నిలిచిన నిర్మాణాలు
మెదక్ మున్సిపాలిటీ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛభారత్-స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబం తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. నిర్మించుకున్న మరుగుదొడ్లకు బిల్లులు ఇస్తామని ప్రకటించింది. మెదక్ పట్టణంలో పథకం ప్రారంభమై ఏడాది గడుస్తోంది.
పట్టణంలో నిర్వహించిన సర్వే ప్రకారం 1782 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1050 మాత్రమే పూర్తయ్యాయి. వాటికి బిల్లులు కూడా చెల్లించారు. మిగిలిన 732లో కొన్నిపూర్తికాగా, 296 నిర్మాణాలు బిల్లులు రాక నిలిచిపోయాయి. బిల్లులు సకాలంలో రాకపోవడంతో నిర్మాణాలు నిలిపివేసినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మునిసిపల్ కమిషనర్‌కు 13 వార్డుకు చెందిన మహిళ తాము మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రాలేదని మొరపెట్టుకుంది.
రూ.1.17 కోట్లు అందజేశాం..
ఇప్పటి వరకు నిర్మించుకున్న వారికి రూ.1.17 కోట్లు అందజేశామని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. డీఎంఏ ఆదేశాల మేరకు ఎల్‌ఆర్‌ఎస్ నిధుల నుంచి రూ.35 లక్షలు అందజేశామన్నారు. పట్టణంలో మరో 436 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, నిధులు లేక జాప్యం జరుగుతుందన్నారు. ఇందుకుగానూ మరో రూ.69 లక్షలు అవసరం ఉంటుందన్నారు. నిధులు రాగానే పనులు చేపడుతామన్నారు.
మూడు నెలలుగా బిల్లులు ఇవ్వడంలేదు..
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని మూడు నెలలు గడుస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, డబ్బులు మంజూరు చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు పదే పదే చెప్పడంతో మరుగుదొడ్లు నిర్మించుకున్నాం. రింగులు వేసి మూడు నెలలైనా బిల్లులు మంజూరు చేయలేదని 13వ వార్డుకు చెందిన సుజాత వాపోయింది.