new programmes
-
భారత్ ఎన్సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా?
భారతదేశంలో మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను మరింత పెంచడానికి ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' 'న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (Bharat NCAP) ప్రారంభించనున్నారు. వాహనాలలో సేఫ్టీ పెరిగితే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే భావనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ ప్రోగ్రామ్ కింద కార్ల తయారీదారులు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 197 ప్రకారం.. కార్లను స్వచ్ఛందంగా టెస్ట్ చేయడానికి అందించవచ్చు. దీని ద్వారా వాహనాలు సేఫ్టీ రేటింగ్ పొందుతాయి. ఇంతకీ భారత్ ఎన్సీఏపీ వల్ల ఉపయోగాలేమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా.. భారత్ ఎన్సీఏపీ ఉపయోగాలు.. ➤ ఒక కంపెనీ తమ ఉత్పత్తులను టెస్ట్ చేయడానికి అందించినప్పుడు.. వాటి పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్ కోసం రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. ➤ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు కార్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇది అధిక సేఫ్టీ కలిగిన కార్లను ఎంచుకోవడంలో ఉపయోగపడుతుందని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ➤ ఆధునిక కాలంలో భద్రత ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. అయితే దేశీయ కార్లు అంతర్జాతీయ మార్కెట్లో కూడా గుర్తింపు పొందటానికి భారత్ ఎన్సీఏపీ చాలా ఉపయోగపడుతుంది. ➤ భారత్ ఎన్సీఏపీ గుర్తించిన కార్లు తప్పకుండా విదేశాలకు ఎక్కువ సంఖ్యలో ఎగుమతి అవుతాయని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. ➤ ఇప్పటికే రోడ్లపై 'బ్లాక్ స్పాట్స్' తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని నితిన్ గడ్కరీ ఇదివరకే వెల్లడించారు. దీంతో ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ➤ ఒక్క 2021లో రోడ్డు ప్రమాదాలలో సుమారు 1.54 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా.. 3.84 లక్షల మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ➤ ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి, టయోటా వంటి కంపెనీలు న్యూ కార్ అసెస్మెంట్ కార్యక్రమానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. మొత్తం మీద 2024నాటికి రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను సుమారు 50 శాతం తగ్గించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. -
Mothersday 2023: మాతృమూర్తుల కోసం 24/7 బడ్డీ ప్రోగ్రాం
హైదరాబాద్: మెటర్నిటీ లీవులో ఉన్న ఉద్యోగినుల కోసం మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక బడ్డీ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు 24/7 డాట్ఏఐ వెల్లడించింది. ఉద్యోగ విధులకు దూరంగా ఉన్నప్పటికీ సంస్థలో చోటుచేసుకునే పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇలా అప్డేట్గా ఉంచేందుకు సూపర్వైజర్ సూచించిన వారిని లేదా తమకు నచ్చిన వ్యక్తిని సదరు ఉద్యోగిని తమ బడ్డీగా (స్నేహితులు) ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే బేబీ అలవెన్సులు, గిఫ్ట్ ఆఫ్ టైమ్, ప్రెగ్నెన్సీ సమయంలో ప్రత్యేక క్యాబ్‌లు తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
కాలుష్య నివారణకు కేజ్రీ నిర్ణయం: స్విచ్ ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని న్యూఢిల్లీ ఉంటోంది. కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘స్విచ్ ఢిల్లీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్విచ్ ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడా కంపెనీలు, స్ధానిక సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాలు, మాల్స్, సినిమా హాళ్ల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యువత తమ తొలి వాహనంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ‘స్విచ్ ఢిల్లీ’ కార్యక్రమంతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ వాహనాల వాడకంతో కాలుష్యం ఎలా తగ్గుతోందని చెబుతుందని సీఎం అరవింద్ తెలిపారు. పాత పెట్రోల్, డీజిల్ వాహనాల బదులు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచించారు. కాలుష్య రహిత ఢిల్లీ ఏర్పాటుకు సహకరించాలని పిలుపునిచ్చారు. 2020లో ఎలక్ట్రిక్ వాహన విధానం తీసుకురావడంతో ఢిల్లీలో 6 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజలు కొనుగోలు చేశారని సీఎం కేజ్రీవాల్ వివరించారు. మరింత ప్రోత్సహించేందుకు ఢిల్లీవ్యాప్తంగా 100 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం టెండర్లను జారీ చేసిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ తెలిపారు. आइए प्रदूषण के ख़िलाफ़ एक जंग मिलकर लड़ें, अपने वाहनों को Electric vehicle पर Switch करें। pic.twitter.com/QNLCdDWYHq — Arvind Kejriwal (@ArvindKejriwal) February 4, 2021 -
నేటి నుంచి ఆకాశవాణిలో కొత్త కార్యక్రమాలు
అనంతపురం కల్చరల్: ఆకాశవాణిలో శుక్రవారం నుండి సరికొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరాణి ఓ ప్రకటనలో తెలిపారు. మీతో ఆకాశవాణి, విను వినిపించు తదితర కార్యక్రమాలను ప్రసారమవుతాయన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు దిక్సూచి, ప్రతి మంగళవారం ఉదయం 9.30 గంటలకు మన ఆలయాలు, ప్రతి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మధురం మధురం ఈ సమయం, ప్రతి శనివారం ఉదయం 9.30 గంటలకు స్మృతిపథం, సోమవారం, బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మీతో ఆకాశవాణి, ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విను వినిపించు కార్యక్రమాలతో పాటు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రోతల ఉత్తరాల కార్యక్రమాలు ప్రసారమవుతాయని చెప్పారు.