ఆ బిడ్డకు ముగ్గురు తల్లిదండ్రులు!
దేవకి.. యశోద.. ఇద్దరు తల్లుల బిడ్డ శ్రీకృష్ణుడు. మనకు తెలిసి ఇలా కన్నతల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటారు. కానీ, ఒక బిడ్డకు నేరుగానే ముగ్గురు తల్లిదండ్రులు ఉండటం సాధ్యమేనా? ముగ్గురికీ కలిపి ఒక బిడ్డ పుట్టడం ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో ఇలాంటి సరికొత్త ఫెర్టిలిటీ టెక్నిక్‌ను ఉపయోగించి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఐదు నెలల వయసున్న ఈ బిడ్డకు తన తల్లిదండ్రుల నుంచి సాధారణంగా సంక్రమించే డీఎన్ఏ ఉంది. దాంతోపాటు.. మరో దాత నుంచి స్వీకరించిన చిన్న జెనెటిక్ కోడ్ కూడా ఉంది. అంటే, తల్లిదండ్రులు ఇద్దరితో పాటు మరో తల్లి కూడా ఈ బిడ్డకు ఉందన్నమాట. వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదైన ఈ ప్రయోగాన్ని.. మానవాళి మేలు కోసమే చేశామంటున్నారు వైద్యులు. అత్యంత అరుదైన జన్యు పరిస్థితులతో బాధపడే కుటుంబాలలో పుట్టే పిల్లలను కాపాడేందుకు ఇలాంటి ప్రయత్నం చేశామన్నారు. ఇది రాబోయే రోజుల్లో వైద్యశాస్త్రంలోనే మంచి మలుపు అవుతుందన్నారు. అయితే.. ఇలాంటి కొత్త, వివాదస్పద టెక్నాలజీని పూర్తిస్థాయిలో పరిశీలించాలని చెబుతున్నారు. ఈ పద్ధతికి మైటోకాండ్రియా దానం అని పేరుపెట్టారు.
మైటోకాండ్రియా అనేది శరీరంలో ఉండే ప్రతి కణంలోనూ ఉండే చిన్నపాటి నిర్మాణం. ఇది మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. కొంతమంది మహిళలకు మైటోకాండ్రియాకు సంబంధించిన జన్యులోపం ఉంటుంది. అది వాళ్ల పిల్లలకు కూడా వస్తుంది. లీ సిండ్రోమ్ అనే ఒక జన్యుపరమైన లోపం జోర్డాన్‌లోని ఓ కుటుంబానికి ఉంది. దానివల్ల వాళ్లు పిల్లలను కంటే, ఆ పిల్లలు బతికే అవకాశం లేదు. ఆ మహిళకు నాలుగుసార్లు అబార్షన్ కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారు. ఒకరు 8 నెలల వయసులోను, మరొకరు ఆరేళ్ల వయసులోను మరణించారు. ఇలాంటి కుటుంబాలను కాపాడేందుకే శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులు కనుగొన్నారు.
మెక్సికోలో ఇలాంటి పద్ధతుల మీద ఎలాంటి నిషేధం లేదు కాబట్టి వైద్యబృందం ఆ జంటను అక్కడకు తీసుకెళ్లింది. తల్లి అండాల నుంచి సేకరించిన డీఎన్ఏతో పాటు.. ఒక దాత అండాల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన మైటోకాండ్రియాను ఉపయోగించి, పూర్తిగా ఆరోగ్యకరమైన అండాన్ని తండ్రి వీర్యంతో ఫలదీకరించారు. ఫలితంగా పుట్టిన బిడ్డకు దాత నుంచి 0.1% డీఎన్ఏ (మైటోకాండ్రియల్ డీఎన్ఏ) వచ్చింది. మిగిలిన జన్యుకోడ్ అంతా.. అంటే జుట్టు, కళ్ల రంగు అన్నీ తల్లిదండ్రుల నుంచే వచ్చాయి. న్యూయార్క్ నగరంలోని న్యూ హోప్ ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ జాన్ ఝాంగ్, ఆయన సహచరులు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.
అయితే ఆ బిడ్డ పెరిగిన తర్వాత తన డీఎన్ఏ ప్రకారం తల్లిదండ్రులు ఎవరన్న ప్రశ్న తలెత్తే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. విజయవంతంగా బిడ్డ పుట్టి పూర్తి ఆరోగ్యకరంగా ఉన్న సందర్భాల గురించి మాత్రమే ఈ ప్రయోగాలలో బయటకు చెబుతున్నారని, విఫలమైన ప్రయోగాల విషయాలు మాత్రం బయటకు రాకుండా తొక్కేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా తాము సమాధానం ఇస్తామని.. అక్టోబర్‌లో అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ సమావేశంలో జవాబిస్తామని డాక్టర్ జాంగ్, ఆయన బృంద సభ్యులు చెబుతున్నారు.