Masters tournament Sharjah
-
భారత్ అదరహో
దుబాయ్: ఆరు దేశాలు పాల్గొన్న దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ట్రోఫీ చేజిక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో ప్రపంచ చాంపియన్ భారత్ 44–26తో ఇరాన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ప్రథమార్ధం ముగిసేసరికి 18–11తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ జయభేరి మోగించింది. బలమైన భారత డిఫెన్స్‌ను ఛేదించలేక ఇరాన్ చతికిలబడింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. -
భారత్ కూత అదిరింది
దుబాయ్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత కబడ్డీ జట్టు సెమీస్‌లో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. మాస్టర్స్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత పొందింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్ 36–20తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 10 రైడ్ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్‌లో గిరీశ్ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో జాంగ్ కున్ లీ ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన కొరియా ఆ తర్వాత భారత్ ముందు నిలువలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 17–10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా పట్టు కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంది. మరో సెమీఫైనల్లో ఇరాన్ 40–21తో పాకిస్తాన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. శనివారం జరుగనున్న తుది పోరులో భారత్, ఇరాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేటి ఫైనల్: రాత్రి గం. 7.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
షార్జా మాస్టర్స్ టోర్నీ: హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... అదే జోరును షార్జా మాస్టర్స్ టోర్నీలోనూ కనబరిచింది. షార్జాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారిక ఆరు పాయింట్లు సాధించింది. మూడు గేముల్లో గెలిచిన హారిక, మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచింది. భారత్‌కే చెందిన శ్రీజ శేషాద్రి, మేరీ ఆన్ గోమ్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆదిబన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆదిబన్తోపాటు మరో ఐదుగురు క్రీడాకారులు కూడా ఏడు పాయింట్లు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా ఆదిబన్‌కు రెండో స్థానం లభించింది. వాంగ్ హావో (చైనా) విజేతగా నిలువగా... మార్టిన్ క్రాట్సివ్ (ఉక్రెయిన్) మూడో స్థానాన్ని పొందాడు. హరికృష్ణ గేమ్ ‘డ్రా’... చైనాలో జరుగుతున్న షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. యు యాంగి (చైనా)తో శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొమ్మిదో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే చివరిదైన పదో రౌండ్లో లిరెన్ డింగ్ (చైనా)తో హరికృష్ణ ఆడతాడు. లిరెన్ డింగ్ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... అనీశ్ గిరి (నెదర్లాండ్స్) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.