mining ban
-
మైనింగ్‌పై పూర్తి నిషేధం
ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు నెలల పాటు మైనింగ్‌ను పూర్తిగా నిషేధించింది. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపౌ ఉన్నత స్థాయి కమిటీ ఒకదాన్ని ఏర్పాటుచేయాలని, దానిద్వారా అన్ని విషయాలూ తెలుసుకని, నాలుగు నెలల తర్వాత అయినా మైనింగ్‌ను పునరుద్ధరించాలో వద్దో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం దృష్ట్యా 50 ఏళ్లకు సరిపోయేలా ఒక బ్లూప్రింట్‌ను కూడా ఈ కమిటీ తయారుచేయాల్సి ఉంటుంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న మైనింగ్ వల్ల హిమాలయాల్లోని శివాలిక్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న అడవులు, నదులు, జలపాతాలు, సరస్సులు అన్నీ దెబ్బతింటున్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విషయాలు చెప్పింది. సమగ్ర నివేదిక వచ్చేవరకు మైనింగ్ కార్యకలాపాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ మాఫియా చేతుల్లో ఒక అటవీ శాఖాధికారి హత్యకు గురి కావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మైనింగ్ వ్యవహారాలపై కలకలం రేగింది. అనంతరం దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దాన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సుధాంశు ధులియా ఈ ఆదేశాలు ఇచ్చారు. మైనింగ్ వల్ల శివాలిక్ ప్రాంతం బాగా దెబ్బతింటోందని, ఇక రాష్ట్రంలో అసలు అక్రమ మైనింగ్ అన్నది లేకుండా రాష్ట్రప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉన్నతస్థాయి కమిటీ హైకోర్టుకు తమ నివేదిక ఇచ్చేవరకు రాష్ట్రంలో మైనింగ్ జరగడానికి గానీ, లైసెన్సులు ఇవ్వడానికి గానీ, పునరుద్ధరించడానికి గానీ వీల్లేదని స్పష్టం చేసింది. -
మైనింగ్ చట్టాన్ని సవరించాలి
మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైన్స్, మినరల్స్(డెవలప్మెంట్, రెగ్యులేషన్) యాక్టును సవరించాలని మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఈఏఐ) డిమాండ్ చేస్తోంది. గోవాతోపాటు ఒడిషాలోని 26 గనుల్లో మైనింగ్ నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. యాక్టుకు సవరణలతోపాటు ఈ రెండు రాష్ట్రాల్లో మైనింగ్‌కు అనుమతించాలని ఎంఈఏఐ ప్రెసిడెంట్ అరిజిత్ బాగ్చి కోరారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. చట్ట సవరణ జరిగితేనే మైనింగ్ కార్యకలాపాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో మైనింగ్ నిషేధం ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదన్నారు. అవకతవకలకు పాల్పడడం మైనింగ్ సంస్థల ఉద్ధేశం కాదని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులకు, నిబంధనలకు మధ్య అంతరం ఉంటుందని తెలిపారు. పొరపొచ్చాలను తొలగించేలా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్షలాది మందికి ఉపాధి..: మైనింగ్ రంగంలో ఒక్క గోవాలోనే మూడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ టి.వి.చౌదరి తెలిపారు. గోవాలో ఏటా రూ.22 వేల కోట్ల విలువైన 45 మిలియన్ టన్నుల ఖనిజం వెలికితీస్తున్నారని చెప్పారు. ఒడిషాలోని 26 గనుల్లో 35 మిలియన్ టన్నుల ఖనిజం తీస్తున్నారని తెలిపారు. మైనింగ్‌ను ఇన్‌ఫ్రాగా ప్రకటించాలి : సీఐఐ న్యూఢిల్లీ: మైనింగ్‌ను మౌలిక రంగంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీఐఐ కోరింది. తయారీ రంగం వృద్ధికి ఈ చర్య అవసరమని పేర్కొంది. మైనింగ్‌ను మౌలిక సౌకర్యాల రంగంలో చేరిస్తే ఒనగూరే ప్రయోజనాల గురించి గనుల శాఖకు సీఐఐ ఇటీవల ఒక విజ్ఞాపన పత్రం సమర్పించింది. ఉపాధి కల్పనలోనూ, విదేశీ మారక ద్రవ్యాని ఆదా చేయడంలోనూ మైనింగ్ పాత్ర కీలకమని తెలిపింది. వెనుకబడిన పలు రాష్ట్రాల్లో అభివృద్ధిని సాధించడంలో కూడా మైనింగ్ రంగానిదే ముఖ్య భూమిక అని వివరించింది. మైనింగ్ లెసైన్సును ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఎలాంటి ఆటంకాల్లేకుండా బదిలీ చేయడం వంటి కీలక చర్యలను తక్షణమే చేపట్టవచ్చని సీఐఐ తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా పన్నుల భారం మోస్తున్న రంగాల్లో భారతీయ మైనింగ్ ఒకటనీ, మరిన్ని పన్నులు విధించే ముందు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలనీ కోరింది.