రాహుకాలం, యమగండం వేటిపైనా నమ్మకం లేదు !
బెంగళూరు : రాహుకాలం, యమగండం వంటి విషయాలపై తనకు నమ్మకం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. శనివారం ఉదయం మైసూరులోని తన నివాసంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జంబూ సవారీ యమగండ సమయంలో ప్రారంభించారనే అంశంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు అన్ని సమయాలు మంచివే. కాకపోతే కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయకూడదంటూ జ్యోతిష్యులు చెబుతుంటారు.
వీటిపై ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదు. జంబూ సవారి యమగండ సమయంలో ప్రారంభించిన విషయంలో కూడా ఇప్పుడు చర్చ అనవసరం. అన్ని సమయాలు మంచివే, కాకపోతే ఆయా సమయాల్లో ఆపనిని ప్రారంభించే మనిషి మనస్థితిపైనే మిగతా అంశాలు ఆధారపడి ఉంటాయి’ అని పేర్కొన్నారు.
తమిళనాడుకు ఇప్పటికే నీరు అందించాం
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేశామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిందని, మైసూరు, మండ్య, బెంగళూరు వాసులకు కేవలం తాగేందుకు మాత్రమే నీరు మిగిలి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక తమిళనాడుకు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని తమిళనాడు ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని కోరారు.
లేదంటే తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టులోనే ఎదుర్కొంటామని అన్నారు. ఇక కేంద్రమంత్రి వి.కె.సింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ఓ కేంద్రమంత్రి స్థానంలో ఉండి దళితులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. ఏదైనా విషయంపై మాట్లాడేటపుడు అందుకు సంబంధించిన సాదక, బాధకాలపై పూర్తిగా తెలుసుకొని మాట్లాడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. బాధ్యతా రహితంగా ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారిని ప్రధాని మోదీ తన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.