
నేటినుంచి సీపీఎం మహాజన పాదయాత్ర
సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర సోమవారం ప్రారం భం కానుంది. రాష్ట్రంలోని మొత్తం
► తమ్మినేని నేతృత్వంలో యాత్ర
► ఇబ్రహీంపట్నంలో ప్రారంభం
► 4వేల కిలోమీటర్లు.. 5 నెలలు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర సోమవారం ప్రారం భం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలగుండా ఐదునెలలపాటు 4వేల కిలోమీటర్లమేర ఈ యాత్ర సాగుతుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపడుతున్న ఈ యాత్రలో జాన్‌వెస్లీ (కేవీపీఎస్), ఎస్.రమ(సీఐటీయూ), ఎంవీ రమణ(వృత్తిదారుల సంఘం), పి.ఆశయ్య (సేవాతరగతులు), కె.నగేష్ (వ్యవసాయకార్మిక సంఘం), ఎం.శోభన్‌నాయక్ (గిరిజన సంఘం), నైతంరాజు(షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సామాజిక కార్యకర్త), ఎండీ అబ్బాస్ (ట్రేడ్‌యూనియన్, మైనారిటీల హక్కుల కార్యకర్త) పాల్గొననున్నారు. రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పాదయాత్ర ప్రారంభసభకు బీఆర్ అంబేడ్కర్ మనవడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ అంబేడ్కర్ హాజరవుతారు. ఆదివారం స్థానిక నాయకులు సభ ఏర్పాట్లు పరిశీలిం చారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, పార్టీ ఏపీ కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, వివిధ వామపక్షపార్టీల ముఖ్యనేతలు, ప్రజాసంఘాల ప్రతిని ధులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది. పాదయాత్ర సందర్భంగా వివిధ అవసరాల కోసం 18 కమిటీలను ఏర్పాటు చేశారు. యాత్ర సమన్వయకర్తగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్ వ్యవహరిస్తా రు. ఈ యా త్ర, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, షాద్‌నగర్‌ల మీదుగా సాగనుంది.
ఆ తర్వాత బాలానగర్ మండలం మీదుగా మహబూబ్‌నగర్‌జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం నాగర్‌కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలోకి, అక్కడి నుంచి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మీదు గా మార్గమధ్యంలో వచ్చే అన్ని జిల్లాలను కలుపుకుని మార్చి 12 నాటికి హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ జరిగే ముగింపు సభలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొంటారు.
ప్రజల ఆశలు నెరవేరనందుకే...
‘‘తెలంగాణ ఏర్పడ్డాక తమ బతుకులు బాగు పడతాయని ప్రజలు ఆశించారు. అయితే రెండున్నరేళ్లు గడిచినా ఆ దిశలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ ఎదుగుదలకు, నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు ఈ యాత్ర తోడ్పడుతుంది. ప్రత్యామ్నాయ అభివృద్ధి ముసాయిదా నమూనా రూపొందించి, దాని ఆధారంగా కలిసొచ్చే శక్తులతో 2019 ఎన్నికలల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నిస్తాం’ అని తమ్మినేని చెప్పారు. కాగా, మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో బాధితుల రిలే దీక్షలకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. తాము తలపెట్టిన పాదయాత్రతో రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు.