Natraj
-
మా నాన్నగారు గర్వపడాలి
‘‘తెలుగులో ‘ఊల్లాల ఊల్లాల’ నా తొలి చిత్రం. మా నాటక గ్రూప్ హైదరాబాద్‌లోనూ ప్రదర్శనలు ఇచ్చింది. రాక్లై¯Œ వెంకటేష్‌గారు కన్నడలో నిర్మించిన చిత్రంతో నా ప్రయాణం మొదలుపెట్టా’’ అన్నారు నటరాజ్. సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటరాజ్ హీరోగా ఏ.గురురాజ్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. నటరాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో దర్శకుడుగా మారాలని తాపత్రయపడే యువకుడి పాత్ర చేశా. డబ్బు కోసం ఎలాంటి అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలనుకునే మనస్తత్వం హీరోది. కొన్ని సంఘటనల వల్ల నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకుంటాడు. మా నాన్నగారికి (సత్యప్రకాష్) తెలుగులో మంచి పేరు ఉంది. ఆ పేరుకు ఇబ్బంది కలగకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. నటరాజ్ నా కొడుకు అని మా నాన్న సంతోషంగా, గర్వంగా చెప్పు కోవాలి.. అందుకోసం కష్టపడతాను. ఈ సినిమాకు డైరెక్టర్ మా నాన్నగారే అయినప్పటికీ సెట్లో యాక్టర్‌గానే ఫోకస్ పెట్టాను’’అన్నారు. -
రెండు లక్షలమందికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం
‘‘సినిమా ఇండస్ట్రీపై ఉన్న ప్రేమతో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తున్నాను. పెద్ద హీరోలు నటించినా కంటెంట్ సరిగా లేకపోతే ఆ చిత్రాలను ప్రేక్షకులు మెచ్చరు. అలాగే కథాబలం ఉన్న మంచి సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా వాటికి ప్రేక్షకాదరణ తప్పక ఉంటుంది’’ అన్నారు నిర్మాత ఏ. గురురాజ్. నటరాజ్, నూరిన్, అంకిత జంటగా సుఖీభవ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సీనియర్ నటుడు సత్యప్రకాష్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జనవరి 1న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా గురురాజ్ చెప్పిన విశేషాలు. ► మాది మధ్యతరగతి కుటుంబం. నటుణ్ణి కావాలని వచ్చాను. అప్పట్లో అవకాశం, అదృష్టం కలిసి రాలేదు. దాంతో సుఖీభవ ప్రాపర్టీస్‌ను స్థాపించి రియల్ఎస్టేట్ రంగంలో మంచి స్థాయికి ఎదిగాను. ఇంతకుముందు మా సుఖీభవ మూవీస్ సంస్థ నుంచి ‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రం నిర్మించా. కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ► సినిమాల్లో సత్యప్రకాష్ విలన్‌గా కనిపించినా బయట మాత్రం మంచి వ్యక్తి. ఓ సందర్భంలో స్టోరీ లైన్ ఉంది వింటావా? అని సత్యప్రకాష్ అన్నారు. ఆయన చెప్పిన లైన్ నచ్చింది. ఆ లైన్‌ని తీసుకుని ‘ఊల్లాల ఊల్లాల’ స్టోరీని మేమే రాశాం. నటుడు కావాలనుకున్న వ్యక్తి నిర్మాతగా మారినప్పుడు మెయిన్ క్యారెక్టర్‌గా తననే పెట్టుకుని సినిమా చేస్తాడు. కానీ నేను కథలో ఏ పాత్రకు సెట్ అవుతానో ఆ పాత్రను మాత్రమే ఈ సినిమాలో చేశాను. ► నిర్మాతగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పట్లో మాకు ఛాంబర్లో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో అవకాశాలు కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి. ప్రతిభ ఉన్నవారు పైకి వస్తున్నారు. మా ఆడియో ఫంక్షన్‌కు రామ్‌గోపాల్ వర్మగారు వచ్చారు. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తాను. రాజమౌళితో కూడా చేయవచ్చు. నాకు అందరితో సినిమాలు చేయాలని ఉంది. ► 100, 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు తీసే స్థాయికి ఏదో ఒక రోజు నేను వెళ్తాననే నమ్మకం ఉంది. దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం. ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే అది తప్పకుండా నేరవేరుతుంది. -
నన్ను సైకో సత్య అంటారు
‘‘ఇరవై ఐదేళ్ల క్రితం దర్శకుడిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ, దేవుడు నన్ను నట్టుణ్ణి చేశారు. ఇన్నేళ్లకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా వరుస ఆఫర్స్ వస్తాయనుకుంటున్నాను’’ అన్నారు నటుడు, దర్శకుడు సత్యప్రకాశ్. ఆయన తనయుడు నటరాజ్ హీరోగా సత్యప్రకాశ్ తెరకెక్కించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నూరిన్, అంకిత కథానాయికలు. సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ చెప్పిన విశేషాలు. ► డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి దగ్గర పని చేద్దాం అని వెళ్తే విలన్ పాత్ర చేయించారు. ఆ తర్వాత మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూడా నటించమని చెప్పారు. నా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే విటమిన్ యం (మనీ) బాగా అవసరం కావడంతో నటుడిగా కొనసాగాను. దాదాపు భారతీయ భాషలన్నింట్లో సుమారు 530 సినిమాలు చేశాను. ►నా పేరు సత్యప్రకాశ్ అయినా నేను చేసిన పాత్రల ద్వారా నన్ను ‘సైకో సత్య, శాడిస్ట్ సత్య’ అని పిలుస్తుంటారు. అచ్చ తెలుగువాణ్ని అయినా నన్ను కన్నడ ప్రాంతానికి చెందినవాడు అనుకుంటుంటారు. ►గురురాజ్, నేనూ ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు మా కథకు కొత్త కుర్రాడు కావాల్సి వచ్చింది. అలా మా అబ్బాయిని తీసుకున్నాం. వాడు ఆల్రెడీ కన్నడంలో ఓ సినిమా చేశాడు. మా అబ్బాయి నటరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫైట్స్, డ్యాన్స్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాడు. బయట తండ్రీకొడుకులం అయినా సెట్లో డైరెక్టర్, యాక్టర్స్లానే ఉంటాం. ►హారర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ఇది. మనుషులు దెయ్యాలుగా.. దెయ్యాలు మనుషులుగా మారే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఈ సినిమాలో భయం ఉండదు. నెక్ట్స్ ఏమవుతుంది? అనే సస్పెన్స్ ఉంటుంది. తరువాత ఏం జరగబోతోందని ప్రేక్షకులు ఊహించలేరు. అనుకు న్నదాని కంటే సినిమా బాగా వచ్చింది. నిర్మాత గురురాజ్ మంచి సహకారం అందించారు. ఈ సినిమాకు సగం దర్శకుడిలా ఉన్నారు. ఆయన ఓ మంచి పాత్రలో నటించారు. ►ప్రస్తుతం నా దగ్గర 14 కథలు ఉన్నాయి. అందులో 10 థ్రిల్లర్ జానర్‌కి సంబంధించినవే. ప్రస్తుతం థ్రిల్లర్ జానర్లో లేడీ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాను. -
రామ్.. రామ్.. హిట్
సీనియర్ నటుడు సత్య ప్రకాశ్ కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నూరిన్, అంకిత కథానాయికలు. ఎ. ముత్తమ్మ సమర్పణలో ఎ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు. ఈ చిత్రంలో ‘రామ్ రామ్..’ అనే పాటను పాడుతూ నటించటమే కాకుండా హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పారు గాయని, నటి మంగ్లీ. ఆమెతో పాటు కమెడియన్ రఘుబాబు, ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఈ పాటకు గొంతు కలిపారు. మంగ్లీ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు సత్యప్రకాశ్‌ను చిన్నప్పుడు విలన్‌గా చూసిన గుర్తుతో మొదట్లో భయపడ్డాను. తర్వాత ఆయన తెరవెనక స్వభావం, తెలుగుపై ఆయనకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాను. రచయిత కాసర్ల శ్యామ్ రాసి, నేను పాడిన పాటలన్నీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘మా చిత్రం జనవరి 1న విడుదలవుతుంది. ఈ మధ్య కాసర్ల శ్యామ్ రాసిన ‘అల.. వైకుంఠపురములో..’, ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలు పెద్ద హిట్. అలాగే మా సినిమాలోని ‘రామ్ రామ్..’ పాట కూడా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాకేం తెలుసో, తెలియదో అడక్కుండా ఈ సినిమాకి దర్శకత్వం చేసే చాన్స్ ఇచ్చిన మా నిర్మాత గురురాజ్ గారే ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నారు’’ సత్యప్రకాశ్. -
ప్రేమతోనే సమస్య
నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సత్యప్రకాశ్ దర్శకత్వంలో ఎ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘అసలు నాకు నీతో కాదు.. ఆ ప్రేమతోనే ప్రాబ్లమ్, ఈ ప్రేమలూ ప్రేతాత్మలు నాకు అస్సల్ నచ్చవ్’, ‘నిన్ను అంత ఈజీగా వదులుకుంటానా?’ అనే డైలాగ్స్‌తో సాగే ఈ టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాశ్‌తో నా అసోసియేషన్ మూడు చిత్రాలే అయినప్పటికీ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తారు. మంచి నటుడు. ఇప్పుడు ఆయనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తన కొడుకు హీరోగా ఈ సినిమా చేయడం అభినందనీయం. ఈ చిత్రం విజయం సాధించాలి. నిర్మాత గురురాజ్ భవిష్యత్‌లో ఇంకా ఎన్నో పెద్ద చిత్రాలను నిర్మించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు సత్యప్రకాశ్. ‘‘నటరాజ్ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. జై రాయరాల మంచి సంగీతం ఇచ్చారు. త్వరలో ట్రైలర్, పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్. ‘‘టీజర్‌ను విడుదల చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. మా నాన్న సత్యప్రకాశ్, గురురాజ్ ఈ సినిమాకు రెండు కళ్లులాంటివారు’’ అన్నారు నటరాజ్. జై రాయరాల మాట్లాడారు. -
పాట.. మాట.. నటన
నటుడు సత్యప్రకాశ్ కుమారుడు నటరాజ్ ‘ఊల్లాలా ఊల్లాలా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నాడు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఏ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు, ఓ పాట పాడి, హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పారు తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ. ‘‘బిగ్‌బాస్–2’ఫేమ్ రోల్ రైడా కూడా ఓ పాట పాడి, నటించారు’’ అని గురురాజ్ అన్నారు. -
మంచి మలుపు అవుతుంది
సీనియర్ నటుడు సత్యప్రకాశ్ దర్శకుడిగా మారి, రూపొందిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. రక్షకభటుడు, ఆనందం, లవర్స్ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఎ. గురురాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత తదితరులు ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మోషన్ పోస్టర్ని హీరో వెంకటేశ్ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాష్ నాకు మంచి మిత్రుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కు ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు’’ అన్నారు సత్యప్రకాష్. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ. -
వింతలు...విశేషాలు
పదకొండు భాషల్లో దాదాపు ఐదొందల చిత్రాల్లో నటించిన సత్యప్రకాష్ తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉల్లాల ఉల్లాల’. నటరాజ్, నూరిస్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురురాజ్, సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఏ. గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సత్య ప్రకాష్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్ల నా కెరీర్లో నటుడిగా సంతృప్తిగా ఉన్నాను. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. రొమాంటిక్ ఎంటర్టైనింగ్ చిత్రమిది. సినిమాలో చాలా వింతలు, విశేషాలు ఉన్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా కథనం ఉంటుంది. గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నటుడిగా సత్యప్రకాష్‌కు ఎంత ఫైర్ ఉందో దర్శకునిగా అంతే ఫైర్ ఉంది. ఈ సినిమా మాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్. ఈ సినిమాకు సంగీతం: జాయ్. -
మనుషులా? దెయ్యాలా?
ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన సత్యప్రకాష్ (‘పోలీస్ స్టోరీ’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉల్లాలా.. ఉల్లాలా’. ఈ చిత్రంతో ఆయన తనయుడు, కన్నడ హీరో నటరాజ్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. నూరిన్ షెరీఫ్, అంకిత మహారాణ, గురురాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటులు బెనర్జీ, అశోక్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ తేజ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘రక్షక భటుడు, ఆనందం, లవర్స్ డే’ సినిమాలు విడుదల చేశాను. వాటి తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉల్లాలా.. ఉల్లాలా’. సత్యప్రకాష్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి. పాత్రలన్నీ వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు వెన్నెముక గురురాజ్‌గారు. మా సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కారు. మా చిత్రంలో ఉన్నది లేదు, లేనిదే ఉన్నట్టు... ఒక వైవిధ్యమైన చిత్రమిది’’ అని సత్యప్రకాష్ అన్నారు. ‘‘మా నాన్న ఈ సినిమాకు దర్శకుడు అనే విషయం నాకు చాలా రోజుల వరకు తెలియదు. తీరా తెలిశాక నేను చేయగలనా? అని కాస్త సందేహించాను’’ అన్నారు నటరాజ్. అంకిత మహారాణ, నూరిన్ షెరీఫ్, సంగీత దర్శకుడు జాయ్, కెమెరామేన్ జె.జి.కృష్ణ తదితరులు మాట్లాడారు. పృథ్వీ, ‘అదుర్స్’ రఘు, లోబో, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
అమ్మ దీవెన
నటుడు సత్యప్రకాశ్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకుడు. ఎత్తరి గురవయ్య నిర్మాత. ఆమని, పోసాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఒక్క పాట మినహా పూర్తయింది. ‘‘ప్రతి తల్లి కుటుంబం కోసం పడే కష్టం, తపన ప్రధానాంశాలుగా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. మదర్ సెంటిమెంట్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ‘‘మా కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటనలతో తీస్తున్న చిత్రం ఇది. ఆమనిగారి పాత్రలో ప్రతి కొడుకు తన తల్లిని చూసుకుంటాడు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్. -
మరచిపోయిన ఆటతో...
నటరాజ్, రోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా రష్మీ సినీ ప్రోడక్షన్స్ పతాకంపై ‘అరుంధతి’ శ్రీను దర్శకత్వంలో జె. వీరేష్ నిర్మిస్తున్న చిత్రం ‘గిల్లి దండా’ నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘క్రీడా నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మా దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. నటుడు సత్యప్రకాశ్ కుమారుడు నటరాజ్ ఈ చిత్రం ద్వారా హీరోగా తెలుగుకు పరిచయం అవుతున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నాం’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘గిల్లి దండా ఆట ఈ తరం పిల్లలకు తెలియకపోవచ్చు. ఈ ఆట నేపథ్యంలో సాగే మంచి లవ్‌స్టోరీ ఇది. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూశామనే ఫీల్ కలిగించేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కుంచె రఘు, ఫైట్స్: థ్రిల్లర్ మంజు. -
చతురంగ వేటై్ట-2 చిత్రానికి శ్రీకారం
చతురంగ వేటై్ట-2 చిత్రానికి పూజా కార్యక్రమాలతో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు సీనియర్ నటుడు మనోబాలా నిర్మించిన చిత్రం చతురంగవేటై్ట. నటుడు నటరాజ్(నట్టి) హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా చతురంగవేటై్ట-2 పేరుతో తాజా చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చతురంగవేటై్ట చిత్రాన్ని నిర్మించిన నటుడు మనోబాలనే ఈ చిత్రాన్ని కూడా తన పిక్చర్ హౌస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అరవిందస్వామి కథానాయకుడిగానూ, ఆయనకు జంటగా నటి త్రిష నాయకిగానూ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాధారవి, నాజర్, ప్రకాశ్‌రాజ్, పూర్ణ, మనోబాల, మయిల్సామి, ఆర్ఎన్ఆర్.మనోహర్, శ్రీమాన్, కమారవేల్ నటిస్తున్నారు. అశ్వమిత్ర సంగీతాన్ని, కేజీ.వెంకటేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతల్ని ఎన్వీ.నిర్మల్‌కుమార్ నిర్వహిస్తున్నారు. చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. -
రేపు ‘చ దురంగ వేట్టై’ మొదలు
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో చదురంగ వేట్టై మొదలవుతోంది. సీనియర్ హాస్యనటుడు దర్శకుడు మనోబాల నిర్మించిన చిత్రం చదురంగ వేట్టై. నటరాజ్, ఇషారా నాయక్ జంటగా నటించిన ఈ చిత్రానికి వినోద్ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ అధినేతలు దర్శకుడు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ విడుదల చేస్తున్నారు. చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ఇటీవల తమ సంస్థ ద్వారా విడుదలైన గోలీసోడా, మంజాపై చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ప్రస్తుతం సూర్య, సమంత హీరో హీరోయిన్లుగా అంజాన్ చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్నానని చెప్పారు. దీంతో ప్రస్తుతానికి ఇతర చిత్రాలను విడుదల చేయరాదని భావించానన్నారు. అయితే కొందరి ఒత్తిడి మేరకు చదురంగ వేట్టై చిత్రం చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పని ఒత్తిడి కారణంగా అర్ధ నిద్రతోనే చూడటానికి సిద్ధమయ్యానని చెప్పారు. అయితే చిత్రం చూస్తుంటే నిద్రమత్తు వదలిపోయిందన్నారు. అంత ఆసక్తిగా చిత్రం సాగటంతో వెంటనే చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కుంకి, వళక్కు ఎన్ 18/9 చిత్రం మాదిరిగా ఈ చిత్రం తిరుపతి బ్రదర్స్ సంస్థలో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. నటీనటులందరూ చక్కగా నటించారని చదురంగ వేట్టై ఖచ్చితంగా జనరంజకంగా ఉంటుందని లింగుస్వామి పేర్కొన్నారు.