nuthankal
-
రైతాంగ అభివృద్ధే లక్ష్యం
నూతనకల్ : రైతాంగ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశ్‌ర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మద్దిరాల శివారులో శ్రీరాంసాగర్ రెండవ దశ పరిధిలోని 69డీబీఎం ద్వారా విడుదలైన గోదావరి జలాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో కోదాడ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ఏ రజాక్, బెజ్జంకి శ్రీరాంరెడ్డి, రాంపాక సైదులు మంజుల, గూడ అన్నమ్మ శివలింగారెడ్డి, వడ్డానం మధు, గూడ వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలన్ని పూర్తిస్థాయిలో నిండి నిండుకుండల్లా మారాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ సంక్షేమం కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులల్లో నీటి నిల్వ పెరిగి రెండు సంవత్సరాల దాక రైతులకు భూగర్భజలాలు అధిక మొత్తంలో లభిస్తాయని ఆయన అన్నారు. తుంగతుర్తి, నూతనకల్ మండలాల పరిధిలోని వర్షాపాతం తక్కువగా ఉండటం వలన చెరువులు, కుంటలు నిండకపోవడం వలన ఇక్కడి ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రీరాంసాగర్ రెండవ దశ ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి చెరువులు, కుంటలు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కాల్వలో నీటి ప్రవాహం తక్కువగా ఉందని వెంటనే నీటి ప్రవాహం పెంచే విధంగా అధికారులకు సూచనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు గోదావరి జలాలను ఉపయోగించుకొని చెరువులు, కుంటలను నింపుకోవాలని ఆయన కోరారు. ఈ -
వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
నూతనకల్: ప్రియుడితో కలిసి భార్య వేధిస్తుండడంతో విసుగు చెందిన భర్త సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని బిక్కుమళ్ల గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొల్లెపల్లి శ్రీరంగం కుమారుడు బొల్లెపల్లి శ్రీనివాస్(35)కు అదే గ్రామానికి చెందిన కప్పల నర్సయ్య కుమార్తె గీతను ఇచ్చి 18సంవత్సరాల క్రితం వివాహాం జరిపించారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గీత ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే గ్రామానికి చెందిన పోలోజు వెంకటచారితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండడంతో నాలుగేళ్లుగా గీత తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. మృతుడు పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పరిష్కారం చేసుకోవడంతో నెల రోజుల నుంచిlకలిసి ఉంటున్నారు. అయితే తరచూ భర్తను చూటిపోటు మాటలతో వేధిస్తుండడంతో పాటు సక్రమంగా చూసుకోవడం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాస్ సోమవారం రాత్రి తన భార్య, కూతురు ఇంటి స్లాబ్‌పై నిద్రిస్తున్న సమయంలో స్లాబ్ కొక్కానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం భార్య, తలుపులు తెరవగా ఉరివేసుకొని ఉండడంతో కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు భార్య గీత, ప్రియుడు వెంకటచారిపై కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఎచ్ఓ కె. అంజన్‌రెడ్డి తెలిపారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
నూతనకల్ తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని మద్దిరాల, వెంకెపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, మినరల్ వాటర్‌ట్యాంకు, బోరు, మోటార్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి, వాటిని పరిష్కరించడం కోసం త్వరలోనే పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తన దత్తత గ్రామమైన మద్దిరాలలో వీధిలైట్లు, సీసీ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.58కోట్లు, రోడ్డు భవనాల శాఖ నుంచి రూ.140వేల కోట్లతో రహదారులు అభివృద్ధి పర్చామని తెలియజేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను నింపడం కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశానని వారం పది రోజుల్లో నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపుతామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ముకుందాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్సింగ్ కొమరయ్య ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ఏ. రజాక్, సర్పంచ్ రాంపాక మంజులసైదులు, ఎంపీటీసీ గూడ అన్నమ్మశివలింగారెడ్డి, బెజ్జంకి శ్రీరాంరెడ్డి, తొనుకునూరి అశోక్‌గౌడ్, కందాల దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి విద్యాసాగర్‌రావు, భూరెడ్డి సంజీవరెడ్డి, నలమాస రాములు, ఆకుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం మహిళల ధర్నా
నూతనకల్ మండలంలోని మామిళ్లమడవ గ్రామంలో తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ 20రోజుల నుంచి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక అవస్థలు పడుతున్నామన్నారు. గ్రామానికి మంచినీటి సరఫరా చేసే బోరు మోటారు చెడిపోయి 15రోజులు గడిచినా నేటికీ మరమ్మతులు చేయించలేదని ఆరోపించారు. పాలేరు వాగు నుంచి ఊట బావి తవ్వించి మంచినీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మహిళలు కావటి మల్లమ్మ, కొంపెల్లి లింగమ్మ, గాడుదుల సుజాత, తండా లక్ష్మి, ఉప్పల సరోజన, మట్టపెల్లి కొమరమ్మ, జ్యోతి, ఉప్పల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.