రాష్ట్రంలో 5 ఓడీఎఫ్ పట్టణాలు
- బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ధ్రువీకరించిన కేంద్రం
- జాబితాలో సిద్దిపేట, షాద్‌నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్‌నగర్
- భువనగిరికి తిరస్కరణ.. పరిశీలనలో మరో ఆరు పట్టణాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కింద రాష్ట్రంలోని ఐదు పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ధ్రువీకరణ పొందాయి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రక్రియలో సిద్దిపేట, షాద్‌నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్‌నగర్‌లను ఓడీఎఫ్ ప్రాంతాలుగా నిర్ధారించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఓడీఎఫ్ కోసం భువనగిరి పట్టణం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే దీనిని మరోసారి తనిఖీ చేస్తామని వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ పురోగతిని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ఢిల్లీలో సమీక్షించారు.
ఓడీఎఫ్ గుర్తింపు కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 11 పట్టణాలు ప్రతిపాదనలు పంపుకోగా.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తనిఖీ చేయించింది. అందులో తెలంగాణలోని ఐదు పట్టణాలు సహా 10 పట్టణాలను ఓడీఎఫ్‌గా ధ్రువీకరించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 141 పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపుకోసం ప్రతిపాదించాయి. దీంతో ఆయా పట్టణాలలో థర్డ్ పార్టీ తనిఖీలు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన కొద్దీ.. నిర్ధారణను జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని గజ్వేల్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, మధిర, సత్తుపల్లి, సిరిసిల్ల కూడా ఓడీఎఫ్ హోదా కోసం ప్రతిపాదించాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రాల నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందుతున్న నివేదికలను బట్టి.. వచ్చే ఏడాది నాటికి 974 నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారనున్నాయి. అందులో ఏపీకి చెందిన 112 పట్టణ ప్రాంతాలు, తెలంగాణలోని 37 పట్టణాలు ఉన్నాయి.
ఓడీఎఫ్ గుర్తింపు ఇలా..
థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఓడీఎఫ్ గుర్తింపు కోసం ముందుగా వార్డులు, పట్టణం స్వయంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించాలి. తర్వాత 30 రోజుల్లో ఆ శాఖ తనిఖీ చేయిస్తుంది. సేవా స్థాయి అంచనా (నిర్మాణం, గృహ లభ్యత, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు), స్వతంత్ర పరిశీలనల అంచనా ఆధారంగా నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. నగరం లేదా పట్టణంలో కనీసం ఒక మురికివాడలో, పాఠశాల, ప్రభుత్వ మార్కెట్ లేదా మతపరమైన స్థానంలో, నివాస ప్రాంతం, బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో తనిఖీలు చేస్తారు. 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరంలో కనీసం 9 చోట్ల, 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న నగరాల్లో కనీసం 17 చోట్ల పరిశీలన జరుపుతారు. రోజు మొత్తంగా ఏ సమయంలో కూడా ఒక వార్డ్‌లోగానీ, పట్టణంలోగానీ ఒక్కరు కూడా బహిరంగ మల విసర్జన చేయకపోతే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా నిర్ధారిస్తారు.