mahajana paadayatra
-
బతుకు తెలంగాణ ఎక్కడ?
సందర్భం సీపీఐఎం తెలంగాణ కమిటీ నాయకత్వంలో ‘ మహా జన పాదయాత్ర’ జయప్రదంగా సాగుతోంది. ఇప్పటికే ఈ యాత్ర 14 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సీఎం కేసీఆర్ శపించినట్లుగా ప్రజలు ఈ యాత్రను అడ్డుకోకపోగా అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. ‘సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ నినాదంతో సాగుతున్న మా యాత్రను ముఖ్యంగా అట్టడుగు కులాల ప్రజలు తమదిగా భావించి, ఆదరిస్తున్నారు. వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన సామాజిక ఉద్యమ నేతలు కూడా ఈ యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాది రాజకీయ యాత్ర కాదని మేము ముందే చెప్పాం. మాకు ఓటేయమని అడగటానికో, మా పార్టీలో చేరమని చెప్పటానికో మేము ఈ యాత్ర చేయటం లేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. ప్రజల బ్రతుకులు బాగుపడాలి. ఇలా జరగాలంటే భవిష్యత్తు తెలంగాణలో ‘సామాజిక న్యాయం’ పాలకులకు, అన్ని పార్టీలకు ముఖ్య ఎజెండాగా రూపొందాలి. ఎందుకంటే సామాజిక న్యాయంతో మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమౌతుంది. ఇదే మా లక్ష్యం. ఇందుకు ఏం చేయాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమిటి? ఈ అంశాలను ప్రజలకు వివరించటం, ప్రజల నుంచి తెలుసుకోవటమే మేం చేస్తున్న పని. కానీ సాక్షాత్తూ సీఎం యాత్ర ప్రారంభానికి ముందే యాత్రను అడ్డుకోవాలని శాపనార్థాలు పెట్టటం, కె. తారక రామారావు మమ్మల్ని ‘గంగిరెద్దుల’తో పోల్చటం, ‘మోకాళ్లపై నడిచినా మీరేమీ సాధించలేరని’ వ్యాఖ్యలు చేయటం చూస్తే తండ్రీ కొడుకుల అహంభావంతో కూడిన అల్పత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన సీఎం కేసీఆర్ పదేపదే ‘బంగారు తెలంగాణ’ అని పలవరిస్తుంటాడు. ఏ పనులు చేస్తే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది? ఆ వివరాలు మాత్రం ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. మా యాత్రలో ఇప్పటికీ దాదాపు 500కు పైగా గ్రామాలు తిరిగాం. ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలు మేము అందుకున్నాం. అందులో ఏ ఒక్కదానిలోనూ ‘ అయ్యా మా ఇంట్లో బంగారం లేదు. ఒక అర తులం బంగారం ఇప్పించండి’ అనే దరఖాస్తు లేదు. పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావాలని మన ప్రజలు కోరుకుంటున్నారు. మాకిచ్చిన వినతిపత్రాల్లో ‘భూమి కావాలనీ, డబుల్ బెడ్రూం ఇల్లు కావాలనీ, రేషన్ కార్డు తీసేశారనీ, పెన్షన్ రావటం లేదనీ, స్కూళ్లలో టీచర్లు లేరనీ, తరగతి గదులు లేవనీ, మధ్యాహ్న భోజన కార్మికులు తమకు నాలుగు నెలలుగా జీతాలు రావటం లేదనీ, ఇంకా అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ వగైరా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలనీ, రైతులు తమకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించాలనీ, రుణ మాఫీ పూర్తిగా ఒకేసారి చేయాలనీ ఇలా అనేక తరగతుల ప్రజలు తమ బాధలు, గా«థలు వెళ్లబోసుకుంటున్నారు. అనేక గ్రామాల్లో ‘మాకు కనీసం చచ్చిన వాళ్లను బొందపెట్టేందుకు శ్మశాన స్థలం ఇప్పించండి’ అని దళితులు మొర పెట్టుకుంటున్నారు. ఇదీ తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి. అందువల్ల మన గౌరవ సీఎంకి మొదట అర్థం కావాల్సిం దేమిటంటే మన ప్రజలు కోరుతున్నది ‘బంగారు తెలం గాణ కాదు.. బ్రతుకు తెలంగాణ’ కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిగా ఉండాలి. అంటే ప్రజల బ్రతుకులు మారాలి. మెరుగుపడాలి. అప్పుడే మన రాష్ట్రం సంపన్న రాష్ట్రం అయినట్లు భావించవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 63 లక్షల ప్రజల్లో 93 శాతం మందిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ కులాలకు చెందిన ప్రజల బ్రతుకులు మారకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి అయినట్లు కాదు. అంటే ‘సామాజిక న్యాయం’ అమలే తెలంగాణ అభివృద్ధికి మూలం. రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ కులాల ప్రజలందరికీ సంపదలోనూ, సామాజిక హోదాలోనూ, రాజకీయ అధికారంలోనూ, తమ సంస్కృతీ సంప్రదాయాలకు లభించే గౌరవంలోనూ సమాన వాటా దక్కినపుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుంది. ఆ దిశగా మన కృషి ఉండాలి. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తదనుగుణంగానే వాగ్దానాల వర్షం కురిపిం చింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా వీటి అమలు ఎక్కడా ప్రారంభమైన దాఖలా కూడా లేదు. గత పాలకులు అనేక సంవత్సరాలుగా ఎన్నికలలో ఓట్ల కోసం వేసిన పాచికల్లాగానే సీఎం కేసీఆర్ హామీలు కూడా ఉన్నాయి తప్ప తెలం గాణలో సామాజిక న్యాయానికి న్యాయం చేద్దామన్న చిత్తశుద్ధి ఏ కోశానా కనపడటం లేదు. మా ‘మహా జన పాదయాత్ర’ ప్రారంభమయ్యాక తిరిగి సీఎం వాగ్దానాల పునరుద్ఘాటన ప్రారంభమైంది. ‘దళితవాడల నుంచే మిషన్ భగీరథ’ బీసీలకు గురుకులాలు’ ‘విదేశీ విద్యకు నిధులు’ ఎంబీసీ సమస్యలపై మంత్రుల సమావేశాలు’ డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం స్థలాల ఎంపిక’ ఇలాంటి ప్రకటనలన్నీ జోరందుకున్నాయి. అయితే అసలు సమస్యేమిటంటే ‘నాన్నా... పులి’ కథ లాగే కేసీఆర్ మాటలు విశ్వసనీయతను కోల్పోతున్నాయి. అందువల్ల మాటల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టే రోజులు ముగిసిపోయాయి. ఇంక చేతల్లో చూపితే - తప్ప కేసీఆర్ పాలనకు గడ్డుకాలం తప్పదు. - తమ్మినేని వీరభద్రం వ్యాసకర్త సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి -
అరెస్టులు చేసినా ఆగబోం
► సామాజిక న్యాయ సాధనకే ‘మహాజన పాదయాత్ర’ ► కేసీఆర్‌కో, టీఆర్ఎస్కో వ్యతిరేకంగా కాదు ►రాజకీయ యాత్ర అసలే కాదు: తమ్మినేని ►అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరిక ►ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన యాత్ర ►మొత్తం 5 నెలలు... 4,000 కిలోమీటర్లు సాక్షి, హైదరాబాద్: ‘ఇది రాజకీయ యాత్ర కాదు.వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌కు , టీఆర్ఎస్కు వ్యతిరేకంగా చేపడుతున్న యాత్ర కాదు. ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసేందుకు, వారిని అగ్ర కులాల సరసన కూర్చోబెట్టేందుకే పాదయాత్ర చేపడతున్నాం’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ‘‘మేమెవరి జోలికీ పోబోం. మా జోలికోస్తే మాత్రం ఉరుకోం. అలాగే ఎవరు అడ్డొచ్చినా పాదయాత్ర ఆగేది లేదు’’ అని హెచ్చరించారు. తెలంగాణలో నూతన శక్తుల సామాజిక న్యాయం సాధించేదాకా విశ్రమించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘సామాజిక న్యాయం-రాష్ర్ట సమగ్రాభివృద్ధి’ ప్రధాన అజెండాగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైంది. తమ్మినేని సహా మొత్తం తొమ్మిది మంది నేతలు ఐదు నెలల పాటు 4 వేల కి.మీ. మేరకు చేయనున్న ఈ పాదయాత్ర ప్రారంభ సభకు అంబేడ్కర్ మనవడు డాక్టర్ ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు వామపక్షాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక సంఘాలు, సంస్థల నేతలు, మేధావులు పాల్గొన్నారు. సీపీఎం పాదయాత్ర చేపడుతోందని తెలియగానే పాలకుల్లో వణుకు పుట్టిందని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు. యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అదరకుండా, బెదరకుండా దానిని పూర్తిచేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్ శాపనార్థాలను పట్టించుకోం. పాదయాత్రకు అనుమతి రద్దు చేసినా, దాడులు చేయించినా, రెచ్చగొట్టి రాళ్లేసినా, సభల్లో అల్లర్లు చేసినా... ఐదు నెలల పాటు రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలూ చుట్టి వస్తాం. 4 వేల కి.మీ. పాదయాత్రను పూర్తి చేసి తీరతాం. అడ్డుకుని అరెస్టులు చేసినా... ఎక్కడ విడుదల చేస్తే అక్కడినుంచే మళ్లీ పాదయాత్ర మొదలుపెడతాం. మాపై ఎవరైనా దాడికి పాల్పడి, మాలో ఒకరు చచ్చినా మిగతా వారు ఆపకుండా యాత్ర కొనసాగిస్తారు. మొత్తం 9 మందీ చనిపోతే ప్రజలే పాదయాత్రను కొనసాగిస్తారు’’ అని తమ్మినేని చెప్పారు. గెలవడమూ తెలియాలి కేసీఆర్‌కు నిజానికి సీపీఎంపై వ్యతిరేకత లేదని తమ్మినేని అన్నారు. ‘‘మాది నిజాయతీ గల పార్టీ అని అప్పట్లో కేసీఆరే అన్నారు. కాకపోతే మేం లేవనెత్తే సామాజిక న్యాయ అజెండాపైనే ఆయనకు కోపముంది. ఎందుకంటే బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన మాట తప్పారు. మడమ తిప్పారు. ఎస్సీ,ఎస్టీలకు 3 ఎకరాల పంపిణీ, సబ్ ప్లాన్ చట్టం, పోడు భూములు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల వంటి వాటిపై పాదయాత్ర సందర్భంగా చర్చ జరిగితే సామాజిక న్యాయ సాధనలో ప్రభుత్వం విఫలమైన తీరు బయటపడి టీఆర్ఎస్పై దెబ్బపడుతుంది. అది వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పరిణమిస్తుందనే మా పాదయాత్రకు భయపడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. తమ పాదయాత్రతో సామాజిక శక్తులన్నీ ఏకమై రాష్ట్రంలో నూతన శకం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. కమ్యూనిస్టులకు ఇతరులను ఓడించడమే కాకుండా గెలవడం కూడా తెలియాలని అభిప్రాయపడ్డారు. కలిసొచ్చే వామపక్ష పార్టీలు, సామాజిక శక్తులు, సంఘాలు, మేధావులు, వ్యక్తులతో కలిసి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపించబోతున్నామన్నారు. అడ్డుకుంటే ప్రాణాలైనా అర్పిస్తాం: రాఘవులు పాదయాత్రను అడ్డుకుంటే ప్రాణాలైన అర్పిస్తాం తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనాభాలో పది శాతం కూడా లేని ఉన్నత వర్గాల చేతుల్లో అధికారం, సంపద కేంద్రీకృతమైనప్పుడు బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి పోరుు ఇప్పుడు మిషన్ భగీరథ పేరిట మంచినీళ్లు ముందుకొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. పెద్ద డ్యాముల నిర్మాణం వల్ల ప్రయోజనం లేదని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ప్రస్తుత అభివృద్ధి న మూనాలను మార్చాలన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి సగం మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవ పాలన ఏదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. నీలి (దళిత వర్గాలు), ఎర్ర జెండా (కమ్యూనిస్టులు) ఏకమవాల్సిన అవసరముందన్నారు. పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శ్రేణులు సంఘీభావంగా నిలుస్తాయన్నారు. సభకు పాదయాత్ర సమన్వయకర్త బి. వెంకట్ సభకు అధ్యక్షత వహించారు. సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, ఏపీ సీపీఎం కార్యదర్శి పి.మధు, అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), బాబు (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), జానకిరాములు (ఆర్ఎస్పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి సీపీఎం మహాజన పాదయాత్ర
-
నేటినుంచి సీపీఎం మహాజన పాదయాత్ర
► తమ్మినేని నేతృత్వంలో యాత్ర ► ఇబ్రహీంపట్నంలో ప్రారంభం ► 4వేల కిలోమీటర్లు.. 5 నెలలు సాక్షి, హైదరాబాద్: సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర సోమవారం ప్రారం భం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలగుండా ఐదునెలలపాటు 4వేల కిలోమీటర్లమేర ఈ యాత్ర సాగుతుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపడుతున్న ఈ యాత్రలో జాన్‌వెస్లీ (కేవీపీఎస్), ఎస్.రమ(సీఐటీయూ), ఎంవీ రమణ(వృత్తిదారుల సంఘం), పి.ఆశయ్య (సేవాతరగతులు), కె.నగేష్ (వ్యవసాయకార్మిక సంఘం), ఎం.శోభన్‌నాయక్ (గిరిజన సంఘం), నైతంరాజు(షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సామాజిక కార్యకర్త), ఎండీ అబ్బాస్ (ట్రేడ్‌యూనియన్, మైనారిటీల హక్కుల కార్యకర్త) పాల్గొననున్నారు. రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పాదయాత్ర ప్రారంభసభకు బీఆర్ అంబేడ్కర్ మనవడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ అంబేడ్కర్ హాజరవుతారు. ఆదివారం స్థానిక నాయకులు సభ ఏర్పాట్లు పరిశీలిం చారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, పార్టీ ఏపీ కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, వివిధ వామపక్షపార్టీల ముఖ్యనేతలు, ప్రజాసంఘాల ప్రతిని ధులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది. పాదయాత్ర సందర్భంగా వివిధ అవసరాల కోసం 18 కమిటీలను ఏర్పాటు చేశారు. యాత్ర సమన్వయకర్తగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్ వ్యవహరిస్తా రు. ఈ యా త్ర, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, షాద్‌నగర్‌ల మీదుగా సాగనుంది. ఆ తర్వాత బాలానగర్ మండలం మీదుగా మహబూబ్నగర్జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం నాగర్‌కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలోకి, అక్కడి నుంచి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మీదు గా మార్గమధ్యంలో వచ్చే అన్ని జిల్లాలను కలుపుకుని మార్చి 12 నాటికి హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ జరిగే ముగింపు సభలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొంటారు. ప్రజల ఆశలు నెరవేరనందుకే... ‘‘తెలంగాణ ఏర్పడ్డాక తమ బతుకులు బాగు పడతాయని ప్రజలు ఆశించారు. అయితే రెండున్నరేళ్లు గడిచినా ఆ దిశలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ ఎదుగుదలకు, నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు ఈ యాత్ర తోడ్పడుతుంది. ప్రత్యామ్నాయ అభివృద్ధి ముసాయిదా నమూనా రూపొందించి, దాని ఆధారంగా కలిసొచ్చే శక్తులతో 2019 ఎన్నికలల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నిస్తాం’ అని తమ్మినేని చెప్పారు. కాగా, మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో బాధితుల రిలే దీక్షలకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. తాము తలపెట్టిన పాదయాత్రతో రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు.