marri janardan reddy
-
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
నాగర్ కర్నూల్ నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మర్రి జనార్దనరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డిపై 54354 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగం టిడిపిని వీడిన తర్వాత కొంతకాలం బిజెపిలో ఉండి, తదుపరి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ పక్షాన పోటీచేసినా ఫలితం దక్కలేదు. గతంలో నాగం ఆరుసార్లు నాగర్ కర్నూలుకు ప్రాతినిద్యం వహించారు. మర్రి జనార్దనరెడ్డికి 102493 ఓట్లు రాగా, నాగం జనార్దనరెడ్డికి 48139 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి తరపున పోటీచేసిన సైమన్‌కు ఐదువేలకుపైగా ఓట్లు వచ్చాయి. 2014లో మర్రి జనార్దనరెడ్డి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి, కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి దామోదరరెడ్డిని 14435 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. నాగర్ కర్నూలులో ఆరుసార్లు గెలిచిన నాగం జనార్ధనరెడ్డి 2014లో మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు బిజెపి-టిడిపి కూటమి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. నాగర్ కర్నూలులో నాగం కుమారుడు శశిధర్ రెడ్డి 2014లో బిజెపి తరపున అసెంబ్లీకి పోటీచేసి 27789 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ఐ అభ్యర్ధి దామోదరరెడ్డి ఐదుసార్లు ఓటమి చెందడం విశేషం. ఐదుసార్లు టిడిపి తరపున గెలిచిన నాగం జనార్దనరెడ్డి 2012లో తెలంగాణ అంశంపై పార్టీతో విబేధించి టిడిపికి గుడ్ బె చెప్పి శాసనసభకు కూడా రాజీనామా చేశారు. తిరిగి ఆయన నాగర్‌కర్నూల్ నుంచి శాసనసభకు ఇండిపెండెంటుగా పోటీ చేసి కాంగ్రెస్ ఐ అభ్యర్థి దామోదం రెడ్డిపైన గెలుపొందారు. నాగం జనార్దనరెడ్డి తదుపరి బిజెపిలో చేరారు. ఆ ఉపఎన్నికలో టిడిపి పక్షాన పోటీచేసిన మర్రి జనార్దనరెడ్డి టిఆర్ఎస్లోకి మారి గెలుపొందారు. 2018లో కూడా ఆయన గెలిచారు. 1952 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, తెలుగుదేశం ఐదుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, ఇండిపెండెంట్లు రెండుసార్లు విజయం సాధించారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇద్దరు ఇండిపెండెంట్లే గెలవగ, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 1957లో సీనియర్ నేత మహేంద్రనాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 1962లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. మహేంద్రనాద్ 1967,1972లలో కాంగ్రెస్ పక్షాన అచ్చంపేటలో, 1983,85లలో టిడిపి తరుపున అచ్చంపేటలోనే గెలిచారు. జిల్లాలో అందరికన్నా ఎక్కువగా ఆరుసార్లు గెలిచిన ఘనత మహేంద్రనాద్కు, అలాగే నాగంకు దక్కింది. మహేంద్రనాద్ గతంలో పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, ఎన్.టి. రామారావుల క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. నాగం జనార్ధనరెడ్డి ఆరుసార్లు గెలిస్తే, వి.ఎన్.గౌడ్ మూడుసార్లు, గౌడ్ కుమారుడు మోహన్‌గౌడ్ ఒకసారి గెలిచారు. జనార్ధనరెడ్డి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. నాగర్ కర్నూల్ నుంచి పది సార్లు రెడ్లు,నాలుగుసార్లు బిసి (గౌడ)ఒకసారి ఇతరులు, మూడుసార్లు ఎస్.సి.నేతలు ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అభివృద్ధి వైపు అడుగులు
సాక్షి,తాడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలు పారిశుద్ధ్యం వైపు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లు ఆయా గ్రామాలలో మొదట పారిశుద్ధ్య పనుకే ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గం మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పారిశుద్ధ్య పనులు ముఖ్యమని గుర్తించారు. ఇందుకు పాలక వర్గాల సభ్యులు గ్రామంలోని అన్ని వార్డులను తిరిగి స్థానిక పరిస్థితులను అధ్యాయనం చేశారు. మురుగు కాల్వలు లేకపోవడంతో సీసీరోడ్లు బురదమయం అవుతున్నాయని, ప్రజల వినతుల మేరకు మురుగు కాల్వల నిర్మాణంపై ప్రాధాన్యత పెంచారు. సీసీరోడ్లకు ఇరువైపులా మురుగు కాల్వ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా మురుగు కాల్వల నిర్మాణాల కోసం సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నారు. నిర్మాణలను త్వరగా చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్‌లు అంటున్నారు. చకచకా పనులు మండల కేంద్రంలో సర్పంచ్‌గా ఎన్నికైన అనుపటి యాదమ్మ ఆధ్వర్యంలో వార్డులోని ప్రధాన సమస్యలు గుర్తించి మంచినీటి వసతితో పాటు చేమురుగు కాల్వలు, సీసీరోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన గ్రామసభలో స్వచ్ఛ తాడూరుగా చేయాలన్న ఉద్ధేశంతో గ్రామస్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా 9, 10, 11, 12వ వార్డులను నీటి సమస్యతో పాటు మురుగు కాల్వ నిర్మాణాలను చేపట్టారు. ప్రధాన రోడ్డు వరకు సీసీరోడ్డు వేయించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. -
టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవం
-
పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలి: విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కూటమి గెలుస్తుందనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డే తనకు ఫోన్ చేశారన్నారు. మర్రి జనార్ధన్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలని విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక్క ఫోన్ కాల్‌తో అమ్ముడుపోయే వ్యక్తిత్వమా మర్రిజనార్థన్ రెడ్డిది అని ప్రశ్నించారు. మర్రి జనార్ధన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు. ఆ టెన్షన్లోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తనకు సుమారు 50 మంది టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే ఆరోపణలు చేసినట్టుగా ఉందన్నారు. తాను మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్ రికార్డులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈసారి వదిలేస్తున్నా.. మరోసారి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు టెన్షన్లో ఉన్నారన్నారు. ఓడిపోతామనే భయంలో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందే రాజకీయాలు వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలను లాగేసే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రారంభించిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక వేళ హంగ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని తమ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోందని ఆపద్ధర్మ మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు. కూటమి ఏర్పాటుతో నీచ రాజకీయాలకు పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇపుడు ప్రలోభాలకు తెరలేపిందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెరి సగం సీట్లు వస్తున్నాయంటూ తమకు ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలంటూ ఓ కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేశారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వస్తోందని, ఇలాంటి ప్రలోభాలను కాంగ్రెస్ వెంటనే ఆపాలని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. తనకు ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్‌లోకి రమ్మని ప్రలోభ పెట్టారని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్థించారన్నారు. తాము కేసీఆర్ సైన్యంలో ఉన్నామని, 80 నుంచి 90 సీట్లు వస్తాయని, ఇలాంటి నీచమైన ప్రలోభాలు మంచివి కావని విశ్వేశ్వర్ రెడ్డి తో చెప్పానని పేర్కొన్నారు. రెండు సార్లు ఫోన్ చేసినా అదే చెప్పానన్నారు. చంద్రబాబు దర్శకత్వంలో ఇదంతా జరుగుతోందని, కేసీఆర్ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్‌ను ఎవ్వరూ వీడే ప్రసక్తి లేదని చెప్పారు. ఇలాంటి వెకిలి చేష్టలు కాంగ్రెస్ మానుకోవాలని హెచ్చరించారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి జూనియర్ రేవంత్ రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలు నిప్పు లాంటోళ్లు తమ వాళ్లని కాంగ్రెస్ నేతలు టచ్ చేస్తే చేతులు కాలిపోతాయన్నారు. టీఆర్ఎస్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ సునామీలో కూటమి నేతలు కొట్టుకు పోవడం ఖాయమని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తే తెలంగాణ సమాజం ఒప్పుకోదన్నారు. లగడపాటి, చంద్రబాబుల ప్రలోభాలకు తెలంగాణ లొంగదని మండిపడ్డారు. విలువల గురించి మాట్లాడే విశ్వేశ్వర్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతారా అని ధ్వజమెత్తారు. 85 నుంచి 95 సీట్లు టీఆర్ఎస్ గెలవబోతోందన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా టీఆర్ఎస్ ప్రభంజనం తెలిసి పోతుందన్నారు. -
అప్పుడు బాధ.. ఇప్పుడు సంతోషం
సాక్షి, నాగర్‌కర్నూల్ : ‘గతంలో నాగర్‌కర్నూల్‌కు వస్తే ఎడారిలా ఉన్న పరిస్థితులను చూసి బాధకలిగేది. ఇప్పుడు కాల్వల్లో పారుతున్న నీళ్లను చూసి చాలా సంతోషం కలుగుతోంది’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్ మండలంలోని ఉయ్యలవాడ గ్రామ శివారులో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు గాలిగాలి, గత్తర గత్తరగా ఓటేస్తే పరిపాలన కూడా అదేవిధంగా ఉంటుంది. ఓటు వేసేముందు జాగ్రత్త వహించాలని కోరారు. నిరంతరం 24గంటల విద్యుత్ ఇవ్వాలంటే మామూలుగా సాధ్యంకాదని, కాపలా కుక్కలా పనిచేస్తేనే అలా సాధ్యమవుతోందని అన్నారు. గత పాలకులు 24గంటల కరెంట్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వలేకపోయారని అన్నారు. తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కంటివెలుగు ద్వారా మీ ఊరికే వచ్చి వైద్యబృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. రానురాను గొంతు, చెవి, ముక్కు డాక్టర్లు కూడా వస్తారని, వారి తర్వాత పథాలజికల్ బృందం కూడా మీ గ్రామాలను సందర్శించి పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడామని, అదేస్థాయిలో పరిపాలన కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. నిదానమైనా తప్పకుండా ఇస్తాం.. డబుల్ బెడ్రూం ఇళ్లు నిదానంగా ఇచ్చినా పకడ్బందీగా ఇస్తామని, రెండు తరాలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఉంటాయని అన్నారు. ఎవరికైనా స్థలం ఉంటే రూ.5లక్షలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇస్తామన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రూ.5లక్షలు రుణం ఇస్తామని చెప్పిందని, కానీ తాము ఉచితంగా ఇస్తామని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా గొర్రెల పథకం లాగే లాటరీ ద్వారా పారదర్శకంగా చేపడతామని చెప్పారు. నిజాయితీగా పనిచేస్తూ కడుపు కట్టుకుని రాష్ట్ర సంపదను పెంచుతున్నామని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని 11రాష్ట్రాల వారు వచ్చి చూశారని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఇంటింటికి తాగునీరు అందజేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాకపోతే నాగర్‌కర్నూల్ కూడా జిందగీలో జిల్లా కాకపోయేదని, ఇచ్చిన హామీ ప్రకారం నాగర్‌కర్నూల్‌ను జిల్లా చేశానని వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌కు మర్రి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే కేఎల్ఐ ద్వారా 75వేల ఎకరాలకు నీరందుతోందని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక బంగారు కందనూలే అవుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలో వట్టెం రిజర్వాయర్ పూర్తిచేసి సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మర్రి వినతులకు ఓకే కేసీఆర్ ప్రసంగానికి ముందు ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో ఇచ్చిన పలు హామీలు నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పలు అభ్యర్థనలను కేసీఆర్ ముందు ఉంచారు. దీనిపై స్పందించిన కేసీఆర్, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నాగర్‌కర్నూల్‌కు మెడికల్ కళాశాలతోపాటు ఇంజనీరింగ్ కళాశాల కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బిజినేపల్లి మండలంలో సాగునీరు అందకుండా ఉన్న 18 తండాలు, గ్రామాలకు సంబంధించి మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తామని, దీనికి తానే శంకుస్థాపన చేసి ఐదారు గంటలు అక్కడే ఉండి ప్రజలతో గడుపుతానని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ను జిల్లా చేసి ప్రజలకు కానుక ఇచ్చిన తనకు ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీని కానుక ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు ఆ స్థాయిలోనే నిధులు తేవడంతోపాటు అభివృద్ధి పనులు కూడా జరిగాయని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పి.రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకని శ్రీనివాస్‌యాదవ్, జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ వంగా మోహన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ప్రజలే నిర్ణయించాలి నాలుగున్నరేళ్ల తన పనితీరుపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ధర్మం, అధర్మం మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రజలు ధర్మంవైపు నిలబడాలి. స్థానికంగా ఉన్న నాయకులకు 40ఏళ్లలో రానిపేరు నాలుగేళ్లలో తనకు వస్తుందనే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. 275 కిలోమీటర్లు కేఎల్ఐ కాల్వగుండా పాదయాత్ర చేసి నీళ్లు రాని గ్రామాలను గుర్తించి సమస్యలను పరిష్కరించాం. నాగం, రేవంత్‌రెడ్డి ఒకే తాను ముక్కలు. మిమ్మల్ని మోసే నాయకుడు కావాలో, గెలిచిన తర్వాత మీరు మోసే నాయకుడు కావాలో తేల్చుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లుమొక్కి జిల్లా ప్రకటన చేయించా. ఈనెల 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలి. – మర్రి జనార్దన్‌రెడ్డి -
టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి
సాక్షి, నాగర్‌కర్నూల్: టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుడిపల్లి, బొందపల్లి, పెద్దాపూర్, శ్రీపురం, నాగనూల్, నెల్లికొండ, ఎండబెట్లలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఇరువురికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు టీఆర్ఎస్ను గెలిపించాలని, ప్రతీ ఒక్కరూ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపాంచాలన్నారు. ప్రాణం ఉన్నంత వరకు నాగర్‌కర్నూల్ ప్రజలకు సేవచేసుకుంటానన్నారు. మరోమారు కాంగ్రెస్ నాయకులు ఓట్లకోసం ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ మాయా కూటమి మరోమారు మోసగించేందుకు ముందుకువచ్చారని.. వారిని నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ యాదవ్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. తెలకపల్లి: మండలంలోని దాసుపల్లి, లక్నారంలో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సతీమణి మర్రి జమున ఇంటింటి ప్రచారం చేశారు. దాసుపల్లి, లక్నారంలో ఇంటింటికి వెళ్లి మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. నియోజకవర్గాన్ని మర్రి జనార్దన్‌రెడ్డి అభివృద్ధి చేశారని, సొంత ఖర్చులతో కాల్వలు తీసి కేఎల్ఐ నీరందించారన్నారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్నిరకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆమెవెంట తెలకపల్లి మాజీ సర్పంచ్ నిర్మల లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ నరేందర్‌రెడ్డి, భాగ్యమ్మ, నర్మద, రాజేందర్‌రెడి పాల్గొన్నారు. కళ్లముందున్న అభివృద్ధిని చూడండి నాగర్‌కర్నూల్: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాగర్‌కర్నూల్‌లో జరిగిన, కళ్లముందున్న అభివృద్ధిని చూడాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి సతీమణి మర్రి జమున అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. మర్రి జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో ఉన్న చనువుతో నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తేవడం జరిగిందన్నారు. గతంలో ఉన్న నాయకులు చేయలేని అభివృద్ధి పనులు కూడా చేయించారన్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు మర్రిని గెలిపించాలన్నారు. ఆమె వెంట పట్టణానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. తాడూరు: మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. నాలుగున్నర ఏళ్ల నుంచి నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదని టీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అందేవిధంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మరోసారి టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. తిమ్మాజిపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని తిమ్మాజిపేట, మరికల్, పుల్లగిరి, ఆర్సీ తండా, అవంచ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్కే ఒటేయ్యాలని ప్రజలను కోరారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరోసారి మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. వేణుగోపాల్‌గౌడ్, ప్రదీప్, స్వామి, కోటీశ్వర్, వెంకటేష్, శ్రీను, అబ్దుల్ఆలీ, వహీద్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే చెప్పులు చోరీ?
హైదరాబాద్: గుడి వద్ద ఓ ఎమ్మెల్యే చెప్పులు చోరీకి గురైనట్టు తెలిసింది. గడ్డి అన్నారం డివిజన్ టీఆర్ఎస్ సమావేశానికి వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం బయటకు వచ్చి చూసే సరికి ఎమ్మెల్యే చెప్పులు కనిపించలేదని తెలిసింది. దీంతో ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా ఓ యువకుడు పాదరక్షలు తీసుకెళ్లినట్టు సమాచారం. చోరీకి గురైన పాదరక్షల విలువ సుమారు రూ. 50 వేలు ఉండవచ్చని తెలిసింది. ఈ విషయాన్ని స్థానికి టీఆర్ఎస్ నాయకుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.