Municipal Workers Union
-
AP: మున్సిపల్ కార్మికులపై కేసులు ఎత్తివేత
సాక్షి, అమరావతి: సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు డీజీపీకి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు. ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ తెలిపింది. -
మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు.. సంతోషంలో ఏపీ మున్సిపల్ కార్మికులు
-
నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు
సాక్షి, అమరావతి: పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు గురువారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన చర్చల్లో అన్ స్కిల్డ్, స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం మరోసారి సచివాలయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా రూ.30 లక్షలు పరిహారం చెల్లింపు, సరండర్ లీవ్ బిల్లులు విడుదల, రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపు, పారిశుద్ధ్య కార్మికులు కానివారి కేటగిరీల మార్పు విషయంలో ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటామని గతంలోనే మంత్రుల బృందం హామీ ఇచ్చింది. అలాగే గతంలో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపును కూడా అంగీకరించింది. కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలు వేతనం, రూ.6 వేల అలవెన్సు మొత్తం రూ.21 వేలను ఒకేసారి వేతనంగా ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అండర్ గ్రౌండ్ గ్రైనేజీ కార్మికులు, డ్రైవర్లకు 18,500 వేతనం, రూ.6 వేలు అలవెన్సులు కలిపి రూ.24,500 ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు సమ్మె కాలానికి కూడా కార్మికుల వేతనాలను చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్మికులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్టు ప్రకటించారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కొనుగోలుకు రూ.1,000 ఇస్తామన్నారు. 2019 నుంచి మరణించిన కార్మికుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా పొందేందుకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని, గురువారం సాయంత్రానికి మినిట్స్ ఇస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. గురువారం నుంచి కార్మికులు విధుల్లోకి వస్తారన్నారు. జీవో వచ్చాక సమ్మెను విరమిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనందరావు, వై.వి.రమణ (వైఎస్సార్టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), పి.సుబ్బారాయుడు (ఏఐటీయూసీ), అబ్రహం లింకన్ (ఐఎఫ్టీయూ), జి.ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు, శ్యామ్ (టీఎన్టీయూసీ), మధుబాబు, ఆంజనేయులు (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ) పాల్గొన్నారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చర్చల అనంతరం రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తి మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీల్లో) పని చేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల విధుల స్వభావాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ కమిషనర్లు, సీడీఎంఏ అధికారులు, యూడీఏల వైస్ చైర్మన్లతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఆయా విభాగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది విధులు, అందిస్తున్న వేతనాలపై అధ్యయనం చేసి ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. -
సమ్మె విరమించండి.. సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్మికులు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కార్మికులు సమ్మె విరమిస్తే పది రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నుంచి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు వి.రవి కుమార్ (వైఎస్సార్టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), కె. ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు (టీఎన్టీయూసీ), బాబా ఫకృద్దీన్ (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ), ఆర్.సత్యం (జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్), ఇ.మధుబాబు (ఏపీ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్) హాజరయ్యారు. చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి పది రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. ఆ హామీలు ఇవీ.. ♦ సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు ఆదేశానుసారం రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని కార్మికులు కోరారు. సుప్రీం తీర్పును అమలు చేస్తాం. ♦ సరండర్ లీవ్ బిల్లులు విడుదల చేస్తాం ♦ రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపులు చేస్తాం ♦ పారిశుద్ధ్య కార్మికులు కాని వారి కేటగిరీల మార్పుపై ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటాం ♦ గతంలో చనిపోయిన కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడానికి అంగీకారం ♦ కోవిడ్ మరణాల ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరోసారి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తాం ♦ కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి వేతనం, అలవెన్స్ కలిపి రూ.21 వేల వేతనాన్ని ఒకేసారి అందిస్తాం. ప్రస్తుతం ఇస్తున్న 15 వేలు, రూ.6 అలవెన్స్ స్థానంలో మొత్తం కలిపి జీతంగా పరిగణించాలని కార్మికులు కోరారు. అందుకు అంగీకరించాం. ♦ వాటర్ సప్లైలో పని చేస్తున్న నైపుణ్యం గల పొరుగు సేవల కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ నిచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం ♦ మరణించిన పొరుగు సేవల కార్మికుల దహన సంస్కారాలకు ఇస్తున్న ఖర్చులను పెంచుతాం ♦ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల కేటగిరీ సమస్యలను అన్నింటినీ పది రోజుల్లో పరిష్కరిస్తాం. ♦ పొరుగు సేవల నుంచి రిటైర్ అయిన కార్మికులకు రూ.50 వేలు ఇస్తాం. అయితే, వారు సర్వీసును కనీసం 10 ఏళ్లు పూర్తి చేయాలి. ఆపై సర్విసు పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.2 వేల చొప్పున అదనంగా చెల్లిస్తాం ♦ అన్ స్కిల్డ్ వర్కర్లకు కూడా స్కిల్డ్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అన్ స్కిల్డ్ వర్కర్లు కూడా చదువుకుని ఐటీఐ వంటి స్కిల్ సర్టిఫికెట్ సాధిస్తే వారికీ స్కిల్డ్ వేతనం అందిస్తాం. ఇందుకోసం వారికి చదువుకునే అవకాశం కూడా కల్పిస్తాం. -
మున్సిపల్ సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుధ్య కార్మికుల సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసుకొనేందుకు అంగీకారం తెలిపాయి. మంగళవారం మంత్రుల బృందంతో చర్చల అనంతరం సీఐటీయూ మినహా మిగతా కార్మిక సంఘాలు బుధవారం నుంచి చేపట్టనున్న సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన కేటగిరీల వారీగా బేసిక్ పే నిర్ణయం, పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధికరించడం తదితర అంశాలపై చర్చించారు. అవుట్ సోర్సింగ్‌పై పనిచేసే పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరానికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఘన వ్యర్థాల తరలింపునకు కాంట్రాక్టు విధానంలో తీసుకున్న వాహనాల పనితీరును మెరగుపరచాలని, పారిశుద్ద్య కార్మికులు, ఇంజినీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు పనుల ఆధారంగా వారికి బేసిక్ పే పైనా సమావేశంలో చర్చించారు. కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రులు చెప్పారు. సంక్రాంతి ముందు లేదా తర్వాత ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు సమ్మెను వాయిదా వేయాలని మంత్రులు కోరారు. ప్రస్తుతం సీఐటీయూ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. మిగిలిన సంఘాలు బుధవారం నుంచి సమ్మెకు దిగాలని మొదట నిర్ణయించాయి. మంత్రుల విజ్ఞప్తి మేరకు సీఐటీయూ మినహా మిగిలిన సంఘాల నేతలు సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు. ఈ చర్చల్లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండీ వాసుదేవరావు తదితర అధికారులు, రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నేతలు ఆనందరావు, రమణ (వైఎస్సార్టీయూసీ), రంగనాయకులు, పి.సుబ్బారాయుడు (ఏఐటీయూసీ), అబ్రహం లింకన్ (ఐఎఫ్టీయూ), జి.ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు, శ్యామ్ (టీఎన్టీయూసీ), మధుబాబు, ఆంజనేయులు (ఏపీ ఎంఈడబ్లు్యయూ), వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ) పాల్గొన్నారు. చాలా సమస్యలు పరిష్కరించాం: మంత్రి సురేష్ అనంతరం మంత్రి సురేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లలో చాలా పరిష్కరించామని, మిగతా వాటిపైనా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు, పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు నెలకు రూ.6 వేలు చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మరికొన్ని డిమాండ్లపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్ల కేటగిరీల్లో కొన్ని తప్పులు జరిగాయని, వాటినీ పరిష్కరిస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లింపుపైనా సానుకూలనిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
దారుణ పరిస్ధితిలో మున్సిపల్ సిబ్బంది
-
బాలయ్య ఇంటి వద్ద దబిడి.. దిబిడి
హిందూపురం అర్బన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వం కార్మికులు పొట్ట కొడుతున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదంటూ ఇంట్లోకి దూసుకెళ్లి చెత్తాచెదారాన్ని, మురుగును అక్కడ పడేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ 279 తమ భవిష్యత్తును కాలరాస్తోందని, పాలకులు తమ నోటికాడ కూడు లాగేసి కాంట్రాక్టర్లకు వడ్డించాలని చూస్తున్నారని నాలుగు రోజులుగా వారు మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. పైగా మున్సిపల్ అధికారులు దీక్షలు చేస్తున్న 220 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో పారిశుద్ధ్య కార్మికుల కడుపు రగిలిపోయింది. ఈ నేపథ్యంలో వారు సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామునే తరలివెళ్లి బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. గేటు ముందు నిల్చుని నినాదాలు చేసినా ఎమ్మెల్యే పీఏ వీరయ్య, కో–ఆర్డినేటర్ శ్రీనివాసరావు బయటకు రాలేదు. దీంతో వెంట తీసుకొచ్చిన చెత్తసంచులను ఇంట్లో పారబోశారు. ఇంతలో విషయం తెలుసుకున్న సీఐలు చిన్నగోవిందు, తమీంఅహ్మద్ సిబ్బందితో తరలివచ్చి వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కార్మికులను ఈడ్చి పడేశారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న జిల్లా నాయకులు వెంకటేష్, రాజప్ప, రాములను పోలీసులు అదుపులోకి తీసుకుని జీపులో స్టేషన్‌కు తరలించడానికి ప్రయత్నించారు. అయితే కార్మికులు తమపై నుంచి తీసుకెళ్లండి అంటూ జీపులను అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని లాగేసి నాయకులను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వాగ్వాదాలు, తోపులాటలతో అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. ఈ తోపులాటలో కార్మికురాలు నాగమ్మ ఛాతీకి బలమైన దెబ్బ తగలడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి పనిచేస్తుంటే అన్యాయంగా తొలగిస్తారా..? ఈ సందర్భంగా కార్మికులు, నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి రాత్రింబవళ్లూ పారిశుద్ధ్య పనులు చేస్తుంటే రెగ్యులర్ చేయలేదన్నారు. 279జీఓ తెచ్చి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయడానికి సిద్ధమైందంటూ టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో సుమారు 15రోజులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా లేని విధంగా హిందూపురం మున్సిపాల్టీలో మాత్రం ఆ జీఓను అమలు చేస్తున్నారని, జియో ట్యాగింగ్, ఇతర నిబంధనలు ప్రవేశపెడుతూ వేదనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అన్యాయమని నాలుగు రోజులుగా సమ్మె చేస్తుంటే 220 మంది కార్మికులను తొలగిస్తున్నామని చెప్పడం దుర్మార్గమన్నారు. వెంటనే జీఓ 279ను రద్దు చేసి, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఇంత దౌర్భగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఇటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. ఆయన హిందూపురం వస్తున్నాడంటే తాము రాత్రింబవళ్లూ పట్టణాన్ని శుభ్రం చేస్తున్నామని, కానీ ఆయన తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమపై కక్షగట్టి వ్యవహరిస్తోందని, పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని విచారం వెలిబుచ్చారు. రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో వినూత్నరీతిలో నిరసనలు తెలియజేస్తున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం మాటమాత్రానికైనా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం తమ దౌర్భగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 165 మంది కార్మికులు అరెస్టు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించడంతో వన్‌టౌన్ పోలీçసులు 166 మంది కార్మికులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారిపై 151 సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు చేశారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదలివేశారు. -
బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై పారిశుద్ధ్య కార్మికులు భగ్గుమన్నారు. 220 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడంతో ఆగ్రహించిన వారు బుధవారం బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. హిందూపురంలోని ఆయన నివాసంలోకి దూసుకెళ్లి మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. బాలకృష్ణ ఇంటిని కార్మికులు ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకొని ఈడ్చి పడేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
ముట్టడి.. కట్టడి
తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్న మున్సిపల్ కార్మికులపై ఖాకీలు క్రౌర్యం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా నిర్థాక్షిణ్యంగా ఈడ్చుకుపోయారు. కేవలం కార్మికులనే కాక వారికి మద్దతిచ్చిన వారిపై కూడా జులుం చూపించారు. జీవో నం. 279 రద్దు చేయాలని కోరుతూ రెండు వారాలుగా ఆందోళన చేపట్టిన మున్సిపల్ కార్మికులు మంగళవారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. కార్మిక సంఘ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి శివారు ప్రాంతాల పోలీస్స్టేషన్లకు తరలించారు. సాక్షి, అమరావతి బ్యూరో : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 13 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు మంగళవారం అన్ని సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్‌సెంటర్ నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికి కోసం చేపట్టిన ప్రదర్శనను నగర పోలీసులు అడ్డుకున్నారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించేలా ఉన్న జీవో 279 రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, తమ హక్కులను కాపాడేందుకు కార్మికుల చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటం ప్రజాస్వామ్య విలువలను నిలువరించటమేనని పలువురు కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వారాలుగా నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనురు గౌతం రెడ్డి, మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరావు, ఏఐటీమూసీ రాష్ట్ర నాయకులు ఆర్ రవీంద్రనా«థ్, పలువురు కార్మిక సంఘాల నిలిచారు. కార్మికుల ప్రదర్శనకు నేతలు మద్దతు ఇచ్చి పాల్గొనడంతో నగర పోలీసులు పలువురు నేతలను అరెస్ట్‌చేసి పమిడిముక్కల, తోట్లవల్లూరు, కంకిపాడు పెనమలూరు, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, ఉంగుటూరు పోలీస్స్టేషన్లకు తరలించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా గుడివాడ, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు తదితర ప్రాంతాల్లో ఆర్డీవో కార్యాలయాల ముట్టడిని పోలీసులు అడ్డుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. లెనిన్‌సెంటర్‌లో నాటకీయ పరిణామం మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటానికి పోలీసులు ఉక్కుపాదం మోపారు. కార్మికులను ఆందోళన చేపట్టే ప్రాంతానికి రాకుండా నలువైపులా అడ్డుకున్నారు. పోలీసుల చక్రవ్యూహాన్ని దాటుకుని లెనిన్‌సెంటర్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన నేతలు, కార్మికులు ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై నినాదాలు చేస్తున్న సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా అరెస్ట్ చేయటం ఉద్రిక్తలకు దారితీసింది. ఈ సందర్భంలో భారీ స్థాయిలో మోహరించిన పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాటలు జరిగాయి. కలెక్టరేట్ ముట్టడికి విఫలయత్నం చిలకలపూడి(మచిలీపట్నం): గత కొద్ది రోజులుగా సమ్మె నిర్వహించి పోరాటం చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిరసన గళాన్ని విప్పారు. కలెక్టరేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులకు, వివిధ పక్షాల నాయకులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నాయకులను, కార్మికులను పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకువెళ్లి పోలీస్వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. కార్మికులకు సంతృప్తి అక్కర్లేదా రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉండాలని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పాలకులు ఫోన్లు చేసి తెలుసుకునే క్రమంలో మున్సిపల్ కార్మికుల ఆకలి కేకలు పాలకులకు వినిపించటం లేదా, కార్మికుల సంతృప్తి పాలకులకు అక్కర్లేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. నరసింహారావు మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికుల పోరాటంలో సమస్యను పరిష్కరించకుండా పాలకులు మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి రవి మాట్లాడుతూ జీవో 279 ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని చెబుతున్న పాలకులు ఇంత వరకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, మత్స్యకార్మిక సంఘం నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, కేవీపీఎస్ నాయకులు దాసరి సాల్మన్‌రాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్, కె. సుజాత, గోపి, ఏఐటీయుసీ నాయకులు కరపాటి సత్యనారాయణ, లింగం ఫిలిప్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పల్లి శేఖర్, మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు షేక్ అచ్చెబా పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి కంకిపాడు(పెనమలూరు): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులను అరెస్టు చేసి మంగళవారం కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి. సత్యబాబు, ఎం. బాబూరావు పాల్గొన్నారు. సమ్మె విరమణ.. సాయంత్రం అధికారులతో జరిగిన చర్చల అనంతరం మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి తోట్లవల్లూరు: మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు మంగళవారం విజయవాడలో అదుపులోకి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ కార్మికుల సమ్మెతో పట్టణాలు మురికికూపాలుగా మారుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. నేతల సంఘీభావం.. తోట్లవల్లూరు స్టేషన్లో పోలీసు నిర్బంధంలో ఉన్న గౌతంరెడ్డి, బాబూరావు, కార్మిక సంఘాల నాయకులను వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గం సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్ పరామర్శించి సంఘీబావం తెలిపారు. ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మోర్ల రామచంద్రరావు, వైస్ ఎంపీపీ పీఎస్ కోటేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు గొరిపర్తి సూర్యనారాయణ, మండల పార్టీ కార్యదర్శి కిలారం రామకృష్ణ పరామర్శించిన వారిలో ఉన్నారు. -
మంత్రి ఇంటి ముట్టడికి యత్నం
ఒంగోలు టౌన్: జీఓ నెం 279 రద్దుచేసి, ఆర్టీఎంఎస్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ మునిసిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరుకొంది. సమ్మెలో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ఇంటిని ముట్టడించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కార్మికులు, నాయకులు ప్రదర్శనగా బయలుదేరి మంగమూరురోడ్డులోని మంత్రి ఇంటిని ముట్టడించేందుకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో రోడ్డు మొదట్లోనే ఆందోళనకారులను అడ్డుకున్నారు. తాము లోపలికి వెళతామంటూ ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రిని కలిసేందుకు ముఖ్య నాయకులకు అనుమతి ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్ వద్దకు చేరుకొన్నారు. అక్కడే కలెక్టర్ వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ఉన్నారు. వారి సమక్షంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు మునిసిపల్ కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ కార్మికుల ఉనికికి గొడ్డలి పెట్టు అయిన జీఓ నెం 279ని ప్రభ్వుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంటే, ఆర్టీఎంఎస్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. జేఏసీ నాయకుడు శ్రీరాం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు అంకితభావంతో విధులు నిర్వర్తించడం వల్లనే రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని గుర్తెరగని నగర పాలక సంస్థ కమీషనర్ కార్మికులను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోకి పారిశుధ్య కార్మికులు ప్రవేశించకుండా ఉండాలన్న ఉద్ధేశంతో గేట్లకు తాళాలు వేయించడం సరికాదన్నారు. కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నాయకుడు ఎస్డీ సర్ధార్ మాట్లాడుతూ జీఓ నెం 279 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతన సవరణ చేయాలన్నారు. మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తంబి శ్రీనివాసులు, టి.మహేష్, కె.శ్రీనివాసరావు, యూ రత్నకుమారి పాల్గొన్నారు. 14 మందిపై కేసు నమోదు ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ సంకురాత్రి వెంకట కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 4వ తేదీ నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎక్కువమంది సమ్మె చేస్తున్నారు. కొందరు మాత్రం విధులకు హాజరవుతున్నారు. శనివారం కార్మికులు చేస్తున్న పనికి ఆటంకం కలిగించడంతోపాటు శానిటరీ ఇన్స్పెక్టర్ల విధులకు కోర్నిపాటి శ్రీనివాసరావు, కొల్లాబత్తిన గోపి, ఊదరగుడి సామ్రాజ్యం, కాకర్లమూడి సామ్రాజ్యం, తంబి శ్రీనివాసులు(సీఐటీయూ), ఊరగాయల నాగరాజు, రంపతోటి శ్రీనివాసరావు, కోర్నెపాటి రవికుమార్, కోర్నెపాటి బాలకృష్ణ, తేళ్ల విజయ, బందెళ సుబ్బారావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, పిల్లి శారద, బండ్ల ఏడుకొండలు అనే వారు ఆటంకం కలిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. -
ఏం తినాలి.. ఎలా బతకాలి..!
కార్పొరేషన్ వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన విజయవాడ సెంట్రల్ : ‘జీతాలొచ్చి మూడు నెలలైంది... ఇల్లు అద్దెకు ఇచ్చివారు ఖాళీచేసి పొమ్మంటున్నారు.. ఆటో చార్జీలకూ అప్పు చేయాల్సి వస్తోంది.. ఇలా అయితే ఏం తినాలి? ఎలా బతకాలి?’ అంటూ పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. నగరపాలక సంస్థ ప్రధానకార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం వేర్వేరుగా ధర్నా చేశారు. డిసెంబర్ నుంచి పెండిం గ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మెరుపుసమ్మెకు దిగుతామని అల్టిమేటం ఇచ్చారు. ఈ సందర్భంగా మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ నాయకుడు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ అధికారులు చేసిన తప్పులకు కార్మికుల జీతాలను పెండింగ్ పెట్టడం సరికాదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ కింద కార్మికులు జీతాల నుంచి నగదు మినహాయిస్తున్న అధికారులు ఆయా సంస్థలకు ఎందుకు జమ చేయడంలేదో వెల్లడించాలని డిమాండ్‌చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న నగరపాలక సంస్థ అధికారు లపై త్వరలో లోకాయుక్తాను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఏడు రోజులు విధులకు హాజ రుకాకుంటే కార్మికులను విధుల నుంచి తొల గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో వచ్చిందని అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్.బాబూరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని అధికారులు, పాలకులు విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న పాలకులకు సకాలంలో జీతాలు చెల్లించాలనే విషయం తెలవకపోవడం దురదృష్టకరమన్నారు. కమిషనర్ స్పందించి సమస్యను పరి ష్కరించాలని కోరారు. ఏఐటీయూసీ, సీఐ టీయూ నాయకులు జె.జేమ్స్, సాంబశివరావు, పద్మ, ఎం.డేవిడ్, ఎ.లక్ష్మి పాల్గొన్నారు.