పంచ వాహనాలపై పరిమళాచార్యుడు
– అను మంత్రాలయంలో రథోత్సవం
– రాఘవేంద్రుల దర్శించుకున్న నటి గీతాసింగ్
– మంగళవారంతో ముగిసిన రాయరు సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ రాఘవేంద్రస్వామి 345వ సప్తరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి రాఘవేంద్రులు పంచ వాహనాలపై ఊరేగించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆశీస్సులతో ఏడు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. సర్వ సమర్పణోత్సవంలో భాగంగా తురగ, గజ, సింహ, స్వర్ణపల్లకీ, చెక్క రథాలపై శ్రీమఠం మాడవీధులను చుట్టేశారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల హర్షధ్వానాల మధ్య రథయాత్ర చూడముచ్చటగా సాగింది. ఉదయం అను మంత్రాలయం (తుంగభద్ర) మత్తిక బందావన మఠంలో రథోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి అక్కడికి చేరుకుని రాయరు మృత్తిక బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం చెక్క రథంపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు, మృత్తిక బృందావన ప్రతిమను కొలువుంచి హారతులు పట్టారు. గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చి వేడుకలో తరించారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. రాత్రి సినీ నటి గీతాసింగ్ బృందవనాన్ని దర్శించుకున్నారు. ఆమె వెంట నిర్మాత నాగిరెడ్డి, రంగస్థల కళాకారుడు నారాయణ ఉన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :
ఉత్సవాల్లో భాగంగా యోగీంద్ర మండపంలో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్కు చెందిన రాఘవేంద్ర బృందం తాళవాయిద్య కచేరి వీనుల విందు చేసింది. బనగానపల్లెకు చెందిన అంజలి బృందం కూచిపూడి నాట్యం, హెచ్ఆర్ ఉన్నత్ భరతనాట్యం భక్తులను అలరించాయి.