Omni Van
-
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. ఫొటో వైరల్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసి అందరినీ అశ్చర్యపరిచారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వ్యాన్‌ను స్వయంగా కేసీఆరే నడపటం వెనుక కథ వేరే ఉంది.కాగా గతేడాది డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ కాలు జారిపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ నడుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం నడిపారు.కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడుపుతూ ఎర్రవల్లి పొరుగు గ్రామాలను సందర్శించారు. రోడ్లపై కనబడిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ తన వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. కేసీఆర్ పలుకరింపుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. -
హుక్కా ఆన్ వీల్స్!
సాక్షి, సిటీబ్యూరో: హుక్కా పార్లర్లపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ దందా చేసేవాళ్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ వాటిని అనుసరిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకులు, హుక్కా పీల్చే వారితో కలిపి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి ఓమ్నీ వాహనంతో పాటు రూ.2 లక్షల విలువైన హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి గురువారం వెల్లడించారు. పాతబస్తీలోని మచిలీ క కమాన్ ప్రాంతానికి చెందిన అలీ, అబ్దుల్ కరీం గతంలో రఫీఖ్ ట్రేడర్స్ పేరుతో హుక్కా వ్యాపారం నిర్వహించారు. సిటీలో హుక్కా పార్లర్స్ ను నిషేధించడం, అక్రమ వ్యాపారంపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ ద్వయం కొత్త మార్గాలు అన్వేషించింది. కొన్ని నెలల క్రితం ఓ ఓమ్మీ వ్యాన్ ఖరీదు చేసిన వీరు అందులో కొన్ని మార్పులు చేసి తెరలు ఏర్పాటు చేశారు. అనేక ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించిన హుక్కా పాట్స్, మెటీరియల్, వివిధ ఫ్లేవర్లు అందులో పెట్టుకుంటున్నారు. ఈ వాహనంతో సహా వీరిద్దరూ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. పరిచయస్తులు, వారి సిఫార్సుతో వచ్చిన వారికి ఆయా ఫ్లేవర్లకు చెందిన హుక్కా పాట్స్ అందిస్తున్నారు. దీనికి వారి నుంచి నిర్ణీత మొత్తం వసూలు చేస్తూ తమ వాహనం చాటునే కూర్చుని హుక్కా పీల్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా పాతబస్తీలో అనేక మంది కస్టమర్లను ఏర్పాటు చేసుకున్న ఈ ద్వయం వారి వద్దకే వెళ్తూ వారికి హుక్కా పీల్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు కొందరికి పాట్స్, హుక్కా ఫ్లేవర్స్ విక్రయిస్తోంది. కొన్నాళ్ళుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేత్రుత్వంలో రంగంలోకి దిగిన టీమ్ వలపన్ని మీర్‌చౌక్ ప్రాంతంలో వాహనాన్ని పట్టుకుంది. అందులో ఉన్న ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిని పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం వీరిని మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించింది. -
ఓమ్ని వ్యాన్ కథ ముగిసింది..
న్యూఢిల్లీ: సుమారు 35 ఏళ్ల పాటు చౌక మల్టీపర్పస్ వాహనంగా (ఎంపీవీ) వాహనదారులకు చేరువయిన మారుతీ ఓమ్ని వ్యాన్ ఇకపై కనుమరుగు కానుంది. ఓమ్ని తయారీని నిలిపివేయాలని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా మార్చుకునేందుకు ఓమ్ని చాలా అనువుగా ఉంటోందని తెలిసిందే. మార్కెట్లోకి వచ్చి 35 ఏళ్లయినా ఇప్పటికీ ఓమ్ని వ్యాన్స్‌కి ఆదరణేమీ తగ్గలేదు. అమ్మకాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, వాహనాల భద్రతా/కాలుష్య ప్రమాణాలకు సంబంధించి కొంగొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఓమ్ని వ్యాన్ తయారీ నిలిపివేయాలని మారుతీ నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ తొలి కారు 800ను ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత 1984లో ఓమ్ని వ్యాన్‌ను మారుతీ ప్రవేశపెట్టింది. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్), ఎయిర్‌బ్యాగ్స్, బీఎస్ 6 ప్రమాణాలు మొదలైనవాటిని తప్పనిసరిగా చేస్తూ ప్రభుత్వం నిబంధనలు చేసిన నేపథ్యంలో పలు వాహనాల తయారీ సంస్థలు అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ పాత కాలం నాటి మోడల్స్ నిలిపివేస్తున్నాయి. లేదా పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ చేసి ప్రవేశపెడుతున్నాయి. ఆ క్రమంలోనే మారుతీ కూడా ప్రస్తుతం కొత్త భద్రతాప్రమాణాలకు అనుగుణంగా కొన్ని మోడల్స్‌ను అప్డేట్ చేస్తోంది. మల్టీపర్పస్ వెహికల్ ’ఈకో’ వాహనానికి సంబంధించి కొత్త ఫీచర్స్‌తో అప్‌డేటెట్ వెర్షన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్, కో–డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ లాంటివి ఈ ఫీచర్స్‌లో ఉన్నాయి. -
వాహనంలో వ్యక్తి మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చాదర్‌ఘాట్ అక్బర్ బాగ్ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓమ్ని వ్యాన్‌లో మృతదేహాం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓమ్నీ వ్యాన్‌లో ఓ వ్యక్తి స్పృహ లేకుండా ఉన్నట్లు కొందరు స్థానికులు గుర్తించారు. అతడిని పరిశీలించగా అదివరకే మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. మృతుడిని సైదాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ పర్వతాలుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. -
ఓర్నీ...ఓమ్నీ
ఈ ఓమ్నీని చూశారా? పుష్పక విమానంలా ఎంతమందిని మోసుకెళుతోందో... వీఎస్టీ ఫంక్షన్ హాలులో ఓ పార్టీ సమావేశానికి సోమవారం రాంనగర్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొచ్చారు. సమావేశం ముగిసిన తరువాత ఓమ్నీ వ్యాన్‌లో సుమారు 25 మంది మహిళలను కుక్కి.. గాలి కూడా అందని స్థితిలో వారిని ఇళ్లకు తరలించారు. ఈ దృశ్యం చూసిన వారు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మున్ముందు ఇంకా ఎన్ని వి‘చిత్రాలు’ చూడాల్సి వస్తుందోనని వ్యాఖ్యానించారు. చిత్రం: ఎం.రవికుమార్ -
ఓమ్ని వ్యాను-లారీ ఢీ.. ఒకరి మృతి
కాశీపేట(ఆదిలాబాద్ జిల్లా): కాశీపేట మండలం సుబ్బారావుపల్లి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓమ్ని వ్యానును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంచిర్యాల పట్టణానికి చెందిన మాలి పేర రాంజీ(50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మాలి కిశోర్‌కుమార్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఓమ్ని వ్యాను మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటన అనంతరం అదే లారీ మంచిర్యాలలో మరొకరిని ఢీకొట్టినట్లు తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. -
జాతీయ రహదారిపై ఓమిని వ్యాన్ దగ్ధం
డిచ్పల్లి: డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాంపల్లి శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఓమిని వ్యాన్ దగ్ధమైంది. ఎస్ఐ శ్రీధర్‌గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన ఓమిని వ్యాన్‌లో డ్రైవర్ రమేశ్ ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక షార్ట్ సర్క్యూట్‌తో వ్యాన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో రమేశ్ భయంతో కిందకు దిగిపోయాడు. అదే సమయంలో నవయుగ టోల్‌ఫ్లాజా హై వే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ఆం దోళనకు గురయ్యారు. ఫైరింజన్‌కు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వ్యాన్ పూర్తిగా తలగబడిపోయిం ది. వ్యాన్‌లో డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ వ్యాన్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలువడంతో మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల కుటుంబీకులు కలవరానికి గురయ్యారు. ప్రాణనష్టం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ ఓమినీ వ్యాన్‌ను సొంత పనులకు వాడుతాం. డ్రైవర్ స్కూల్ బస్సులో పిల్లలను ఇళ్లల్లో దింపి వచ్చిన తర్వాత, పనుందని అడగటంతో వ్యాన్‌లో వెళ్లమని చెప్పాను. ప్రాణనష్టం జరగక పోవడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని స్కూల్ కరస్పాండెంట్ గంగారాం పేర్కొన్నారు.