డ్వాక్రా మహిళలకు సర్కార్ షాక్..!
కర్నూలు రూరల్ : అధికారం చేపట్టిన వెంటనే తీపికబురు అందిస్తుందనుకున్న టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు షాక్ ఇచ్చింది. స్త్రీనిధి పథకం కింద తీసుకున్న రుణాలన్నింటినీ తప్పనిసరిగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇది ఈ నెల నుంచే అమలు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.5, పది రూపాయల వడ్డీకి రుణాలు తీసుకొని మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ ఉచ్చు నుంచి వారిని బయట పడేసేందుకు, కుటుంబ అవసరాలకు చిన్న మొత్తాలను వడ్డీ లేకుండా అందించేందుకు 2011 నవంబరు నెలలో స్త్రీ నిధి బ్యాంకును అప్పటి ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చింది. ఒక్కో సంఘంలో పది మంది దాకా రుణగ్రహీతలు ఉన్నారు.
ఇలా కర్నూలు మండలంలో సుమారు 240 మంది మహిళలు రూ. 43 లక్షల రూపాయలు తీసుకున్నారు. నిన్నటి వరకు ఈ రుణాలపై వడ్డీని నేరుగా ప్రభుత్వమే సంబంధిత బ్యాంకులకు చెల్లించేది. అయితే ఈ నెల నుంచి అసలుతో పాటు వడ్డీ వసూలు చేయాలని కొత్తప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పొదుపు సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టోలో డ్వాక్రా మహిళల అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో అసలుతో పాటు వడ్డీ ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.