Telangana: ఆ కవుల గురించి మీకు తెలుసా?
'ఎంతో మంది చనిపోతున్నారు అందులో కొద్ది మంది మాత్రమే తమలోని అధ్బుతమైన ఆలోచనలు ఈ లోకానికి పంచిపోతున్నారు ' అంటాడు టాడ్ హెన్రీ (Die Empty )
తమ వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టనష్టాలైనా భరించి అలా సమాధిలోకి వెళ్ళడానికి ముందే రచనల ద్వారా తమలోని ప్రతిభా ఉత్పత్తులను పంచిపోయిన కవులు రచయితలు తెలంగాణలో ఎందరో ఉన్నారు.
వేల సంవత్సరాలు గడిచినా ప్రజల్లో ఈనాటికీ ఆ సాహిత్యం నిలిచివున్నా వారి జ్ఞాపకాలే చెదిరిపోతున్నాయి,వారి సమాధులు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కన్నడ ఆదికవి అనిపించుకున్న పంప ( 902-975 AD) అంతటి కవి సమాధి నిజామాబాదు బోధన్‌లో నామమాత్రంగా మిగిలిపోయింది.
తెలుగు ఆదికవి అంటున్న నన్నయ కాలానికే చెందినవాడుగా, కరీంనగర్ వేములవాడ ప్రాంతీయుడుగా భావిస్తున్న చాటుపద్య కవి వేములవాడ భీమకవికి అక్కడ చిన్న స్మారకం కూడా పెట్టకుండా చాటుకే ఉంచేసారు. కాకతీయుల కాలంనాటి శాసనకవి నగునూరు పాలకుడు ఎన్నో దేవాలయాలు నిర్మించిన వెల్లంకి గంగాధరుడిని పట్టించుకున్న వారే లేరు.
తెలుగులో తొలి వచన కావ్యకర్త, వచన సంకీర్తనా వాంజ్ఞయానికి మూలపురుషుడు అనిపించుకున్న సింహగిరి వచనాల కృష్ణమాచార్య సంతూరు తెలంగాణ వాడే అయినా ఆయన పేరిట ఏదీ ఎక్కడా లేదు. మహా పండితుడు,సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి ప్రసిద్ధుడైన కోలాచలం మల్లినాధ సూరి (14వ శతాబ్దం) మెదక్ జిల్లా కొలిచెలమ /కొల్చారం వాడే అయినా ఆయనను తలుచుకునే పని ప్రభుత్వం చేసింది లేదు.
భాగవతకర్త పోతన అంతటి మహానుభావుడికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో బమ్మెరలో తలపెట్టిన 'పోతన స్మృతివనం' రూపురేఖలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఇటీవల ఆ గ్రామానికి వెళ్ళివచ్చిన సాహితీ మిత్రుడు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు వాపోయారు.
తుమ్మూరి స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఎలగందులకు చెందిన పూర్వకవి, పోతనామాత్యుని శిష్యుడు, భాగవతంలోని ఏకాదశ ద్వాదశ స్కందాలను రచించిన వెలిగందుల నారయకవి స్మారకం వంటిదేదీ ఆ గ్రామంలో ఈనాటికీ లేదని వారు చెబుతుంటే అశ్చర్యం వేసింది.
ప్రతియేటా మాతృభాషా దినోత్సవాలు మొక్కుబడిగా జరపడం కాదు ఆ భాషను నిలబెట్టడానికి తమ ప్రాణాలను దారపోసిన కవులు రచయితలను తలుచుకోవడం అవసరం.
-వేముల ప్రభాకర్, అమెరికా నుంచి