మండలి ఆవరణలో తోపులాట | TDP, TRS MLA's argue | Sakshi
Sakshi News home page

మండలి ఆవరణలో తోపులాట

Published Tue, Dec 17 2013 5:50 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

మండలి ఆవరణలో తోపులాట - Sakshi

మండలి ఆవరణలో తోపులాట

=విభజన బిల్లు ప్రతి చింపివేతతో
=టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం
=తోపులాటలో కిందపడ్డ నన్నపనేని
=మండలి చైర్మన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

 
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఆవరణలో రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను చింపివేసిన ఘటన ఎమ్మెల్సీల మధ్య తోపులాటకు దారితీసింది. మండలి మీడియా పాయింట్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌లు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగి ఒకరినొకరు నెట్టేసుకున్నారు. వీరి తోపులాటతో వారి పక్కనే ఉన్న ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. తెలంగాణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టి మరుసటి రోజుకు సభ వాయిదా పడిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నారుు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్‌సీపీ అభిమాన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మీడియా పాయింట్‌కు వచ్చి.. ఇప్పుడే కాదు, బిల్లుపై ఎప్పుడు మండలిలో చర్చకు వచ్చినా తమ పార్టీ దానిని అడ్డుకుంటుందన్నారు.

ఆ తర్వాత ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, దిలీప్‌కుమార్ విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు. తరువాత టీడీపీ ఎమ్మెల్సీలు నన్నపనేని, శమంతకమణి, సతీష్‌రెడ్డి, రామ్మోహన్‌రావు అక్కడికి వచ్చి విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ బిల్లును ఈ సభలో ప్రవేశపెట్టడానికే అర్హత లేదంటూ సతీష్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో స్వామిగౌడ్ వారి వెనుకకు వచ్చి ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, మహమూద్ అలీలు ఆయనకు జత కలిశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు సైతం లేచినిలబడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

సతీష్‌రెడ్డి ముసాయిదా బిల్లు పత్రులను చింపే ప్రయత్నం చేయగా, పక్కనే ఉన్న స్వామిగౌడ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ దాదాపు కలబడినంత పనిచేశారు. పోలీసులు, ఇతర ఎమ్మెల్సీలు వారిని బలవంతంగా నిలువరించారు. ఈ తోపులాట సందర్భంగానే సతీష్‌రెడ్డి వెనుక నిలబడి ఉన్న నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. ఆమె చేతికి ఉన్న గాజులు పగిలి గుచ్చుకున్నాయి. ఆ తరువాత కూడా నన్నపనేని, స్వామిగౌడ్‌లతో పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలూ విలేకరుల సమావేశాల కోసం ఏర్పాటు చేసిన బల్లలను ఎక్కి పోటాపోటీగా నినాదాలు చేశారు.
 
చైర్మన్‌కు ఫిర్యాదు.. స్వామిగౌడ్ పశ్చాత్తాపం


ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అదే సమయంలో చైర్మన్‌కు తన వాదన వినిపించారు. అనంతరం స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి పంపిన బిల్లును వ్యతిరేకించడంగానీ, చింపడంగానీ సరికాదని సతీష్‌రెడ్డికి చెప్పానన్నారు. ఈ గొడవలోనే నన్నపనేని కిందపడ్డారంటున్నారని చెప్పారు. ఆ విషయం తనకు తెలియదని, ఆమె కాలుజారి పడిపోయి ఉండొచ్చునంటూ.. ఒకవేళ తన వల్ల, తన చెయ్యి తగలడం వల్ల పడిపోయారని ఆమె బాధపడుతుంటే మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

విభజన బిల్లు చింపి వేసినందుకు వారూ తమ పశ్చాత్తాపం ప్రకటించాలని కోరారు. బిల్లును చింపడం వల్ల అది అపవిత్రమైందంటూ కొందరు ఎమ్మెల్సీలు అనంతరం పూజలు నిర్వహించారు. ఇలావుండగా తెలంగాణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టినప్పుడు సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసిన సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి చెప్పారు. సహచర ఎమ్మెల్సీలతో కలిసి మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంగళవారం చైర్మన్‌ను కోరతామని తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement