సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్మికులు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కార్మికులు సమ్మె విరమిస్తే పది రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల నుంచి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు వి.రవి కుమార్ (వైఎస్సార్‌టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), కె. ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు (టీఎన్‌టీయూసీ), బాబా ఫకృద్దీన్ (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ), ఆర్.సత్యం (జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్), ఇ.మధుబాబు (ఏపీ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్) హాజరయ్యారు.
చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి పది రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. ఆ హామీలు ఇవీ..
♦ సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు ఆదేశానుసారం రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని కార్మికులు కోరారు. సుప్రీం తీర్పును అమలు చేస్తాం.
♦ సరండర్ లీవ్ బిల్లులు విడుదల చేస్తాం
♦ రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపులు చేస్తాం
♦ పారిశుద్ధ్య కార్మికులు కాని వారి కేటగిరీల మార్పుపై ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటాం
♦ గతంలో చనిపోయిన కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడానికి అంగీకారం
♦ కోవిడ్ మరణాల ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరోసారి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తాం
♦ కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి వేతనం, అలవెన్స్ కలిపి రూ.21 వేల వేతనాన్ని ఒకేసారి అందిస్తాం. ప్రస్తుతం ఇస్తున్న 15 వేలు, రూ.6 అలవెన్స్ స్థానంలో మొత్తం కలిపి జీతంగా పరిగణించాలని కార్మికులు కోరారు. అందుకు అంగీకరించాం.
♦ వాటర్ సప్లైలో పని చేస్తున్న నైపుణ్యం గల పొరుగు సేవల కార్మికులకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ నిచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం
♦ మరణించిన పొరుగు సేవల కార్మికుల దహన సంస్కారాలకు ఇస్తున్న ఖర్చులను పెంచుతాం
♦ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల కేటగిరీ సమస్యలను అన్నింటినీ పది రోజుల్లో పరిష్కరిస్తాం.
♦ పొరుగు సేవల నుంచి రిటైర్ అయిన కార్మికులకు రూ.50 వేలు ఇస్తాం. అయితే, వారు సర్వీసును కనీసం 10 ఏళ్లు పూర్తి చేయాలి. ఆపై సర్విసు పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.2 వేల చొప్పున అదనంగా చెల్లిస్తాం
♦ అన్ స్కిల్డ్ వర్కర్లకు కూడా స్కిల్డ్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అన్ స్కిల్డ్ వర్కర్లు కూడా చదువుకుని ఐటీఐ వంటి స్కిల్ సర్టిఫికెట్ సాధిస్తే వారికీ స్కిల్డ్ వేతనం అందిస్తాం. ఇందుకోసం వారికి చదువుకునే అవకాశం కూడా కల్పిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment