కంటతడిపెట్టిన లక్ష్మీదేవమ్మ
విజయవాడ:'తెలుగుదేశం పార్టీ కోసం మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. రాజకీయ పోరాటంతో నా భర్తను కూడా కోల్పోయాను. మమ్మల్ని అన్నిరకాలుగా ఇబ్బందులపాలు చేసినవారిని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు న్యాయం?' అంటూ సీఎం చంద్రబాబు సమక్షంలో కంటతడిపెట్టారు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చేరికపై జమ్మలమడుగు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సోమవారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై లక్ష్మీదేవమ్మ తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తమ పార్టీలో చేరతారని మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు చెప్పారు. అయితే ఆదినారాయణ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు, ఆయన పార్టీలో చేరితే తనదారి తాను చూసుకుంటానన్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జి.. చంద్రబాబుతో సమావేశం అనంతరం కాస్త మెత్తబడ్డారు. అధినేతనే నమ్ముకుని బతుకుతున్నానని, ఆయనను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడబోనని స్పష్టంచేశారు. కాగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, సమన్వయం ముందుకుసాగేలా చూస్తానని సీఎం చంద్రబాబు లక్ష్మీదేవమ్మ, రామసుబ్బారెడ్డిలకు సర్దిచెప్పినట్లు తెలిసింది.