మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో చర్చిస్తున్న మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల తదితరులు
సాక్షి, అమరావతి: పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు గురువారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన చర్చల్లో అన్ స్కిల్డ్, స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం మరోసారి సచివాలయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు.
సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా రూ.30 లక్షలు పరిహారం చెల్లింపు, సరండర్ లీవ్ బిల్లులు విడుదల, రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపు, పారిశుద్ధ్య కార్మికులు కానివారి కేటగిరీల మార్పు విషయంలో ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటామని గతంలోనే మంత్రుల బృందం హామీ ఇచ్చింది. అలాగే గతంలో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపును కూడా అంగీకరించింది. కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలు వేతనం, రూ.6 వేల అలవెన్సు మొత్తం రూ.21 వేలను ఒకేసారి వేతనంగా ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అండర్ గ్రౌండ్ గ్రైనేజీ కార్మికులు, డ్రైవర్లకు 18,500 వేతనం, రూ.6 వేలు అలవెన్సులు కలిపి రూ.24,500 ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు సమ్మె కాలానికి కూడా కార్మికుల వేతనాలను చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్మికులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్టు ప్రకటించారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కొనుగోలుకు రూ.1,000 ఇస్తామన్నారు. 2019 నుంచి మరణించిన కార్మికుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా పొందేందుకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని, గురువారం సాయంత్రానికి మినిట్స్ ఇస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. గురువారం నుంచి కార్మికులు విధుల్లోకి వస్తారన్నారు. జీవో వచ్చాక సమ్మెను విరమిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనందరావు, వై.వి.రమణ (వైఎస్సార్‌టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), పి.సుబ్బారాయుడు (ఏఐటీయూసీ), అబ్రహం లింకన్ (ఐఎఫ్‌టీయూ), జి.ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు, శ్యామ్ (టీఎన్‌టీయూసీ), మధుబాబు, ఆంజనేయులు (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ) పాల్గొన్నారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు
చర్చల అనంతరం రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తి మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీల్లో) పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ కార్మికుల విధుల స్వభావాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ కమిషనర్లు, సీడీఎంఏ అధికారులు, యూడీఏల వైస్ చైర్మన్లతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఆయా విభాగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది విధులు, అందిస్తున్న వేతనాలపై అధ్యయనం చేసి ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment