Open Defecation Free towns
-
స్వచ్ఛ గ్రామంగా మెట్లచిట్టాపూర్
సాక్షి, జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగమైన ఓడీఎఫ్ ప్లస్ స్టేటస్‌కు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామం అర్హత సాధించింది. గ్రామపంచాయతీ కొత్త పాలకవర్గం ఏర్పడ్డ రెండేళ్లలోనే ఈ ఘనత సాధించిన మెట్లచిట్టాపూర్ గ్రామాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ట్విట్టర్లో అభినందించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ గ్రామం నూరుశాతం అమలు చేయడంతో ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్లస్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో మేటి మెట్లచిట్టాపూర్ గ్రామంలో 1,975 మంది జనాభా, 719 నివాసాలు ఉండగా, ఇక్కడ నూరుశాతం స్వచ్ఛ కార్యక్రమాలను అవలంబిస్తున్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా రైతులు మొక్కలకు సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. జంతువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలతో వాతావరణం, నీరు కలుషితం కాకుండా గ్రామంలో జంతువుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం విశేషం. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా మురుగునీరు నిలిచిపోకుండా మ్యాజికల్ ఇంకుడు గుంతలను నిర్మించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు గ్రామానికి వచ్చే సందర్శకుల కోసం కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఈ గ్రామం స్వచ్ఛ సుందర్ సముదాయక సౌచాలయ కింద ఓడీఎఫ్ గ్రామంగా ఎంపికైంది. గ్రామస్తుల సమష్టి సహకారంతోనే.. గ్రామ పాలకవర్గం చేసిన తీర్మానాలకు గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందరి సహకారంతోనే సామూహిక మరుగుదొడ్లు, కంపోస్ట్ యూనిట్లను నిర్మించాం. బహిరంగంగా చెత్త వేయకుండా, ప్లాస్టిక్ వినియోగించకుండా గ్రామస్తులు సహకరిస్తున్నారు. – బద్దం శేఖర్‌రెడ్డి, సర్పంచ్, మెట్లచిట్టాపూర్ -
రాజన్న సిరిసిల్ల.. రాష్ట్రానికే ఆదర్శం
రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వచ్ఛత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలోనే జిల్లాకు అరుదైన ఖ్యాతి లభించడం మనందరికీ దక్కిన గౌరవమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. యావత్ భారతానికి తెలంగాణను, తెలంగాణకు సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుదామంటూ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ దర్పణ్ ర్యాకింగ్‌లో జిల్లాకు ప్రథమ బహుమతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత తొలి జిల్లాగా సిరిసిల్ల ప్రత్యేకతను సంతరించుకుని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన ఉద్యోగుల సేవలు గుర్తించడంతో పాటు, సమస్యలకు పరిష్కారం చూపుతూ, వారి సంక్షేమానికై ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి, నేతన్నల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితం తెలంగాణ.. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలైనా అవలీలగా అడ్డుకోవచ్చని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రగతి దారుల వెంట వేగంగా పయనిస్తోందని, ఇది ఒక చారిత్రాత్మక విజయయాత్ర అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో.. ఈనాడు పాలనలోనూ ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం వాటిని తిప్పికొడుతోందని తెలిపారు. -
రాష్ట్రంలో 5 ఓడీఎఫ్ పట్టణాలు
- బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ధ్రువీకరించిన కేంద్రం - జాబితాలో సిద్దిపేట, షాద్‌నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్నగర్ - భువనగిరికి తిరస్కరణ.. పరిశీలనలో మరో ఆరు పట్టణాలు సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కింద రాష్ట్రంలోని ఐదు పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ధ్రువీకరణ పొందాయి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రక్రియలో సిద్దిపేట, షాద్‌నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్‌నగర్‌లను ఓడీఎఫ్ ప్రాంతాలుగా నిర్ధారించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఓడీఎఫ్ కోసం భువనగిరి పట్టణం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే దీనిని మరోసారి తనిఖీ చేస్తామని వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ పురోగతిని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ఢిల్లీలో సమీక్షించారు. ఓడీఎఫ్ గుర్తింపు కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 11 పట్టణాలు ప్రతిపాదనలు పంపుకోగా.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తనిఖీ చేయించింది. అందులో తెలంగాణలోని ఐదు పట్టణాలు సహా 10 పట్టణాలను ఓడీఎఫ్‌గా ధ్రువీకరించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 141 పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపుకోసం ప్రతిపాదించాయి. దీంతో ఆయా పట్టణాలలో థర్డ్ పార్టీ తనిఖీలు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన కొద్దీ.. నిర్ధారణను జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని గజ్వేల్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, మధిర, సత్తుపల్లి, సిరిసిల్ల కూడా ఓడీఎఫ్ హోదా కోసం ప్రతిపాదించాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రాల నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందుతున్న నివేదికలను బట్టి.. వచ్చే ఏడాది నాటికి 974 నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారనున్నాయి. అందులో ఏపీకి చెందిన 112 పట్టణ ప్రాంతాలు, తెలంగాణలోని 37 పట్టణాలు ఉన్నాయి. ఓడీఎఫ్ గుర్తింపు ఇలా.. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఓడీఎఫ్ గుర్తింపు కోసం ముందుగా వార్డులు, పట్టణం స్వయంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించాలి. తర్వాత 30 రోజుల్లో ఆ శాఖ తనిఖీ చేయిస్తుంది. సేవా స్థాయి అంచనా (నిర్మాణం, గృహ లభ్యత, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు), స్వతంత్ర పరిశీలనల అంచనా ఆధారంగా నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. నగరం లేదా పట్టణంలో కనీసం ఒక మురికివాడలో, పాఠశాల, ప్రభుత్వ మార్కెట్ లేదా మతపరమైన స్థానంలో, నివాస ప్రాంతం, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేస్తారు. 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరంలో కనీసం 9 చోట్ల, 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న నగరాల్లో కనీసం 17 చోట్ల పరిశీలన జరుపుతారు. రోజు మొత్తంగా ఏ సమయంలో కూడా ఒక వార్డ్లోగానీ, పట్టణంలోగానీ ఒక్కరు కూడా బహిరంగ మల విసర్జన చేయకపోతే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా నిర్ధారిస్తారు.