new airport
-
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు ‘మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’గా నామకరణం చేసే వీలుంది. సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా 10 లక్షల మంది విమానప్రయాణికుల రాకపోకలకు అనువుగా రూ.1,450 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్పోర్ట్, పూర్తయిన అయోధ్య ధామ్ జంక్షన్ తొలి దఫా, అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, పౌర వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. కొత్తగా రెండు అమృత్ భారత్, ఆరు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. సువిశాలంగా కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, బక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు. అధునాతన సదుపాయాలతోపాటు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వాననీటి సంరక్షణ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సౌరవిద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు. -
అందరికీ విమానయోగం
శివమొగ్గ/బెల్గావీ: ‘‘హవాయి చెప్పులేసుకునే సామాన్యులు కూడా హవాయీ జహాజ్ (విమాన) ప్రయాణం చేయగలగాలి. ఆ కల ఇప్పుడు నిజమవుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం కర్నాటకలోని శివమొగ్గలో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భారత వైమానిక రంగం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. ‘‘మున్ముందు మనకు వేలాది విమానాలు అవసరమవుతాయి. వాటిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుంటున్నా భారత్‌లోనే తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు మనమంతా దర్జాగా మేడిన్ ఇండియా విమానాల్లోనే ప్రయాణిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణంతో బీజేపీ ప్రభుత్వం విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని మోదీ చెప్పారు. 2014 దాకా దేశంలో మొత్తం 74 విమానాశ్రయాలుంటే గత తొమ్మిదేళ్లలోనే తాము మరో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్ పాలనపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘2014కు ముందు ఎయిరిండియాను నష్టాలు, కుంభకోణాల సంస్థగా చూసే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి సంస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. నూతన భారతదేశానికి ప్రతీకగా విజయపుటంచులు చూస్తోంది’’ అన్నారు. రూ.3,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. శివమొగ్గ జిల్లాకే చెందిన కర్నాటక మాజీ సీఎం, బీజేపీ అగ్ర నేత బి.ఎస్.యడియూరప్ప సోమవారం 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో సభికులంతా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మోదీ కోరారు. ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేశారని, రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. డబుల్ ఇంజన్ సర్కారుకే మరో అవకాశమివ్వాలని కర్నాటక ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారన్నారు. అనంతరం బెల్గావీలో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు కారులో నుంచుని అభివాదం చేస్తూ సాగారు. అభివృద్ధి చేసిన బెల్గావీ రైల్వేస్టేషన్ భవనాన్ని, రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8 కోట్ల మంది రైతులకు ప్రధాన్‌మంత్రీ కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకంలో 13వ విడతగా రూ.16 వేల కోట్ల నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాష్టంలో రెండో ఎయిర్‌పోర్టు
భువనేశ్వర్ : రాష్ట్రంలో రెండో విమానాశ్రయం ప్రారంభం కానుంది. రాజధాని భువనేశ్వర్ నగరం శివారు ఖుర్దా ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. నగరంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు కోసం స్థలం గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పౌర విమానయాన విభాగం ప్రకటించింది. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పౌర విమానయాన విభాగం ట్వీట్ చేసింది. కేంద్ర పెట్రోలియం, దక్షత అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ బాబుకు ఈ నెలలో లేఖ రాశారు. రాష్ట్రంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు అవసరాల్ని ఆయన లేఖలో వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న విమానాశ్రయంలో సదుపాయాలు కుదించుకుపోయే రీతిలో ప్రయాణికుల రవాణా పుంజుకుంటోంది. ప్రయాణికుల అనుపాతంలో విమానాశ్రయం విస్తరణకు అనుకూల పరిస్థితులు లేవు. మరో వైపు తరచూ పక్షులు ఢీ కొనడం వంటి సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు అనివార్యమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాసిన లేఖపట్ల కేంద్ర విమానయాన విభాగం నెల రోజులు తిరగకుండా సానుకూలంగా స్పందించడం విశేషం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం 39.4 అభివృద్ధి రేటును సాధించింది. జాతీయ స్థాయిలో శరవేగంగా పుంజుకుంటున్న విమానాశ్రయాల్లో ఒకటిగా దూసుకుపోతోంది. రన్–వే, స్థలం కొరత వంటి సమస్యలతో విమానాల రవాణాకు ఇబ్బంది కలుగుతోంది. ప్రతిపాదిత కొత్త విమానాశ్రయం ఏర్పాటుతో విమానాల ల్యాండింగ్ ఇతేరతర సమస్యలు దూరమవుతాయి. గత ఏడాది నుంచే సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి నగరంలో రెండో విమానాశ్రయం కోసం సన్నాహాలు ప్రారంభించింది. నగరం శివారు ఖుర్దా జిల్లా మల్లిపడా, జంకియా, టొంగియాపడా, బొడొసాహి ప్రాంతాల్లో రెండో విమానాశ్రయం కోసం స్థలాల్ని ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ స్థలాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును చేపట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కోడ్–2 లేదా భారీ విమానాలను ఈ ప్రాంతాల్లో ల్యాండింగ్ చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ముంబైకి రెండో విమానాశ్రయం
నవీ ముంబై/ సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే దేశంలోనే అతి పెద్ద నౌకాశ్రయమైన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ)లోని నాలుగో టర్మినల్లో మొదటి దశను మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ప్రస్తు తం దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన (ఒకటే రన్‌వే ఉన్న వాటిలో) ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేనున్నారు. నవీ ముంబైలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన 1997 నుంచి ఉండగా శంకుస్థాపన చేసేందుకు 21 ఏళ్లు పట్టడం గమనార్హం. రూ.16,700 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే గ్రూప్, సిడ్కో (ముంబై నగర పారిశ్రామికాభివృద్ధి సంస్థ) కలసి నిర్మించనున్నాయి. 2019 చివరి నాటికి తొలిదశ పూర్తయి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని సిడ్కో చెబుతున్నప్పటికీ, కనీసం ఐదేళ్లు పడుతుందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అనడం గమనార్హం. మొత్తం నాలుగు దశల్లో 2031 నాటికి విమానాశ్రయ నిర్మాణం పూర్తికానుంది. వృద్ధి అవకాశాలను గుర్తించనే లేదు.. విమానాశ్రయానికి శంకుస్థాపన సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో విమానయన రంగం రోజురోజుకూ వృద్ధి చెందుతున్నా, అందుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. విమానయాన రంగంలో వృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను గత ప్రభుత్వం గుర్తించలేదనీ, తాము ఆ పని చేసి ఇందుకోసం కొత్త విధానాన్ని సైతం తీసుకొచ్చామని మోదీ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 450 విమానాలు అందుబాటులో ఉండగా, గత ఏడాది కాలంలోనే 900 కొత్త విమానాలకు కంపెనీలు ఆర్డర్లు ఇవ్వడమే ఈ రంగంలో ప్రగతికి నిదర్శనమన్నారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, జీవీకే గ్రూప్ చైర్మన్ వెంకట కృష్ణా రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే మనోహర్ భోయిర్ నిరసనకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. 50 శాతం పెరిగిన పోర్టు సామర్థ్యం జేఎన్‌పీటీలో నాలుగో టర్మినల్ మొదటి దశ ప్రారంభమవడంతో నౌకాశ్రయం సామర్థ్యం 50 శాతం పెరిగింది. ఇప్పటివరకు జేఎన్‌పీటీకి 4.8 మిలియన్ల కంటెయినర్లను నిర్వహించే సామర్థ్యం ఉండగా తాజాగా ఆ సంఖ్య 7.2 మిలియన్ కంటెయినర్లకు చేరింది. మా బడ్జెట్ ఫలితాలనూ సాధిస్తుంది.. ‘మా బడ్జెట్ కేవలం ఖర్చు పెట్టడమే కాకుండా ఫలితాలను రాబట్టడంపైనా దృష్టి పెట్టింది. మేం తీసుకొచ్చిన సంస్కరణలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి’ అని మోదీ అన్నారు. ముంబైలోని బాంద్రాలో ‘మ్యాగ్నటిక్ మహారాష్ట్ర’ ప్రపంచ పెట్టు్టబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర దేశంలోనే మొదటి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. -
ఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోయిడాలో జెవెర్ లో ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇది రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లభించిందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శనివారం ప్రకటించారు. తద్వారా తదుపరి 10-15 సంవత్సరాల్లో సంవత్సరానికి 30-50 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించనున్నామని చెప్పారు. 3వేల హెక్టార్లలో దీన్ని నిర్మించనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రాంతంలో తొలిదశలో 1000 హెక్టార్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ .20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు.పబ్లిక్ అండ్ ప్రయివేట్ పార్టనర్షిప్తో (పీపీపీ) తో దీన్ని నిర్మించనున్న ఈ విమానాశ్రయాన్ని అయిదేళ్లలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మరోవైపు దేశీయ, అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో కార్పోరేట్ హబ్ గా జెవెర్ విమానాశ్రయం నిలవనుందని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఎస్ సింగ్ పేర్కొన్నారు. -
విశాఖకు మరో విమానాశ్రయం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం విశాఖకు వచ్చింది. నక్కపల్లి, ఎస్‌రాయవరం ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అలోక్ సిన్హాతో పాటు ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయం ఉన్న సంగతి తెలిసిందే.