'ముదుర్స్' గా పుట్టి 'మదర్స్' మాట వినని హర్ష
'మనుషుల్ని సృష్టించిన దేవుడే...' అంటూ అక్కినేని నాగేశ్వరరావు తన ఆఖరు సినిమా 'మనం' లో డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులు తన్మయులై విన్నారు. 'బై బర్త్ ముదుర్సగా పుట్టిన వారు మదర్స్ మాటే వినరు, ఇంక అదర్స్ మాట ఎందుకు వింటారు' అంటూ 'గుండెజారి గల్లంతయ్యిందే'లో నితిన్ గురించి చిలిపిగా పరిచయం చేస్తున్నా అలాగే విన్నారు.
'ఐలవ్ యు అంటే ఇలా ఇవ్వు' అని కొత్తగా రాసినా అబ్బా బాగుందే అనుకున్నారు. ఈ మాటల మాయ వెనుక ఉన్నది హర్షవర్ధన్. నటునిగా చాలాకాలంగా ప్రేక్షకులకు తెలిసినా రచయితగా ఇప్పుడు కొత్త అవతారంలో అందిరినీ అలరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టి విజయనగరంలో చదువుకున్న హర్షవర్ధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో సంభాషించారు.
మీది విజయనగరమే కదా..?
హర్ష: నేను పుట్టింది రాజాంలో. ఎల్కేజీ నుంచి నాల్గవ తరగతి వరకు విశాఖలో చదువుకున్నా. మళ్లీ డిగ్రీ మొదటి సంవత్సరం వరకు విజయనగరంలో చదువుకున్నా. అందుకే విజయనగరం తో బంధం వీడనంతంగా బలపడింది. చాలా వ రకు స్నేహితులు ఇక్కడి వారే.
విజయనగరంలో మూడు రోజులుగా గడుపుతున్నారు. ఎలా ఉంది..?
హర్ష: అమ్మతో అనుబంధాలు పంచుకున్నా. నా చిన్న నాటి మిత్రులందరినీ కలుసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. వచ్చే నె ల 26, 27 తేదీల్లో మళ్లీ విజయనగరం వచ్చి ఆరెండు రోజులు పూర్తిగా నా చిన్ననాటి మిత్రులతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాం.
సినీ రంగంలోకి ఎందుకు వెళ్లాలనిపించింది.? మీకు అందులో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..?
హర్ష: నాకు చిన్న తనం నుంచి సినిమా అంటే పి చ్చి. అందుకే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకునేవాడిని. డిగ్రీ పూర్తయిన తరువాత సినీరంగంలో ఎవరూ తెలియకున్నా స్నేహితుడి తో కలిసి ఎర్రబస్సెక్కినట్లు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయా.(నవ్వుతూ...)
అక్కడ మీ జర్నీ సంగతులు..?
హర్ష: అమ్మ, నాన్న కాస్త భయపడ్డారు. నేను మాత్రం పట్టుదలతో ఎలా అయినా రాణించాలనుకున్నా. అయితే సినిమా అంటే అలా ఉంటుందని అప్పటి వరకు నాకు తెలియదు.
అసలు మీరు ఏమి అవుదామని అక్కడికి వెల్లారు..?
హర్ష: నా పట్టుదల అంతా ఒక్కటే. మ్యూజిక్ డెరైక్టర్ కావాలని. అయితే అప్పట్లో నాకు కనీసం సంగీతం అంటే అవగాహన ఉంది తప్ప అంతకుమించి ఏమీ తెలియదు. అందరి లాగానే హైదరాబాద్ వెళ్లగానే అన్ని ఆఫీసులకు తిరిగాను. కొన్ని ఇబ్బందులు పడ్డాను. అయితే నన్ను చూసిన వాళ్లంతా నీ కళ్లు, వాయిస్ బాగున్నాయి. యాక్టింగ్ చేయచ్చుగా అని అడిగారు.
అయితే మీ తొలి ప్రయత్నం కెమేరా ముందున్న మాట.?
హర్ష: ఏదో వచ్చిన తర్వాత నిరాశతో వెనక్కివెళ్లిపోకుండా ఎలా అయినా సినీ రంగంలో సిర్థపడాలనుకున్నా. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. ముందుగా రుతురాగాలు సీరియల్లో యాక్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రారంభమైన వందేమాతరం సీరియల్ ముందు టెలికాస్ట్ అయిందనుకోండి.
మీరు తొలుతగా గుర్తింపు తెచ్చుకున్న సందర్బం..?
హర్ష: అమృతం సీరియల్. ఆ సీరియల్ నాకు తొలి మెట్టు వంటిది.
మీరు కథలు రాస్తుంటారా..?
హర్ష: విశాఖ ఎక్స్‌ప్రెస్ సినిమాకు. అందులో హీరో నరేష్, రాజీవ్ కనకాల నటించారు. అందులో సగభాగమే నా పాత్ర ఉంది.
మీరు చేసిన సినిమాల్లో ఇష్టమైనవి..?
హర్ష: నటన పరంగా లీడర్. క్యారెక్టర్ పరంగా స్టాలిన్ సినిమాలో చేసిన పాత్ర. 55 రోజుల పాటు ఆ సినిమా షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవితో గడిపడటం ఎంతో అనుభూతినిచ్చింది. సెట్లో ఆయన నేను మాత్రమే ఉండేవారం. నేను పుట్టిన ఊరు, పెరిగి పెద్దయిన పరిస్థితులు అన్ని ఆయనకు వివరించా.
మీకు బాగా గుర్తింపు వచ్చిన సందర్భం..?
హర్ష: గుండె జారి గల్లంతయ్యిందే. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ని. అప్పటి వరకు నేను ఏ మాటలు, కథలు రాయాలన్నా సేఫ్‌జోన్‌లోనే ఉంటూ నా పని చేసేవాడ్ని. అయితే ఆ సినిమా నా సినీ జీవితంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో రిస్క్‌తో (డూ అర్ డై) అన్న చందంగా ఆ సినిమా చేశాం. చివరికి మంచి ఫలితం లభించింది.
మీకు నచ్చిన తారలు..?
హర్ష: అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరిలో ఓ వైవిధ్యం ఉంటుంది.
మీరు సినీరంగంలో రాణించేందుకు ఎవరైనా సహాయం చేశారా..?
హర్ష: నాకు ప్రేక్షకులే వెన్నుదన్ను. మొదటిలో చిన్న చిన్న రోల్స్ (అంటే ఆ సీన్ ఎప్పుడు వచ్చి వెళ్లిపోయేదో తెలియనవి) కూడాచేశా.
మీరు పుట్టి పెరిగిన ఊరిలో సన్మానం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది..?
హర్ష: అసలు నాకు సన్మానాలంటేనే ఇష్టం ఉండదు. మొన్న రోటరీ వాళ్లు ఇచ్చింది పురస్కారం. ఆ విషయం ఇక్కడకు వచ్చేంత వరకు తెలియదు.
సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగారు.. మీ అనుభూతి..?
హర్ష: ఈ రంగంలో రాణించాలంటే అదృష్టం ఉండాలి. నా కన్నా బాగా నటించి గలిగే వారు, నటన అంటే ప్రాణం పెట్టేవారు, అందగాళ్లు చా లా మంది ఉన్నా వారికి అవకాశాలు దక్కని పరి స్థితి. అలా అని కాస్త యావరేజ్‌గా ఉన్నా నా కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారు లేకపోలేదు.
మనం సినిమాకి మాటలు రాశారు. ఆ సినిమా గురించి కాస్త...?
హర్ష: తప్పకుండా... నేను చిన్నపుడు మాయాబజార్ సినిమా చూశా. అప్పట్లో ఆడియో టేపులు ఉండేవి. మా ఇంట్లో ప్రతి రోజు అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన డైలాగులు వింటుండేవాడిని, ఒక రోజు ఇంట్లో వారి ముందే 90 నిమిషాలు పాటు అందులో డైలాగులు చెప్పేశా. అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ సినిమాయే నాకు మాటలు నేర్పింది. ఆ సినిమాలో హీరో నటించిన ఏఎన్ఆర్ చివరి చిత్రానికి మాట లు రాయటం పూర్వజన్మ సుకృతం. నా కోసమే ఆయన అన్నాళ్లు జీవించి ఉన్నారేమో అనిపించింది. నేను సమకూర్చిన మాటలనే ఆయన పలికారు. ఎంతో అనందమనిపించింది.
జీవితంలో మీ లక్ష్యాలు ..?
హర్ష: సినిమా రంగంలో అయితే ఏమీ లేవు. ప్రస్తుతం జరుగుతున్నదంతా నాకు బోనస్. పర్సనల్ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం కోటి మొక్కలు నాటాలని ఉంది. 1000 మంది అ నాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించాలని ఉంది.
లేటెస్ట్గా మీరు మాటలు రాసిన సినిమా?
హర్ష: వస్తుంది.. గురువారం ఆ సినిమా పాటలు విడుదలయ్యాయి.