
బతుకు తెలంగాణ ఎక్కడ?
సీపీఐఎం తెలంగాణ కమిటీ నాయకత్వంలో ‘ మహా జన పాదయాత్ర’ జయప్రదంగా సాగుతోంది.
సందర్భం
సీపీఐఎం తెలంగాణ కమిటీ నాయకత్వంలో ‘ మహా జన పాదయాత్ర’ జయప్రదంగా సాగుతోంది. ఇప్పటికే ఈ యాత్ర 14 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సీఎం కేసీఆర్ శపించినట్లుగా ప్రజలు ఈ యాత్రను అడ్డుకోకపోగా అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. ‘సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ నినాదంతో సాగుతున్న మా యాత్రను ముఖ్యంగా అట్టడుగు కులాల ప్రజలు తమదిగా భావించి, ఆదరిస్తున్నారు. వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన సామాజిక ఉద్యమ నేతలు కూడా ఈ యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
మాది రాజకీయ యాత్ర కాదని మేము ముందే చెప్పాం. మాకు ఓటేయమని అడగటానికో, మా పార్టీలో చేరమని చెప్పటానికో మేము ఈ యాత్ర చేయటం లేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. ప్రజల బ్రతుకులు బాగుపడాలి. ఇలా జరగాలంటే భవిష్యత్తు తెలంగాణలో ‘సామాజిక న్యాయం’ పాలకులకు, అన్ని పార్టీలకు ముఖ్య ఎజెండాగా రూపొందాలి. ఎందుకంటే సామాజిక న్యాయంతో మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమౌతుంది. ఇదే మా లక్ష్యం. ఇందుకు ఏం చేయాలి? టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమిటి? ఈ అంశాలను ప్రజలకు వివరించటం, ప్రజల నుంచి తెలుసుకోవటమే మేం చేస్తున్న పని. కానీ సాక్షాత్తూ సీఎం యాత్ర ప్రారంభానికి ముందే యాత్రను అడ్డుకోవాలని శాపనార్థాలు పెట్టటం, కె. తారక రామారావు మమ్మల్ని ‘గంగిరెద్దుల’తో పోల్చటం, ‘మోకాళ్లపై నడిచినా మీరేమీ సాధించలేరని’ వ్యాఖ్యలు చేయటం చూస్తే తండ్రీ కొడుకుల అహంభావంతో కూడిన అల్పత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మన సీఎం కేసీఆర్ పదేపదే ‘బంగారు తెలంగాణ’ అని పలవరిస్తుంటాడు. ఏ పనులు చేస్తే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది? ఆ వివరాలు మాత్రం ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. మా యాత్రలో ఇప్పటికీ దాదాపు 500కు పైగా గ్రామాలు తిరిగాం. ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలు మేము అందుకున్నాం. అందులో ఏ ఒక్కదానిలోనూ ‘ అయ్యా మా ఇంట్లో బంగారం లేదు. ఒక అర తులం బంగారం ఇప్పించండి’ అనే దరఖాస్తు లేదు. పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావాలని మన ప్రజలు కోరుకుంటున్నారు.
మాకిచ్చిన వినతిపత్రాల్లో ‘భూమి కావాలనీ, డబుల్ బెడ్‌రూం ఇల్లు కావాలనీ, రేషన్ కార్డు తీసేశారనీ, పెన్షన్ రావటం లేదనీ, స్కూళ్లలో టీచర్లు లేరనీ, తరగతి గదులు లేవనీ, మధ్యాహ్న భోజన కార్మికులు తమకు నాలుగు నెలలుగా జీతాలు రావటం లేదనీ, ఇంకా అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ వగైరా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలనీ, రైతులు తమకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించాలనీ, రుణ మాఫీ పూర్తిగా ఒకేసారి చేయాలనీ ఇలా అనేక తరగతుల ప్రజలు తమ బాధలు, గా«థలు వెళ్లబోసుకుంటున్నారు. అనేక గ్రామాల్లో ‘మాకు కనీసం చచ్చిన వాళ్లను బొందపెట్టేందుకు శ్మశాన స్థలం ఇప్పించండి’ అని దళితులు మొర పెట్టుకుంటున్నారు. ఇదీ తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి. అందువల్ల మన గౌరవ సీఎంకి మొదట అర్థం కావాల్సిం దేమిటంటే మన ప్రజలు కోరుతున్నది ‘బంగారు తెలం గాణ కాదు.. బ్రతుకు తెలంగాణ’ కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిగా ఉండాలి. అంటే ప్రజల బ్రతుకులు మారాలి. మెరుగుపడాలి. అప్పుడే మన రాష్ట్రం సంపన్న రాష్ట్రం అయినట్లు భావించవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 63 లక్షల ప్రజల్లో 93 శాతం మందిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ కులాలకు చెందిన ప్రజల బ్రతుకులు మారకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి అయినట్లు కాదు. అంటే ‘సామాజిక న్యాయం’ అమలే తెలంగాణ అభివృద్ధికి మూలం. రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ కులాల ప్రజలందరికీ సంపదలోనూ, సామాజిక హోదాలోనూ, రాజకీయ అధికారంలోనూ, తమ సంస్కృతీ సంప్రదాయాలకు లభించే గౌరవంలోనూ సమాన వాటా దక్కినపుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుంది. ఆ దిశగా మన కృషి ఉండాలి.
ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తదనుగుణంగానే వాగ్దానాల వర్షం కురిపిం చింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా వీటి అమలు ఎక్కడా ప్రారంభమైన దాఖలా కూడా లేదు. గత పాలకులు అనేక సంవత్సరాలుగా ఎన్నికలలో ఓట్ల కోసం వేసిన పాచికల్లాగానే సీఎం కేసీఆర్ హామీలు కూడా ఉన్నాయి తప్ప తెలం గాణలో సామాజిక న్యాయానికి న్యాయం చేద్దామన్న చిత్తశుద్ధి ఏ కోశానా కనపడటం లేదు.
మా ‘మహా జన పాదయాత్ర’ ప్రారంభమయ్యాక తిరిగి సీఎం వాగ్దానాల పునరుద్ఘాటన ప్రారంభమైంది. ‘దళితవాడల నుంచే మిషన్ భగీరథ’ బీసీలకు గురుకులాలు’ ‘విదేశీ విద్యకు నిధులు’ ఎంబీసీ సమస్యలపై మంత్రుల సమావేశాలు’ డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం స్థలాల ఎంపిక’ ఇలాంటి ప్రకటనలన్నీ జోరందుకున్నాయి. అయితే అసలు సమస్యేమిటంటే ‘నాన్నా... పులి’ కథ లాగే కేసీఆర్ మాటలు విశ్వసనీయతను కోల్పోతున్నాయి. అందువల్ల మాటల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టే రోజులు ముగిసిపోయాయి. ఇంక చేతల్లో చూపితే - తప్ప కేసీఆర్ పాలనకు గడ్డుకాలం తప్పదు.
- తమ్మినేని వీరభద్రం
వ్యాసకర్త సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి