Manipal University
-
నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ బైజూస్‌లో దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డేవిడ్సన్ కెంప్నర్ నుంచి బైజూస్ తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని సెటిల్ చేసేందుకు రంజన్ పాయ్ రూ.1,400 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్.. ఆయన బిజినెస్.. నెట్‌వర్త్ వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్? 1972 నవంబర్ 11న జన్మించిన డాక్టర్ రంజన్ పాయ్ ఒక అర్హత కలిగిన వైద్యుడు, వ్యాపారవేత్త. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) ఛైర్మన్. ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలు, 28 ఆసుపత్రులను నడుపుతోంది. రంజన్ పాయ్ తండ్రి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాందాస్ పాయ్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)కి రాందాస్ పాయ్ ఛాన్సలర్‌గా ఉన్నారు. రంజన్ పాయ్ మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, యూఎస్ వెళ్లి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫెలోషిప్ పూర్తి చేశారు. అద్దె ఇంట్లో ప్రారంభం డాక్టర్ రంజన్ పాయ్ మలేషియాలోని మెలక మణిపాల్ మెడికల్ కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రంజన్ పాయ్ బెంగళూరులోని అద్దె ఇంట్లో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌ను ప్రారంభించారు. కేవలం 2 లక్షల డాలర్లతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 25,000 కోట్లు). నెట్‌వర్త్ ఫోర్బ్స్ ప్రకారం డాక్టర్ రంజన్ పాయ్ నెట్‌వర్త్ 2.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు). మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కు ఇప్పుడు మలేషియా, ఆంటిగ్వా, దుబాయ్, నేపాల్ దేశాల్లో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి. ఇదే కాకుండా డాక్టర్ రంజేన్ పాయ్కి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కూడా ఉంది. -
మణిపాల్ వర్సిటీకి క్యూఎస్ వరల్డ్ ర్యాంకులు
మణిపాల్: ప్రఖాత క్వాక్వారెల్లీ సైమండ్స్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్–2018లో మణిపాల్ వర్సిటీ ఉత్తమ ర్యాంకులు సాధించింది. భారత్‌లో అత్యుత్తమ విద్యనందిస్తున్న ప్రైవేటు వర్సిటీలకు ఇచ్చే 701–750 బ్యాండ్‌లో మణిపాల్ వర్సిటీ స్థానం దక్కించుకుంది. మొత్తంగా చూస్తే భారత్‌లోని వర్సిటీల్లో 13వ ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది 84 దేశాలకు చెందిన 950 యూనివర్సిటీలకు క్వాక్వారెల్లీ సైమండ్స్ వర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వర్సిటీల్లో ర్యాంకింగ్‌లో తొలి 2.7శాతం వర్సిటీల్లో మణిపాల్ వర్సిటీ సైతం ఉంది. యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ సంపాదించడం ద్వారా విద్యారంగంలో గొప్ప మైలురాయిని దాటామని మణిపాల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్ వినోద్ భట్ వ్యాఖ్యానించారు. -
రైల్వేల్లో కొత్త తరహా టాయిలెట్లు
రైళ్లలో ఉపయోగించేందుకు వీలుగా నీళ్ల అవసరం లేని టాయిలెట్లను తయారుచేసిన ఓ ఫ్యాకల్టీకి రైల్వేశాఖ నిర్వహించిన పోటీలో రెండో ప్రైజ్ దక్కింది. మణిపాల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎఫ్ఓఏ) పదో సెమిస్టర్ చేస్తున్న వినోద్ అంథోని థామస్ ఇండియన్ రైల్వేల కోసం ప్రత్యేకంగా ఈ టాయిలెట్‌ను రూపొందించారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) నిర్వహించిన ఈ పోటీలో.. నీటి అవసరం లేకుండా వాడుకోవడానికి వీలయ్యే టాయిలెట్స్ డిజైన్ చేయాలని ప్రకటనలో కోరారు. ప్రస్తుతం రైల్వేల్లో టాయిలెట్ల నిర్వహణ, ట్రాక్‌లను శుభ్రంచేయడం పెద్ద సమస్యగా తయారయ్యాయి. వీటిని అధిగమించేందుకు, పర్యావరణానికి హాని కలుగని పద్దతుల్లో టాయిలెట్‌ను డిజైన్ చేసినట్లు వినోద్ తెలిపారు. ప్రస్తుతం రైల్వేల్లో అమల్లో ఉన్న టాయిలెట్ల వ్యవస్థకు ఒక కన్వేయర్‌ను ఉపయోగించి మానవ వ్యర్ధాలను బిన్‌కు తరలించవచ్చని మణిపాల్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిన్ వినియోగం వల్ల వ్యర్ధాలను లోపలికి పంపడానికి నీటిని ఎక్కువగా ఖర్చుచేయాల్సిన పని ఉండదని, డీ కంపోజింగ్ కు బిన్లో ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని వివరించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో ఈ పోటీని ప్రారంభించారు. మే నెలలో ఈ పోటీకి ఎంట్రీలను స్వీకరించగా.. రైల్వే, ఇండస్ట్రీ, పరిశోధన రంగాలకు చెందిన నిపుణులు వినోద్, రాహుల్, సౌరభ్ హాన్స్ లతో కూడిన బృందం తయారుచేసిన టాయిలెట్ కు రెండో స్థానాన్ని ఇచ్చారు. ఇందుకుగాను ప్రైజ్ మనీ కింద ఈ ముగ్గురికి రూ.75,000 దక్కాయి.