జంతు ప్రేమికులు
ఇంట్లో బొచ్చు కుక్కకు ముద్దు పేరు పెట్టుకుని మరీ ముద్దులు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. అదే కుక్క వీధిలో కనిపిస్తే పిచ్చి కుక్కని దూరంగా పోతుంటారు. లేదా ఛీకొడతారు. ఇక పిల్లి ఎదురొస్తే అపశకునంగా భావించి పనులు వాయిదా వేసుకుంటారు. ఇలాంటివి పట్టించుకోకుండా వీధుల్లోని మూగజీవాలకు ఆహార భద్రత కల్పిస్తున్నారు కొందరు సిటీవాసులు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ పదుల సంఖ్యలో శునకాలు, మార్జాలాల ఆకలి తీరుస్తూ మనవత్వాన్ని చాటుతున్నారు.
వీధి కుక్కలకు దిక్కు..
పెంపుడు శునకాలకు ఉండే రాజభోగాలు అన్నీ ఇన్నీ కావు. ఆహారం కోసం అలమటించడం వీధి కుక్కల దినచర్యలో భాగం. అలాంటి శునకాల పాలిట అన్నపూర్ణగా మారారు సుజీ అబ్రహం. హిమాయత్‌నగర్ 5వ వీధిలో ఉండే సుజీ బ్లూక్రాస్ సంస్థలో మెంబర్ కూడా. ప్రతి ఉదయం 4 కిలోల బియ్యం వండి.. అన్నాన్ని తన కోసం ఎదురు చూస్తున్న శునకాలకు పంచుతుంది. 15 ఏళ్లుగా ఇది కొనసాగిస్తున్నారామె. కుక్కల కడుపు నింపడమే కాదు.. అవి తినేసిన తర్వాత ఆకులను చెత్తకుండిలో వేసి పారిశుద్ధ్య ప్రాధాన్యాన్ని చాటుతున్నారు. ఆహారం దొరక క వీధి కుక్కలు పడుతున్న అవస్థలు వాటి పిల్లలు పడకూడదనే ఆలోచనతో స్టెరిలైజ్ చేయిస్తుంటారు. రేబిస్ ఇంజక్షన్లు కూడా వేయిస్తుంటారు. చనిపోయిన కుక్కలకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తుంటారు.
- రంగయ్య, హిమాయత్‌నగర్
మిడ్నైట్ మీల్స్..
స్థలం: ఆనంద్‌బాగ్, సమయం: అర్ధరాత్రి
పదుల సంఖ్యలో శునకాలు రోడ్డుమీద తచ్చాడుతుంటాయి. ఎవరో వస్తారని.. ఏదో తెస్తారని.. ఆత్రంగా ఎదురు చూస్తుంటాయి. ఆ మనిషి రాగానే.. అన్నీ అతని చుట్టూ చేరిపోతాయి. తోకలాడిస్తూ.. కాళ్లెత్తి సలామ్ కొడతాయి. ఆయన తీసుకొచ్చిన ఆహారాన్ని ఎంచక్కా తినేసి తోకలు ఆడిస్తూ కృతజ్ఞతాభావాన్ని చాటుకుంటాయి. ప్రతి రోజూ ఈ సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ శునకరాజాల ఆకలి తీరుస్తున్న మనసున్న మనిషి పేరు పురుషోత్తం. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఏడేళ్ల కిందట ఓ అర్ధరాత్రి శునకాల ఆకలి అరుపులు విన్న ఆయన కడుపు తరుక్కుపోయింది. ఆ రోజు నుంచి ఆ వీధిలోని కుక్కలకు అన్నదాతగా మారాడు. బన్ను, బిస్కెట్లు.. ఆదివారం వస్తే చికెన్ పీస్‌లు.. అందిస్తున్నాడు. వీటి కోసం నెలకు రూ.10 వేలు ఖర్చు చేస్తున్నాడు. ‘పగటి పూట వాటికి ఆహారం పెట్టడం మంచిది కాదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాల బారిన పడవచ్చు. అందుకే అర్ధరాత్రుల్లో వాటి కడుపు నింపుతుంటాను’ అని చెబుతాడు పురుషోత్తం.
- సునీల్‌రెడ్డి, మల్కాజిగిరి
పిల్లులతో దోస్తీ...
స్థలం: చిలకలగూడ
సమయం: మధ్యాహ్నం 12 గంటలు
ఓ ఇంటి నుంచి పిల్లుల మ్యావ్.. మ్యావ్‌లు.. తెగ వినిపిస్తుంటాయి. ఒక్కసారి ఇంట్లోకి తొంగి చూస్తే.. చుట్టూ పిల్లులు.. మధ్యలో ఓ మనిషి. ఆయన పేరు మేకల హన్మంతరావు. అపశకునానికి సింబాలిక్‌గా పిల్లిని చెప్పుకుంటారు. కానీ హన్మంతరావు మాత్రం ఏకంగా 25 పిల్లులను పెంచుతున్నాడు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు వాటికి ఠంచనుగా ఆహారం అందిస్తాడు. పిల్లి చేష్టలను ఆప్యాయంగా చూసి మురిసిపోతుంటాడు. ఇన్ని పిల్లులు ఎక్కడి నుంచి వచ్చాయని సందేహం రావొచ్చు. ఇవన్నీ ఆయన ఇంటి పైవాటాలోనే ఉంటాయి. పిల్లుల కోసమే టైపై ప్రత్యేకంగా షెడ్ వేయించారాయన. మొదట్లో 100 పిల్లుల వరకూ ఉండేవి. కొన్ని చనిపోగా, ఇంకొన్ని ఎక్కడికో వెళ్లిపోయాయి. ప్రస్తుతం 25 పిల్లులు కేరాఫ్ హన్మంతరావుగా కాలం వెళ్లదీస్తున్నాయి. ‘వాటికి ఆహారం వేయకపోతే మనసు విలవిల్లాడుతుంది. అందుకే ఏదైనా ఊరికి వె ళ్లాల్సి వస్తే.. మిత్రులకు వాటి బాధ్యతను అప్పగిస్తాను’ అని తెలిపాడు హన్మంతరావు.
- శ్రీనివాస్, చిలకలగూడ
నాన్పేయింగ్ గెస్ట్స్..
చుట్టాలకు, పక్కాలకు కూడా ఇంట్లో చోటు ఇవ్వలేని సిటీలైఫ్‌లో.. తన నివాసాన్ని మూగజీవాల ఆవాసంగా మార్చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు నీలిమా నాగరాజు. పంజగుట్ట ప్రతాప్‌నగర్ కాలనీలో ఉండే ఆమె ఇంట్లో.. తొమ్మిది శునకాలు, 10 పిల్లులు నాన్పేయింగ్ గెస్ట్‌లు. జాతివైరాన్ని మరచి స్నేహంగా ఉంటాయివి. 40 ఏళ్లుగా శునకాలు, మార్జాలాలను పెంచుతున్నారామె. ఉదయాన్నే వీటికి పాలు.. బ్రెడ్, లంచ్, డిన్నర్లలో అన్నంతో పాటు మాంసాహారం వడ్డిస్తున్నారు. 24 ఏళ్లుగా ఓ చిలుకను కూడా పెంచారామె. ముద్దు ముద్దుగా మాటలు పలికే ఆ చిలుక పేరు రాము. కొన్నాళ్ల కిందట అది చనిపోయింది.
- సత్య, శ్రీనగర్‌కాలనీ