ప్రధాని మోదీ, ఆయన సతీమణి యశోదా బెన్(ఫైల్ ఫొటోలు), గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుశీల(లేటెస్ట్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్ కోసం.. వైద్యురాలు పాలెపు సుశీల చేస్తోన్న దీక్షను మియాపూర్ పోలీసులు భగ్నం చేశారు. మోదీ.. యశోదాను భార్యగా అంగీకరించి గౌరవించాలని, లేకుంటే, జెడ్ కేటగిరి భద్రత తొలగించి ఆమెకు స్వేచ్చ ప్రసాదించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తోన్న సుశీలను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా నీరసించినపోయిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేప్రయత్నం చేశారు. అయితే తాను మాత్రం డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా దీక్ష విరమించబోనని సుశీల సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఎవరీ డాక్టర్ సుశీల? : అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలిగా ఉన్న డాక్టర్ పాలెపు సుశీల.. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్నారు. హైందవ జీవన విధానంలో మహిళ పూజ్యనీయురాలని, స్త్రీల గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడటం కోసమే తాను దీక్షకు దిగినట్లు సుశీల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుశీల.. ఎప్పటికప్పుడు దీక్ష వివరాలను పోస్ట్‌చేశారు.
ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు : దీక్ష భగ్నం అనంతరం ప్రధానిని ఉద్దేశించి డాక్టర్ సుశీల ఘాటు వ్యాఖ్యలు చేశారు. యశోదా బెన్ భారతనారి అని, మోదీ బ్రిటిష్ అధికారి అని, ఇద్దరిలో తాను భారతనారివైపే ఉంటానని చెప్పుకొచ్చారు. కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉన్నందునే యశోదా బెన్‌కు భద్రత కల్పిస్తున్నారని, ఈ విషయంలో దీక్షలు అవసరం లేదని నెటిజన్లు సుశీలకు సలహాలిస్తున్నారు. బాల్యంలోనే యశోదను పెళ్లాడిన నరేంద్ర మోదీ.. అనంతరకాలంలో ఆమెకు దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌లోనూ భార్య గురించిన వివరాలేవీ ఆయన పొందపర్చలేదు. దీనిపై విపక్షాలు ఆందోళన చేయడంతో మోదీ వైవాహిక బంధంపై బీజేపీ నాయకులు కొన్ని ప్రకటనలు చేసిన విషయం విదితమే.
డాక్టర్ సుశీల(ఫేస్‌బుక్ నుంచి తీసుకున్న ఫొటో)
Comments
Please login to add a commentAdd a comment