Mobile Handsets Market
-
99.2 శాతం దేశంలో తయారైన మొబైళ్లే!
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ఇండియాలో ఉపయోగించే మొబైల్ హ్యాండ్ సెట్లలో 99.2% దేశీయంగా తయారైనవేనని పేర్కొన్నారు. 2014లో భారత్‌లో విక్రయించిన మొబైల్ ఫోన్లలో 74 శాతం దిగుమతులపైనే ఆధారపడినట్లు చెప్పారు. గడిచిన పదేళ్లలో ఈ రంగం భారీగా వృద్ధి చెందినట్లు వివరించారు.తయారీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్) వంటి వివిధ కార్యక్రమాలు ఇందుకు ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ రూ.1,90,366 కోట్లుగా ఉంటే అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు. ఇది 17% కంటే ఎక్కువ సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను సూచిస్తుంది. దాంతో పదేళ్ల కాలంలో మొబైల్ ఫోన్ల ప్రధాన దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా దేశం ఎదిగిందన్నారు.ఇదీ చదవండి: యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!ఎలక్ట్రానిక్స్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని ప్రసాద పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కోసం రూ.76,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. దేశంలో సెమీకండక్టర్, డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పునరుద్ఘాటించారు. -
భారత్‌లో ఈ ఏడాది 25 కోట్ల మొబైల్స్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 శాతం వృద్ధితో 25 కోట్ల యూనిట్లకు చేరుతుందని సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ తెలిపింది. రూ.5,000 ధరకు దిగువన ఉండే హ్యాండ్సెట్స్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 2014తో పోలిస్తే గతేడాది స్మార్ట్‌ఫోన్ విభాగం 32 శాతం వార్షిక సగటు వృద్ధిరేటుతో 7.7 కోట్ల యూనిట్ల నుంచి 9.5 కోట్ల యూనిట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది 4జీ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు 5 కోట్ల యూనిట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఫీచర్ ఫోన్ మార్కెట్ విషయానికి వస్తే 2014లో 18 కోట్ల యూనిట్లుగా ఉన్న ఫీచర్ ఫోన్స్ విక్రయాలు గతేడాదిలో 17 శాతం క్షీణతతో 14.4 కోట్ల యూనిట్లకు తగ్గాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది కొనసాగే అవకాశం ఉంది. కంపెనీలు గతేడాది రూ. 10,000 ధర శ్రేణిలోని మొబైల్ హ్యాండ్‌సెట్స్‌కు ప్రాధాన్యమిచ్చాయని, కానీ ప్రస్తుతం రూ.5,000 ధరకు దిగువన ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. -
30 కోట్ల యూనిట్లకు హ్యాండ్సెట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ 30 కోట్ల యూనిట్లకు చేరుతుందని ఫిక్కి-ఈవై సర్వేలో వెల్లడైంది. ఫిక్కి-ఈవై ‘స్పీడింగ్ ఎహెడ్ ఆన్ ద టెలికం, డిజిటల్ ఎకానమి హైవే’ అనే పేరుతో ఓ సర్వేను నిర్వహించింది. సర్వే వివరాలు... ఈ ఏడాది దేశీ తయారీ ఫోన్ల సంఖ్య 4.6 కోట్ల మాత్రమే వుంటుందని అంచనా. 30 కోట్ల యూనిట్ల మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి దేశీయంగా ఫోన్ల తయారీ బాగా పెరగాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. వియత్నాంలాగా ఫోన్ల తయారీకి అంతర్జాతీయ కేంద్రంలా అవతరించాలంటే అన్ని దేశాలు ట్యాబ్లెట్ల, ఫోన్ల తయారీకి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను అందించటంతోపాటు సుస్థిరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. భారత్‌లో మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని నమోదుచేస్తే దానిలో అధిక వాటా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫోన్లకే దక్కుతుంది. ఎందుకంటే దేశీయంగా ఫోన్ల తయారీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు కాబట్టి. దే శీయంగా ఫోన్ల తయారీ పెరిగితే దిగుమతులు తగ్గి, దాని వల్ల విదేశీ మారక నిల్వలు పెరిగి, చివరకు దాని ప్రభావంతో ఉద్యోగ కల్పన, స్థానిక స్థితిగతుల వృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019 నాటికి 50 కోట్ల ఫోన్ల తయారీని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం విదితమే.