కనుల పండువగా నెట్టికంటుడి రథోత్సవం
గుంతకల్లు రూరల్ : ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం గురువారం భక్తులతో పోటెత్తింది. భక్తుల గోవిందనామస్మరణలతో ఆలయ పురవీధులు మార్మోగాయి. హేమలంబి నామ సంవత్సర ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు స్వామి వారి రథోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఆంజనేయ పాహిమాం.. ,పవనపుత్ర రక్షమాం.. అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన రథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆకు పూజలు , వడమాలలు ,నివేదనలతో మొక్కులను తీర్చుకున్నారు.
ఆలయ వేద పండితులు రామక్రిష్ణావధాని ,అనంతపరద్మనాభశర్మల ఆధ్వర్యంలోని అర్చక బృందం సాయంత్రం 6 గంటలకు రథం ముందు కళశ స్థాపన , రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. ఆలయ ఈఓ ఆనంద్ కుమార్ ,ఆలయ ధర్మకర్త సుగుణమ్మ ఇతర అధికారులు, పాలకమండలి సభ్యులు కొబ్బరికాయలను సమర్పించి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తిక్కస్వామి, వైస్ సర్పంచ్ శ్రీరాములు,తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీపీ రాయల్రామయ్య తదితరులు పాల్గొన్నారు. కసాపురం ఎస్ఐ సద్గురుడు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు చేపట్టారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.