
అరెస్టులు చేసినా ఆగబోం
‘ఇది రాజకీయ యాత్ర కాదు.వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌కు , టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న యాత్ర కాదు.
► సామాజిక న్యాయ సాధనకే ‘మహాజన పాదయాత్ర’
► కేసీఆర్‌కో, టీఆర్‌ఎస్‌కో వ్యతిరేకంగా కాదు
►రాజకీయ యాత్ర అసలే కాదు: తమ్మినేని
►అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరిక
►ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన యాత్ర
►మొత్తం 5 నెలలు... 4,000 కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: ‘ఇది రాజకీయ యాత్ర కాదు.వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌కు , టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న యాత్ర కాదు. ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసేందుకు, వారిని అగ్ర కులాల సరసన కూర్చోబెట్టేందుకే పాదయాత్ర చేపడతున్నాం’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ‘‘మేమెవరి జోలికీ పోబోం. మా జోలికోస్తే మాత్రం ఉరుకోం. అలాగే ఎవరు అడ్డొచ్చినా పాదయాత్ర ఆగేది లేదు’’ అని హెచ్చరించారు. తెలంగాణలో నూతన శక్తుల సామాజిక న్యాయం సాధించేదాకా విశ్రమించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘సామాజిక న్యాయం-రాష్ర్ట సమగ్రాభివృద్ధి’ ప్రధాన అజెండాగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైంది. తమ్మినేని సహా మొత్తం తొమ్మిది మంది నేతలు ఐదు నెలల పాటు 4 వేల కి.మీ. మేరకు చేయనున్న ఈ పాదయాత్ర ప్రారంభ సభకు అంబేడ్కర్ మనవడు డాక్టర్ ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పలు వామపక్షాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక సంఘాలు, సంస్థల నేతలు, మేధావులు పాల్గొన్నారు. సీపీఎం పాదయాత్ర చేపడుతోందని తెలియగానే పాలకుల్లో వణుకు పుట్టిందని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు. యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అదరకుండా, బెదరకుండా దానిని పూర్తిచేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్ శాపనార్థాలను పట్టించుకోం. పాదయాత్రకు అనుమతి రద్దు చేసినా, దాడులు చేయించినా, రెచ్చగొట్టి రాళ్లేసినా, సభల్లో అల్లర్లు చేసినా... ఐదు నెలల పాటు రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలూ చుట్టి వస్తాం. 4 వేల కి.మీ. పాదయాత్రను పూర్తి చేసి తీరతాం. అడ్డుకుని అరెస్టులు చేసినా... ఎక్కడ విడుదల చేస్తే అక్కడినుంచే మళ్లీ పాదయాత్ర మొదలుపెడతాం. మాపై ఎవరైనా దాడికి పాల్పడి, మాలో ఒకరు చచ్చినా మిగతా వారు ఆపకుండా యాత్ర కొనసాగిస్తారు. మొత్తం 9 మందీ చనిపోతే ప్రజలే పాదయాత్రను కొనసాగిస్తారు’’ అని తమ్మినేని చెప్పారు.
గెలవడమూ తెలియాలి
కేసీఆర్‌కు నిజానికి సీపీఎంపై వ్యతిరేకత లేదని తమ్మినేని అన్నారు. ‘‘మాది నిజాయతీ గల పార్టీ అని అప్పట్లో కేసీఆరే అన్నారు. కాకపోతే మేం లేవనెత్తే సామాజిక న్యాయ అజెండాపైనే ఆయనకు కోపముంది. ఎందుకంటే బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన మాట తప్పారు. మడమ తిప్పారు. ఎస్సీ,ఎస్టీలకు 3 ఎకరాల పంపిణీ, సబ్ ప్లాన్ చట్టం, పోడు భూములు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల వంటి వాటిపై పాదయాత్ర సందర్భంగా చర్చ జరిగితే సామాజిక న్యాయ సాధనలో ప్రభుత్వం విఫలమైన తీరు బయటపడి టీఆర్‌ఎస్‌పై దెబ్బపడుతుంది. అది వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పరిణమిస్తుందనే మా పాదయాత్రకు భయపడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
తమ పాదయాత్రతో సామాజిక శక్తులన్నీ ఏకమై రాష్ట్రంలో నూతన శకం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. కమ్యూనిస్టులకు ఇతరులను ఓడించడమే కాకుండా గెలవడం కూడా తెలియాలని అభిప్రాయపడ్డారు. కలిసొచ్చే వామపక్ష పార్టీలు, సామాజిక శక్తులు, సంఘాలు, మేధావులు, వ్యక్తులతో కలిసి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపించబోతున్నామన్నారు.
అడ్డుకుంటే ప్రాణాలైనా అర్పిస్తాం: రాఘవులు
పాదయాత్రను అడ్డుకుంటే ప్రాణాలైన అర్పిస్తాం తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనాభాలో పది శాతం కూడా లేని ఉన్నత వర్గాల చేతుల్లో అధికారం, సంపద కేంద్రీకృతమైనప్పుడు బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి పోరుు ఇప్పుడు మిషన్ భగీరథ పేరిట మంచినీళ్లు ముందుకొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. పెద్ద డ్యాముల నిర్మాణం వల్ల ప్రయోజనం లేదని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ప్రస్తుత అభివృద్ధి న మూనాలను మార్చాలన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి సగం మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు.
తెలంగాణలో ఆత్మగౌరవ పాలన ఏదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. నీలి (దళిత వర్గాలు), ఎర్ర జెండా (కమ్యూనిస్టులు) ఏకమవాల్సిన అవసరముందన్నారు. పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శ్రేణులు సంఘీభావంగా నిలుస్తాయన్నారు. సభకు పాదయాత్ర సమన్వయకర్త బి. వెంకట్ సభకు అధ్యక్షత వహించారు. సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, ఏపీ సీపీఎం కార్యదర్శి పి.మధు, అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), బాబు (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) తదితరులు పాల్గొన్నారు.