Nanapaneni rajakumari
-
జీఎస్టీ మహిళా ఉద్యోగులపై వేధింపులు
సాక్షి, విజయనగరం : జిల్లాలోని జీఎస్టీ కార్యాలయ ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారంటూ ముగ్గురు మహిళా ఉద్యోగులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారికి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆమె జీఎస్టీ కార్యాలయానికి వచ్చి విచారించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేస్తున్నారని, అడిగితే వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగినీలు వాపోయారు. లైంగింక వేధింపులపై మహిళా ఉద్యోగులను ఆరా తీయగా.. క్లోజ్డ్ గదితో చెబుతామని పేర్కొన్నారు. ఏకాంత గదిలోకి వెళ్లి మహిళా ఉద్యోగులను విచారించారు. అనంతరం నన్నపనేని మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగపరంగా మాత్రమే వేధింపులు ఉన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. మహిళా అధికారులకు హైవేపై నైట్ డ్యూటీలు వేయకూడదని, కానీ ఇక్కడి జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ నైట్ డ్యూటీలు వేస్తున్నారని మండిపడ్డారు. విచారణకు వస్తున్నానని తెలిసినా.. జాయింట్ కమిషనర్ అందుబాటులో లేడన్నారు. ముగ్గురు మహిళా అధికారులకు నైటీ డ్యూటీలు, సండే డ్యూటీలు వేయకూడదని ఆదేశాలు జారీ చేసున్నానని నన్నపనేని పేర్కొన్నారు. -
‘సినిమాల్లో మితిమీరుతున్న అశ్లీలం’
సాక్షి, అమరావతి : సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు మితిమీరుతున్నాయని ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ అన్నారు. పశ్చిమ గోదావరిలోని ఏలూరులో శుక్రవారం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా కుమారి మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్‌లో మహిళలను చాలా దారుణమైన క్యారెక్టర్లుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. టీవీ సీరియల్స్ నుంచి అశ్లీల సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రతి విషయంలో సామాజిక బాధ్యత వహించాలని, శాంతి భద్రతల కొరకు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలందరూ చట్టాలపై అవగహన పెంచుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్లో ఎంపీ గల్లా జయదేవ్ అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లే మహిళలకు అవగాహన కల్పించి స్థానికంగా ఉపాధి పొందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో నన్నపనేని అల్లుడికి గాయాలు
హైదరాబాద్: కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అల్లుడు, వైఎస్సార్సీపీ నేత సుధ భర్త లతీష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లతీష్‌రెడ్డి డ్రైవర్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు జైలో కారులో వస్తున్నారు. సోమవారం ఉదయం వేగంగా వచ్చిన కారు కొత్తగూడెం వద్ద వంతెనపై అదుపుతప్పి పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న లతీష్‌రెడ్డి కాలికి, తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అమీర్‌పేటలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. -
'ఎవరి బతుకు వారిని బతకనీయండి'
హైదరాబాద్: యువ నటుడు ఉదయ్ కిరణ్ మరణంపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. ఉదయ కిరణ్ ఎలా మరణించాడనేది బాహ్య ప్రపంచానికి తెలియాలని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో ఉదయ్ కిరణ్ భౌతిక కాయానికి ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వశక్తితో పైకొచ్చిన కుర్రాడి జీవితం ఇలా ముగియం బాధాకరమని పేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ మరణం కలచివేసిందదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు వర్థమాన నటులను అగణదొక్కడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరి బతుకు వారిని బతకనీయండి అంటూ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరుకున్నారు. -
మండలి ఆవరణలో తోపులాట
=విభజన బిల్లు ప్రతి చింపివేతతో =టీఆర్ఎస్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం =తోపులాటలో కిందపడ్డ నన్నపనేని =మండలి చైర్మన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఆవరణలో రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను చింపివేసిన ఘటన ఎమ్మెల్సీల మధ్య తోపులాటకు దారితీసింది. మండలి మీడియా పాయింట్లో టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌లు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగి ఒకరినొకరు నెట్టేసుకున్నారు. వీరి తోపులాటతో వారి పక్కనే ఉన్న ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. తెలంగాణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టి మరుసటి రోజుకు సభ వాయిదా పడిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నారుు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ అభిమాన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మీడియా పాయింట్‌కు వచ్చి.. ఇప్పుడే కాదు, బిల్లుపై ఎప్పుడు మండలిలో చర్చకు వచ్చినా తమ పార్టీ దానిని అడ్డుకుంటుందన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, దిలీప్‌కుమార్ విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు. తరువాత టీడీపీ ఎమ్మెల్సీలు నన్నపనేని, శమంతకమణి, సతీష్‌రెడ్డి, రామ్మోహన్రావు అక్కడికి వచ్చి విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ బిల్లును ఈ సభలో ప్రవేశపెట్టడానికే అర్హత లేదంటూ సతీష్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో స్వామిగౌడ్ వారి వెనుకకు వచ్చి ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, మహమూద్ అలీలు ఆయనకు జత కలిశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు సైతం లేచినిలబడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సతీష్‌రెడ్డి ముసాయిదా బిల్లు పత్రులను చింపే ప్రయత్నం చేయగా, పక్కనే ఉన్న స్వామిగౌడ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ దాదాపు కలబడినంత పనిచేశారు. పోలీసులు, ఇతర ఎమ్మెల్సీలు వారిని బలవంతంగా నిలువరించారు. ఈ తోపులాట సందర్భంగానే సతీష్‌రెడ్డి వెనుక నిలబడి ఉన్న నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. ఆమె చేతికి ఉన్న గాజులు పగిలి గుచ్చుకున్నాయి. ఆ తరువాత కూడా నన్నపనేని, స్వామిగౌడ్‌లతో పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలూ విలేకరుల సమావేశాల కోసం ఏర్పాటు చేసిన బల్లలను ఎక్కి పోటాపోటీగా నినాదాలు చేశారు. చైర్మన్‌కు ఫిర్యాదు.. స్వామిగౌడ్ పశ్చాత్తాపం ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అదే సమయంలో చైర్మన్‌కు తన వాదన వినిపించారు. అనంతరం స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి పంపిన బిల్లును వ్యతిరేకించడంగానీ, చింపడంగానీ సరికాదని సతీష్‌రెడ్డికి చెప్పానన్నారు. ఈ గొడవలోనే నన్నపనేని కిందపడ్డారంటున్నారని చెప్పారు. ఆ విషయం తనకు తెలియదని, ఆమె కాలుజారి పడిపోయి ఉండొచ్చునంటూ.. ఒకవేళ తన వల్ల, తన చెయ్యి తగలడం వల్ల పడిపోయారని ఆమె బాధపడుతుంటే మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. విభజన బిల్లు చింపి వేసినందుకు వారూ తమ పశ్చాత్తాపం ప్రకటించాలని కోరారు. బిల్లును చింపడం వల్ల అది అపవిత్రమైందంటూ కొందరు ఎమ్మెల్సీలు అనంతరం పూజలు నిర్వహించారు. ఇలావుండగా తెలంగాణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టినప్పుడు సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసిన సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి చెప్పారు. సహచర ఎమ్మెల్సీలతో కలిసి మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంగళవారం చైర్మన్‌ను కోరతామని తెలిపారు.