పేదల నుంచి లాభాలు పిండుకోవద్దు
మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ హితవు
ముంబై: సమాజంలో అట్టడుగునున్న నిరుపేదల నుంచి కూడా లాభాలను పిండుకోవడం తగదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ(ఎంఎఫ్ఐ)లనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సంబంధించిన రుణాల విషయంలో ఎంఎఫ్ఐలు అధిక లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన ఎంఎఫ్ఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రఖ్యాత మేనేజ్మెంట్ గురు సీకే ప్రహ్లాద్ రాసిన ‘ద ఫార్చూన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్’ అనే పుస్తకంలో అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా రాజన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కంపెనీలు పేదల లక్ష్యంగా వస్తు, సేవల వ్యాపారాల నిర్వహణ కోసం అనుసరించాల్సిన కొత్త వ్యాపార విధానాలను ప్రహ్లాద్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ‘ప్రహ్లాద్ తన పుస్తకంలో అట్టడుగున సంపద దాగి ఉందంటూ పేర్కొనడం ద్వారా పేదలపై నిర్దయతో వ్యవహరించారని భావిస్తున్నా.
నిరుపేదల నుంచి ఎవరైనాసరే ఎలా లాభాలు దండుకుంటారు. తమ వ్యాపారాలు నిలదొక్కుకునేందుకు అవసరమైనమేరకే స్వల్ప లాభాలకు పరిమితం కావాలనేదే నా ఉద్దేశం. ఎడాపెడా లాభాలు పిండుకుంటే అది సమాజంలో ఆందోళనలు పెరిగేందుకు దారితీస్తుంది. ప్రహ్లాద్ చెప్పిన మేనేజ్మెంట్ పాఠాలతో చాలా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మారుమూల మార్కెట్లలోకి చొచ్చుకెళ్లాయి. ముఖ్యంగా దేశంలోని కన్సూమర్ గూడ్స్, వాహన, టెలికం కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. అయితే, ఎవరైనాసరే నిరుపేదలకు సేవల విషయంలో అధిక లాభాపేక్షలేకుండా వ్యవహరించాలి’ అని రాజన్ అన్నారు.