పింఛన్ల అవినీతిపై సోషల్ ఆడిట్
నారాయణఖేడ్: ఆసరా పింఛన్ల పంపిణీపై త్వరలో సోషల్ ఆడిట్ జరుగుతుందని డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయన ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు రాని అర్హుల కోసం ప్రభుత్వం 16, 17 తేదీల్లో మరోసారి దరఖాస్తు చేసుకునేలా గ్రీవెన్స్ సెల్లో అవకాశం కల్పించిందన్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం నాలుగుసార్లు నిధులను ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ద్వారా విడుదల చేసిందన్నారు. ఒకటి, రెండుసార్లు చేసిన నిధుల విడుదలలో మూడు నెలల పింఛన్లను, తర్వాత నిధుల విడుదలలో ఒక నెల పింఛన్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు. కంగ్టిలో జరిగిన పింఛన్ల ప్రక్రియపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదించామన్నారు.
బ్యాంకు రికార్డులు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, ఆక్విటెన్సీ రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు మూఢ రాంచెందర రాజగిరి శ్రీనివాస్, సీపీఎం నాయకులు చిరంజీవిలు అనర్హులకు వచ్చే పింఛన్లను తొలగించి, అర్హులకు త్వరగా పింఛన్లను అందించాలని కోరారు.
కొన్ని గ్రామాల్లో ఒకే నెల పింఛన్లను అందిస్తున్నారని మూడు నెలల పింఛన్లను అందించాలని పీడీని కోరారు. పీడీ వెంట డీఆర్డీఏ ఏపీఓ సిధారెడ్డి, తహశీల్దార్ రాణాప్రతాప్‌సింగ్, ఇన్చార్జి ఎంపీడీఓ జాన్, ఖేడ్ ఈఓ వాసంతి తదితరులు ఉన్నారు.