం రూ. 2 లక్షలు ధర పలికిన భూములు ఇప్పుడు రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు «పలుకుతుండడం గమనార్హం.
బద్వేలు ప్రాంతంలో రూ. 3 లక్షలు ఉన్న ఎకరా రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పోతోంది. జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని పైడిపాలెం కింద తొండూరు మండలంలో ఎకరా రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపు ఉండగా ప్రస్తుతం రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంది. చిత్రావతి పరిధిలోని సింహాద్రిపురం, లింగాలలో గతంలో రూ.5లక్షల నుంచి రూ.8 లక్షలు పలికిన ఎకరం ధర ప్రస్తుతం రూ. 15 లక్షల నుంచి రూ.18 లక్షలు పలుకుతోంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున ఎకరం రూ. 15 లక్షలకు పైగానే ఉంది. మైలవరం పరిధిలో గతంలో రూ. 2 లక్షలు ఉన్న ఎకరా భూమి ధర ప్రస్తుతం రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. సర్వరాయసాగర్ పరిధిలోని వీరపునాయునిపల్లె ప్రాంతంలో ఎకరం రూ. లక్ష ఉన్న భూమి ఇప్పుడు రూ. 10 లక్షలు పలుకుతోంది. వామికొండ పరిధిలో ముద్దనూరు ప్రాంతాల్లో ప్రస్తుతం ఎకరా రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోని మెట్ట భూములు సైతం ఎకరం రూ. 12 లక్షలు ధర పలుకుతుండడం గమనార్హం.
ప్రధాన రహదారుల వెంబడి భూముల ధరలకు రెక్కలు
జిల్లాలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి. పులివెందుల, కమలాపురం, మైదుకూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తుండడంతో రహదారుల వెంబడి ఎకరం రూ. 30 లక్షలు ఉన్న భూములు నేడు రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment