miyapur police
-
TS Crime News: 'చెడ్డీ గ్యాంగ్' ప్రధాన నిందితుడి అరెస్ట్..!
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ప్రధాన నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్ రావు గురువారం వివరాలు వెల్లడించారు. హఫీజ్‌పేట్‌లోని వసంత విల్లాస్‌లో 75వ విల్లాలో నివాసం ఉంటున్న రాంసింగ్ కుటుంబంతో సహా ఈ నెల 6న సంగారెడ్డికి వెళ్లాడు. 7న సాయంత్రం అతను తిరిగి వచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుజరాత్, ఆంబ్లీ ఖాజురియా గ్రామానికి చెందిన మినమ ముఖేష్ బాయ్‌ని ఆదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. విక్రం బాయ్ దరియా బాయ్ పార్మర్, మోహనియా నితిన్‌బాయ్, సుర్మల్ అలియాస్ సుమోతో కలిసి ఆగస్టు 5న లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేసుకున్న వారు రెండు రోజుల పాటు అమీన్పూర్, మియాపూర్ పీఎస్‌ల పరిధిలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించారు. 6వ తేదీ రాత్రి అమీన్పూర్ పీఎస్ పరిధిలో మూడు ఇళ్లలో చోరీ చేశారు. ఆ తర్వాత 7న తెల్లవారుజామున వసంత విల్లాస్‌లో చోరీకి పాల్పడ్డారు. చోరీ సొత్తుతో గుజరాత్‌కు పారిపోయారు. గుజరాత్లో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న విక్రం బాయ్ దరియా బాయ్ పార్మర్ను దాహోడ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నితిన్ బాయ్, సుర్మల్ అలియాస్ సుమో పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో చిక్కకుండా.. నిందితులు మొదట అమీన్పూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు విప్పి అండర్ వేర్‌పై తాళ్లసాయంంతో మూడు ఇళ్లలో ప్రవేశించి తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకున్నారు. అనంతరం దుస్తులు ధరించి హఫీజ్‌పేట్‌లోని వసంత విల్లాస్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ కూడా దుస్తులు విప్పి విల్లా వెనక నుంచి లోపలికి ప్రవేశించి రాడ్లతో తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎవరైనా వీరిని అడ్డుకుంటే దాడి చేసేందుకు వెనకాడరని డీసీపీ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహ్మ రావు, సీసీఎస్ ఏసీపీ శశాంక్ రెడ్డి, సీఐలు ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వందలమంది యువతుల్ని మోసం చేశాడు...
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం అంటూ ఆశ చూపి...వందలాది మంది యువతులను మోసం చేశాడో కేటుగాడు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి...ఆ తర్వాత నిజ స్వరూపం చూపించేవాడు. ఆకర్షణీయమైన ఉద్యోగం కావాలంటే శరీరమంతా కనిపించేలా ఫోటోలు పంపాలంటూ వేధింపులకు దిగాడు. చివరకు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడు కటకటాలపాలయ్యాడు. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి చెన్నైలోని టీసీఎస్ కంపెనీలో పని చేస్తున్నాడు. యువతుల నగ్న చిత్రాలను సేకరించేందుకు పథకం పన్నాడు. ప్రముఖ కంపెనీల్లో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయంటూ ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించి ప్రకటనలు గుప్పించాడు. ఉద్యోగం కావాలంటూ ఎవరైనా ప్రదీప్‌ను సంప్రదిస్తే... ‘ఈ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే .. ఆకర్షణీయమైన రూపం ఉండాలి. ఫ్రంట్, బ్యాక్, చెస్ట్ కనపడేలా ఫోటోలు పంపించాలి’ అని మాయమాటలు చెప్పేవాడు. ఫోటోల్లో ఆకర్షణీయంగా ఉంటేనే ఉద్యోగం సొంతమవుతుందని నమ్మించేవాడు. అతని మాటల్ని నమ్మి 16 రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది యువతులు తమ ఫొటోల్ని పంపించారు. అయితే మియాపూర్‌కి చెందిన ఒక బాధితురాలికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు చివరకు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని దగ్గర వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రధాని మోదీ భార్య కోసం దీక్ష.. భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్ కోసం.. వైద్యురాలు పాలెపు సుశీల చేస్తోన్న దీక్షను మియాపూర్ పోలీసులు భగ్నం చేశారు. మోదీ.. యశోదాను భార్యగా అంగీకరించి గౌరవించాలని, లేకుంటే, జెడ్ కేటగిరి భద్రత తొలగించి ఆమెకు స్వేచ్చ ప్రసాదించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తోన్న సుశీలను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా నీరసించినపోయిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేప్రయత్నం చేశారు. అయితే తాను మాత్రం డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా దీక్ష విరమించబోనని సుశీల సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎవరీ డాక్టర్ సుశీల? : అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలిగా ఉన్న డాక్టర్ పాలెపు సుశీల.. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్నారు. హైందవ జీవన విధానంలో మహిళ పూజ్యనీయురాలని, స్త్రీల గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడటం కోసమే తాను దీక్షకు దిగినట్లు సుశీల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుశీల.. ఎప్పటికప్పుడు దీక్ష వివరాలను పోస్ట్‌చేశారు. ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు : దీక్ష భగ్నం అనంతరం ప్రధానిని ఉద్దేశించి డాక్టర్ సుశీల ఘాటు వ్యాఖ్యలు చేశారు. యశోదా బెన్ భారతనారి అని, మోదీ బ్రిటిష్ అధికారి అని, ఇద్దరిలో తాను భారతనారివైపే ఉంటానని చెప్పుకొచ్చారు. కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉన్నందునే యశోదా బెన్‌కు భద్రత కల్పిస్తున్నారని, ఈ విషయంలో దీక్షలు అవసరం లేదని నెటిజన్లు సుశీలకు సలహాలిస్తున్నారు. బాల్యంలోనే యశోదను పెళ్లాడిన నరేంద్ర మోదీ.. అనంతరకాలంలో ఆమెకు దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లోనూ భార్య గురించిన వివరాలేవీ ఆయన పొందపర్చలేదు. దీనిపై విపక్షాలు ఆందోళన చేయడంతో మోదీ వైవాహిక బంధంపై బీజేపీ నాయకులు కొన్ని ప్రకటనలు చేసిన విషయం విదితమే. డాక్టర్ సుశీల(ఫేస్బుక్ నుంచి తీసుకున్న ఫొటో) -
సమైక్య ఐక్యవేదిక సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు
సమైక్యాంధ్రకు మద్దతుగా కూకట్‌పల్లిలో సమైక్య ఐక్య వేదిక నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమావేశానికి అనుమతి లేదంటూ రౌండ్ టేబుల్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా సమైక్య ఐక్యవేదిక నిర్వాహకులు జనచైతన్యవేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, హర్షవర్థనరెడ్డి, గౌతం, చల్లా మధుసూధనరెడ్డిలను మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో ఆ సభకు విచ్చేసిన అధికమంది సమైక్యవాదులు నిరాసనతో వెనక్కిమళ్లాల్సి వచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు, న్యాయవాదులు మంగళవారం కూకట్‌పల్లిలో సమైక్య ఐక్య వేదిక ఏర్పాటు చేశారు.