‘పల్లె’వెలుగులెప్పుడో?
ఇల్లెందు : పల్లెల శాపమో..అధికారుల కోపమో.. కానీ నేటికీ అనేక గ్రామాలు పల్లెవెలుగు బస్సులు ఎరుగవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బస్సులు నిండా ప్రయాణికులు ఎక్కక నష్టాలు సంభవిస్తున్నాయని, మినీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. అయితే బస్సు ఎరుగని పల్లెలకు ఈ మినీ బస్సులు ఎంతగానో ఉపయోగం... అలాంటి మినీ బస్సులు ఉన్నా పల్లెలకు మాత్రం రావటం లేదు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇల్లెందు ఒకటి. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా గతంలోని ఎర్రబస్సు ఎరుగని పల్లెలు సబ్ డివిజన్‌కు సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పక్కా రహదారుల్లో బస్సు ఎరుగని పల్లెలుండటం విశేషం. ఈ గ్రామాల నుంచి తమ పంట ఉత్పత్తులు తరలించటం, అవసరమైన ఎరువులు తీసుకొని వెళ్లటం, విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవటానికి పల్లె ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.
ఒకనాడు మారుమూల పల్లెలకు వెళ్లిన బస్సులు కూడా నేడు ఆ పల్లెలకు వెళ్లటం లేదు. 10 ఏళ్ల క్రితం ఇల్లెందు మండలంలోని అమర్సింగ్తండాకు వెళ్లిన బస్సులు నేడు వెళ్లటం లేదు. గతంలో ప్రైవేట్ బస్సులు తిరిగిన దనియాలపాడు గ్రామానికి బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ఇటీవల కాలంలో ధర్మాపురం, పూబెల్లి, రేలకాయలపల్లి, మామిడిగుండాల, లచ్చగూడెం గ్రామాలను బీటీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల ఇల్లెందు నుంచి మాణిక్యారం మీదుగా కొమరారం వరకు మాత్రమే ఏకైక సర్వీసును ప్రవేశపెట్టారు. ఇల్లెందు నుంచి ధర్మాపురం, పూబెల్లి, మొండితోగుల మీదుగా ఇల్లెందుకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా ఈ రూట్లలో ఆర్టీసీ అధికారులు ఏనాడు పరిశీలన చేయలేదు.
ఇల్లెందు బస్టాండ్ పరిధిలోని చీమలపాడు, కామేపల్లి, ఊట్కూరు, పూబల్లి, పూసపల్లి, ధర్మాపురం, మామిడిగుండాల, లచ్చగూడెం, రొంపేడు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. టేకులపల్లి మండలంలో ముత్యాలంపాడు నుంచి తడికెలపూడి, బొమ్మనపల్లి నుంచి కొండెంగులబోడు, మద్రాస్‌తండా, ముత్యాలంపాడు స్టేజీ వరకు పక్కా రహదారులు ఉన్నాయి. అనేక గ్రామాలకు ఇటీవల కాలంలో పీఎంజేఎస్వై, నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈ, ఆర్టికల్ 275 కింద పలు గ్రామాలకు పక్కా రహదారులు ఏర్పాటు చేశారు. అయినా ఈ పల్లెల్లో పల్లెవెలుగులు కనిపించటం లేదు. 30 మంది ప్రయాణికులతో కండక్టర్ లేకుండా వెళ్లే మినీ పల్లె వెలుగు బస్సులను ఈ రూట్లతో తిప్పితే ఆర్టీసీకి ఆదాయం, ప్రయాణికులకు ఉపయోగం ఉంటుంది. ఈ దిశగా మినీబస్ సర్వీసులను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.