పదేళ్ల ప్రస్థానం..
నాటి పీపుల్స్‌వార్ గ్రూపు.. నేడు మావోయిస్టు పార్టీ
దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు
రేపటి నుంచి అమరులకు నివాళులు
ఒకప్పుడు పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యుజీ)గా అవతరించి కార్యకలాపాలు సాగించిన నక్సలైట్లు తరువాత సీపీఐ మావోయిస్టు పార్టీలో విలీనమై పదేళ్లు పూర్తవుతోంది. 2004లో సెప్టెంబర్‌కు ముందు మావోయిస్టుల ఉద్యమం అనేక రాష్ట్రాల్లో ఉన్నా ఒక్కో చోట ఒక్కో రకంగా పిలిచేవారు. వారి ఉద్యమ పంథా ఒక్కటే కావడంతో ఈ సంస్థలన్నీ సీపీఐ మావోయిస్టులుగా 2004 సెప్టెంబర్ 21న ఆవిర్భవించాయి. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో మన్యంలో మళ్లీ భయానక వాతావరణం కనిపిస్తోంది.
కొయ్యూరు : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో సాయుధ పోరాటంలో పీడబ్లూజీ పదేళ్లలో అనేక మార్పులు చేసింది. పీజీఏను పీఎల్‌జీఏగా మార్చింది. వ్యూహాత్మక ప్రతివ్యూహాదాడులు(టీసీవోసీ) చేపట్టింది. ఏవోబీలో మూడు కేంద్రీయ రీజియన్ కమాండ్(సీఆర్సీ)లను ఏర్పాటు చేసింది. ఇక్కడి దట్టమైన అడవులు,ఎత్తయిన కొండలు మావోయిస్టులకు రక్షణ కల్పిస్తున్నాయి. దీంతో శత్రువుపై మూకుమ్మడి దాడి విధానానికి శ్రీకారం చుట్టింది.
2008లో బలిమెల వద్ద లాంచీలో ఉన్న 38 మంది గ్రేహౌండ్స్ కమాండంట్లపై ఇలాగే దాడి చేసి చంపడం ఏవోబీలో చేసిన అతిపెద్ద హింసాత్మక ఘటన. అనంతరం కేంద్రం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా వరకు ఆంధ్ర మీదుగా తిరిగేందుకు దట్టమైన అడవులు ఉండడంతో ఒక చోట కూంబింగ్ చేపడితే మావోయిస్టులు మరో చోట తలదాచుకుంటున్నారు.
సీపీఐ మావోయిస్టులుగా ఆవిర్భవించి దశాబ్ద కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా ఈనెల 21 నుంచి 31 వరకు పోరాటంలో అమరులైన వారికి ఘనంగా నివాళులు అర్పించే అవకాశం ఉంది. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసు బలగాలను ఈస్టు డివిజన్‌లోకి భారీగా మోహరించనున్నారు. ఇన్ఫార్మర్లపై మావోయిస్టులు దృష్టి పెట్టడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మొత్తం మీద మన్యం 11 రోజుల పాటు భయం గుప్పెట్లోకి వెళ్లనుంది.
మేధావులను కోల్పోయిన ఏవోబీ
2004 నుంచి చూస్తే ఏవోబీలో కొందరు కీలక నేతలను,మేధావులను మావోయిస్టులు కోల్పోయారు. అప్పట్లో కేంద్ర కమిటీ సభ్యుడు,ఏవోబీ ఇన్చార్జిగా వ్యవహరించిన వక్కపూడి చంద్రమౌళి అలియాస్ దేవన్న,అతని భార్యను 2007లో ఎన్కౌంటర్ చేశారు. దీని తరువాత ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా చేసిన గోపన్న అలియాస్ వినయ్ రాజమండ్రిలో దొరకిపోయారు. వీరికి ముందు పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో కైలాసం అనే మేధావి మరణించారు.
2011లో శిమిలిగుడ వద్ద ఏవోబీలో కీలక నేతగా ఉన్న చడ్డా భూషణం కూడా దొరకిపోయారు. దీంతో ఈస్టు, మల్కన్‌గిరి, కోరాపుట్,శ్రీకాకుళం డివిజన్లతో ఉన్న కమిటీలలో వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. 2010 వరకు బలంగా ఉన్న మూడు సెంట్రల్ రీజియన్ కంపెనీలు( సీఆర్సీ)లు బలం కోల్పోయాయి. వాటిలో ఒకప్పుడు 45 మంది వరకు సభ్యులు ఉంటే ఇప్పుడు 20 మందికి మించి లేరని పోలీసులు అంచనా వేస్తున్నారు. 2011-2013 మధ్య మావోయిస్టులకు వెన్నుముఖగా ఉన్న 200 మంది మిలిషీయా సభ్యులు లొంగిపోయేలా పోలీసుల చర్యలతో కొంత వరకు దళసభ్యులు బలహీన పడ్డారు.
కూంబింగ్ ఉధృతితో భద్రత
సీపీఐ మావోయిస్టు ఆవిర్భావ ఉత్పవాలు ఈనెల 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నందున కూంబింగ్ ఉధృతం చేస్తాం. పటిష్ట భద్రత చర్యలు చేపడతాం. అదనంగా పోలీసు బలగాలను మోహరించి అన్ని వైపుల నుంచి వేట ప్రారంభిస్తాం. అదనంగా భద్రత చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- విశాల్‌గున్ని, ఓఎస్డీ, నర్సీపట్నం