రమణీయం..ఈరన్న పల్లకోత్సవం
– భక్తజన సంద్రమైన ఉరుకుంద
– శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు
– కందుకూరులో ఆనందోత్సాహం
కోసిగి: ఉరకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయంలో భాగంగా శ్రావణమాసం ఆఖరి సోమవారం పూల పల్లకీలో ఈరన్న స్వామి ఊరేగుతూ కందకూరు గ్రామం చేరుకున్నారు. తుంగభద్ర నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వరస్వామి ఎదుట దింపుడు కట్టపై ఉత్సవమూర్తి పల్లకిని కొలువుంచారు. అక్కడ పండితులు వేద పఠనంతో విశేష పూజలు చేశారు. ఉత్సవమూర్తితో నదితీరం సమీపించి క్రతువులు చేశారు. ముందుగా మూలవిరాట్‌తో సహితంగా పురోహితులు, భక్తులు ఏకకాల పుణ్యస్నానం ఆచరించారు. స్వామి పుణ్యస్నానం వేళ కిందిభాగంలో మునక చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. స్నానమనంతరం దింపుడు కట్టపై కొలువుంచి ఉత్సవమూర్తికి పుష్పాభిషేకం జరిపారు. భక్తులు నైవేద్య, నారీకేళాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వేడుకకు హాజరయ్యారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలు, దివిటీలతో కందకూరు గ్రామానికి ఊరేగింపుగా బయలు దేరారు. రామలింగేశ్వస్వామి దేవాలయం ద్వార ప్రవేశం చేశారు. కర్నూలుకు చెందిన నాగేష్ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భారీ భక్తజన సందోహం మధ్య ఈరన్న స్వామి పల్లకోత్సవం పురవీధుల్లో వైభవంగా సాగింది. అనంతరం కందుకూరు నుంచి పల్లకి సాతనూరు, తిప్పలదొడ్డి, కరణి, మల్లనహట్టి, చిరుతపల్లి గ్రామాల మీదుగా ఉరుకుందకు రాత్రి 7 గంటలకు చేరుకుంది. ఉత్సవంలో ఉరుకుంద ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ చెన్నబసప్ప, ఈవో మల్లికార్జున ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బెట్టనగౌడ్ పాల్గొన్నారు. సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐలు ఇంతియాజ్‌బాషాలు బందోబస్తు నిర్వహించారు.